ఉద్యమ నేపథ్యానికి పట్టం
ABN, First Publish Date - 2021-02-12T07:15:12+05:30
తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో పాటు

మోతె శ్రీలతాశోభన్‌రెడ్డిని వరించిన డిప్యూటీ మేయర్
ఉప్పల్/తార్నాక,పిబ్రవరి11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో పాటు రాజకీయ సమీకరణాలు కలిసి రావడంతో మోతె శోభన్‌రెడ్డి సతీమణి శ్రీలతకు డిప్యూటీ మేయర్ దక్కింది. టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా తార్నాకు చెందిన మోతె శోభన్‌రెడ్డికి ఉన్న గుర్తింపు, ఆయన సతీమణి శ్రీలతారెడ్డి తార్నాక నుంచి కార్పొరేటర్‌గా గెలవడం కలిసి వచ్చాయి. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచీ మోతే శోభన్ రెడ్డి తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ (టీటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2002లో తార్నాక డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ శ్రీలతశోభన్ రెడ్డి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ సకల జనుల సమ్మె, వంటావార్పు, మిలియన్ మార్చ్, రైల్‌రోకో, చలోడిల్లీ వంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
కుటుంబ నేపథ్యం
నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం, తుక్కూరు గ్రామానికి చెందిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచీ రాజకీయ నేపథ్యం ఉంది. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలల్లో పాల్గొన్నారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ స్థాపించక ముందు టీడీపీలో పని చేశారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ అడుగుజాడల్లో నడిచారు.
నాడు మేయర్.. నేడు డిప్యూటీ మేయర్
ఉప్పల్/తార్నాక, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): 2011లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తార్నాక నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన బండ కార్తీక రెడ్డిని మేయర్ పీఠం వరించింది. ఇప్పుడు మళ్ళీ అదే డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన శోభన్‌రెడ్డికి డిప్యూటీ మేయర్ పదవి వరించింది. దీనిపై డివిజన్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బండ కార్తీకరెడ్డి తోటి కోడలు బండ జయసుధపై 2,504 ఓట్లతో శ్రీలతారెడ్డి గెలుపొందడం మరో విశేషంగా చెప్పుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొట్టమొదటి మహిళా డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి కావడం మరో విశేషం.
Updated Date - 2021-02-12T07:15:12+05:30 IST