దళిత బంధుపై కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2021-08-15T00:48:37+05:30
దళిత బంధు పథకంపై మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితబంధును పూర్తిస్థాయిలో...
జనగామ: ‘దళితబంధు’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ పథకాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలను మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి తప్పుబట్టారు. చౌకబారు విమర్శలు మానుకోవాలని విపక్షాలకు సూచించారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతే నష్టం జరిగేది టీఆర్ఎస్ పార్టీకే కాబట్టి ఆ విషయం తమకు తెలుసని అన్నారు.
పథకం గురించి శ్రీహరి మరిన్ని వివరాలిస్తూ.... ‘‘దళిత బంధు చరిత్ర సృష్టించబోతోంది. దళితబంధుకు ప్రతి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. ప్రతి ఏడాది దాదాపు రూ. 25 వేల కోట్లు కేటాయించబోతున్నాం. దళితులకు ఇది మెరుగైన పథకం. దళితుల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడైనా దళితబంధు పథకం కంటే మెరుగైన పథకం ఏ రాష్ట్రమైనా అమలు చేస్తుంటే మా దృష్టికి తీసుకురండి. ఆ పథకాన్ని అధ్యయనం చేసి అమలు చేస్తాం. మేం సింహంపై స్వారీ చేస్తున్నాం. సింహంపై కూర్చున్నంత సేపే దాన్ని నడిపించగలుగుతాం. దిగితే అది మమ్మల్ని తినేస్తది. ఈ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేసినా.. పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినా మా ప్రభుత్వమే తీవ్రంగా నష్టపోతుంది. దళితుల అభ్యున్నతి, భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని దళితబంధు నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ పార్టీలు చౌకబారు విమర్శలు మానుకోవాలి’’ అన్నారు.
Updated Date - 2021-08-15T00:48:37+05:30 IST