మా ఇళ్లు అమ్ముకుంటున్నారు.. హైటెన్షన్ టవర్ ఎక్కిన పేదలు
ABN, First Publish Date - 2021-12-31T11:58:35+05:30
మా ఇళ్లు అమ్ముకుంటున్నారు.. హైటెన్షన్ టవర్ ఎక్కిన పేదలు
- తిరుమలగిరి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల వద్ద హై డ్రామా
హైదరాబాద్ సిటీ/తిరుమలగిరి : ‘మాకు కేటాయించిన వాంబే ఇళ్లను కొందరు నాయకులు లక్షల రూపాయలకు అమ్ముకొంటూ మా కడుపు కొడుతున్నారు’ అని ఆరోపిస్తూ కొందరు నిరుపేదలు గురువారం హైటెన్షన్ స్తంభం ఎక్కి ఆందోళనకు దిగారు. కంటోన్మెంట్‌లోని తిరుమలగిరి సాయిబాబా హట్స్‌కు చెందిన శంకరమ్మ, రాములమ్మ, రాజు, మహేష్, లక్ష్మణ్‌లు తిరుమలగిరి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల వద్ద ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కారు. తమకు ఇళ్లు కేటాయించే వరకు టవర్ దిగబోమని, దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పేరు చెప్పి స్థానికంగా ఉన్న నాగేంద్ర, కుర్మయ్యలు రూ.3లక్షలకు అమ్ముకుంటున్నారని తమ పేర్లు పట్టాల లిస్టునుంచి తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలున్న వారి నుంచి రూ.రెండు లక్షలు, పట్టాలు లేని వారినుంచి మూడు లక్షలు తీసుకుంటూ ఇళ్లు విక్రయిస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న బోర్డు మాజీ సభ్యుడు ప్యారసాని శ్యామ్‌కుమార్, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సీఐ శ్రవణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ రవి కుమార్‌లు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. తిరుమలగిరి ఎమ్మార్వో మాధవి రెడ్డి, బేగంపేట్ ఏసీపీ నరేష్ రెడ్డి, నార్త్ జోన్ అదనపు డీసీపీ చేరుకొని వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మార్వో మాధవి రెడ్డి మాట్లాడుతూ 56 ఇళ్లు ఖాళీగా ఉన్నాయని 46 మందికి ఇళ్లు ఇచ్చామని కలెక్టర్‌తో మాట్లాడి అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది క్రేన్‌ద్వారా వారిని కిందకి తీసుకొచ్చారు. కాగా నాగేంద్ర, కుర్మయ్యను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Updated Date - 2021-12-31T11:58:35+05:30 IST