రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : చల్లా
ABN, First Publish Date - 2021-12-25T06:41:03+05:30
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : చల్లా
సంగెం, డిసెంబరు 24: రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంతోపాటు నల్లబెల్లిలో వ్యవసాయ గోదాంల నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సంగెం సొసైటీ ఆవరణలో చైర్మన్ వేల్పుల కుమారస్వామి యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని రైతాంగం పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన సీఎం కేసీఆర్ వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని తలంచి రైతుబంధును అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంగెం సొసైటీని అభివృద్ధిపర్చి రైతులకు మరిన్ని రుణాలు అందించేందుకు సొసైటీ సభ్యులు పాలకవర్గానికి సహకారం అందించాలని సూచించారు. డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 70కిపైగా సొసైటీల పరిధిలోని రైతాంగానికి పంటలు పండించుకునేందుకు సుమారు రూ.1400 కోట్లకు పైగా రుణాలు అందించి రాష్ట్రంలో ముందంజలో నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, డీసీవో సంజీవరెడ్డి, అదనపు రిజిస్ట్రార్ రేణుక, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు నరహరి, తహసీల్దార్ రాజేంద్రనాథ్, ఎంపీడీవో మల్లేశంగౌడ్, వ్యవసాయాధికారి యాకయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తిమ్మాపురం జంక్షన్ అభివృద్ధి
సంగెంమండలంలో రోడ్లను అభివృద్ధి పర్చేందుకు తగిన నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే ధర్మారెడ్డి చెప్పారు. తిమ్మాపురం గ్రామాన్ని శుక్రవారం సందర్శించి ప్రభుత్వ పాఠశాల వద్ద గల జంక్షన్ నిర్మాణం ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. పాఠశాలను ఆనుకుని ఉన్న ప్రహరి మరింత తొలగించాలని సూచించారు.
Updated Date - 2021-12-25T06:41:03+05:30 IST