ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ప్రబలుతుంటే.. సర్వేకు కమిటీలేంటి!?

ABN, First Publish Date - 2021-05-09T07:55:43+05:30

‘‘కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ దేవరయాంజాల్‌ ఆలయ భూముల సర్వేకు కమిటీ వేస్తూ జీవో ఎందుకు? శుక్రవారం మా పొరుగింట్లో ఒకరు మృతి చెందారు? దహన సంస్కారాలకు శ్మశానాల్లో శవాలు బారులు తీరుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • శ్మశానాల్లో శవాలు బారులు తీరుతున్నాయ్‌
  • పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయ్‌
  • ఈ సమయంలో భూముల సర్వేకు జీవోలేంటి?
  • ఎప్పట్నుంచో వివాదం.. తక్షణమే విచారణ ఎందుకు?
  • అన్నీ అడ్డదారుల్లో కానిచ్చేస్తామంటే ఎలా?
  • అనుమతి లేకుండా ఎవరి భూముల జోలికిపోవద్దు
  • వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయండి: హైకోర్టు
  • దేవరయాంజాల్‌ భూముల వ్యవహారంలో సర్కారుకు హైకోర్టు అక్షింతలు


హైదరాబాద్‌ మే 8 (ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ దేవరయాంజాల్‌ ఆలయ భూముల సర్వేకు కమిటీ వేస్తూ జీవో ఎందుకు? శుక్రవారం మా పొరుగింట్లో ఒకరు మృతి చెందారు? దహన సంస్కారాలకు శ్మశానాల్లో శవాలు బారులు తీరుతున్నాయి. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ జోక్యం చేసుకున్న తర్వాత రాత్రి 9 గంటలకు స్లాటు దొరికింది. పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతుంటే.. భూముల సర్వేకు ఇప్పుడు కమిటీ ఎందుకు? అన్నీ దొడ్డిదారిలో కానిచ్చేస్తాం అంటే ఎలా? అత్యవసరంగా ఈ జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ జీవోను ఏ చట్ట పరిధిలో జారీ చేశారు?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. సెకండ్‌వేవ్‌ విరుచుకుపడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ఇప్పుడు కమిటీ ఎందుకని ప్రశ్నించింది. దేవరయాంజాల్‌ భూములపై 1996 నుంచే వివాదం నెలకొని ఉందని, అనేక పిటిషన్లు కోర్టుముందు ఉన్నాయని, ఇప్పుడు తక్షణమే విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ‘‘ఒక్క శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూములపైనే ఎందుకు!? అనేక ఆలయాల భూములు కబ్జాకు గురయ్యాయి. 


గచ్చిబౌలిలోని శ్రీరంగనాథస్వామి ఆలయ భూముల్లో ఓ బిల్డర్‌ 20 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేసి నిర్మాణాలు చేపట్టారు. దాన్ని ఎందుకు పట్టించుకోరు?’’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. దేవరయాంజాల్‌ గ్రామ పరిధిలోని తమ భూముల్లో అధికారులు చొరబడి సర్వే చేయడాన్ని ప్రశ్నిస్తూ సదా సత్యనారాయణరెడ్డి, మరో నలుగురు రైతులు హౌస్‌మోషన్‌లో దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు శనివారం ఉదయం విచారించింది. ఆలయ భూముల వ్యవహారంలో సర్కారుకు అక్షింతలు వేసింది. పిటిషనర్లను ఆక్రమణదారులుగా పేర్కొనడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. ఇవి ఆలయ భూములని రుజువు చేసేవరకు పిటిషనర్లను ఆక్రమణదారులుగా పేర్కొనడం సరికాదని స్పష్టంచేశారు. పిటిషనర్ల భూములతోపాటు ఎవరి భూముల్లోకీ చొరబాట్లు చేయరాదని నిర్దేశించారు. పిటిషనర్ల అనుమతి లేకుండా వారి ఆస్తుల్లోకి ప్రవేశించరాదని తెలిపారు. చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి.. తగిన సమయం ఇచ్చిన తర్వాత సర్వే చేయాలని స్పష్టంచేశారు. సర్వేకు నలుగురు ఐఏఎ్‌సలతో కమిటీ వేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1014పై పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేశారు. 


భూములు పిటిషనర్లవే..!

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌ రెడ్డి వాదించారు. ఈ భూములపై పిటిషనర్లకు 1943 నుంచే హక్కులు, సేల్‌ డీడ్స్‌ ఉన్నాయన్నారు. సర్వే పేరుతో ప్రభుత్వం నియమించిన కమిటీలోని అధికారులు పిటిషనర్ల భూముల్లో చొరబడి లీజుకు తీసుకున్న వారిని ఖాళీ చేయాలని భయపెడుతున్నారని తెలిపారు. వీటిని ఆలయ భూములుగా నిర్ధారించడమే కాకుండా 2004 జనవరి 27న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారని, వాటిపై తాము ట్రైబ్యునల్‌కు వెళ్లామని వివరించారు. ట్రైబ్యునల్‌ తమ అభ్యర్థనను తోసిపుచ్చడంతో 2005లో హైకోర్టును ఆశ్రయించామని, 2010 ఆగస్టు 26న హైకోర్టు తీర్పు వెలువరించిందని, ఈ భూములకు సంబంధించి ఆలయానికి ఎలాంటి హక్కులు లేవని, పిటిషనర్లను ఖాళీ చేయించరాదంటూ ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అవి ఆలయ భూములేనని రుజువు చేసుకున్న మీదటే ఎవిక్షన్‌ నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసిందని తెలిపారు. 


ఆధారాల్లేకుండానే దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 83 కింద పిటిషనర్లను ఆక్రమణదారులుగా పేర్కొనడం సరికాదన్నారు. సెక్షన్‌ 87(1)(సి) ప్రకారం ఆలయానికి భూములు ఎలా సంక్రమించాయి? ఎవరు దానం చేశారు? వారికి ఈ భూములపై ఉన్న హక్కులేమిటో రుజువు చేయాల్సి ఉందన్నారు. అయితే, ఆక్రమణకు గురవుతున్న ఆలయ భూముల సర్వేకు జీవో జారీ చేసే సంపూర్ణ అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వివరించారు. సీతారామచంద్రస్వామి ఆలయానికి సుమారు 1,393 ఎకరాల భూమి ఉందన్నారు. సర్వే చేసి వాటిని సంరక్షించాల్సి ఉందన్నారు. పిటిషనర్లు తమవేనని చెబుతున్న భూములు ఆలయానికి చెందిన భూములన్నారు. ఇక్కడి భూములకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం నెలకొని పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లినట్లు తెలిపారు. దాంతో, భూ వివాదం ఉంటే వెళ్లాల్సింది పోలీసు స్టేషన్‌కు కాదని, సివిల్‌ కోర్టుకని న్యాయమూర్తి సూచించారు. మీ వాదనలు కొంత వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్ల స్వాధీనంలోని ఆస్తుల్లోకి ఎలా వెళతారు? వారికి రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు, లీజు డీడ్స్‌ ఉన్నాయి. 


జిల్లా కలెక్టర్‌ ద్వారా సబ్‌ రిజిస్ర్టార్‌ నుంచి ఆయా డాక్యుమెంట్లను సేకరించి కార్యాలయంలోనే కూర్చుని ప్రాథమిక సర్వే పూర్తి చేయవచ్చు’’ అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ భూముల్లో నిర్మాణాలకు ఎటువంటి అనుమతుల్లేవని ఏజీ వివరించగా.. అనుమతుల్లేకపోతే ముందు నోటీసులు జారీ చేసి, అక్రమ నిర్మాణాలుగా నిర్ధారించి అప్పుడు చట్ట ప్రకారం చర్యలు చేపట్టవచ్చని న్యాయమూర్తి సూచించారు. అయితే, ఈ భూములు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయని, 1925లో అప్పటి నిజాం ఫర్మానా జారీ చేశారని, ఇవి ముమ్మాటికీ ఆలయ భూములేనని ఏజీ చెప్పారు. అయితే, ఆయన వాదనలు నిజం కాదని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది వివేక్‌ రెడ్డి అన్నారు. 2004లో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జారీచేసిన ఎవిక్షన్‌ నోటీసులు, ఆ తర్వాత ట్రైబ్యునల్‌ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టును కొట్టివేసిందన్నారు. ఈ భూములు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రాకమునుపు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేవని, అప్పటి గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్న మీదటే నిర్మాణాలు చేసినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల భూముల జోలికి పోరాదని స్పష్టం చేశారు. జీవోపై ప్రభుత్వానికి, ఆలయ స్పెషల్‌ ఆఫీసర్‌కు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.

Updated Date - 2021-05-09T07:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising