లాభసాటి వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం-మంత్రి జగదీష్ రెడ్డి
ABN, First Publish Date - 2021-06-25T21:11:59+05:30
ఎకరం పొలంలో చేసే సాగుకు ఆదాయం లక్ష రూపాయలు దాటించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
సూర్యాపేట: ఎకరం పొలంలో చేసే సాగుకు ఆదాయం లక్ష రూపాయలు దాటించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలు అమలు పరుస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. లాభసాటి వ్యవసాయం వైపు రైతాంగాన్ని మళ్లించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని అందుకు తగినట్లుగా రైతులు నిర్ణయం తీసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్పహాడ్ మండలం గాజుల మొల్కాపురం గ్రామంలో ఏరువాకలో పాల్గొన్నారు. కృషివిజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో సుమారు వందకు పైగా నాగళ్ళతో మొదలైన ఏరువాక కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా నాగలి దున్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ భారతీయ సనాతన సంస్కృతి, జీవన విధానానికి వెన్నెముక వ్యవసాయం అని ఆయన అన్నారు.అటువంటి వ్యవసాయం చేయడం మహా యజ్ఞం అని దీనికి ప్రధాన పనిముట్టు నాగలి ముఖ్యమైన వనరు వర్షం అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్టంలో 2014 కు ముందు అంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు ముందు వరుస కరువులు, ఆకలి చావులు,ఆత్మహత్యలతో ఈ ప్రాంతం దుర్భిక్షంగా మారిందన్నారు.అటువంటి రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుభిక్షంగా మార్చారన్నారు.మూడేండ్ల వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు.
యావత్ భారతదేశంలో వరి దిగుబడిలో మొదటిస్థానం లో ఉన్న పంజాబ్ ను మించి తెలంగాణా రికార్డ్ సృష్టించిందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమే కారణమని ఆయన కొనియాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ నందించడం తో పాటు,కోటి ఎకరాల మాగాణాన్ని సాగులోకి తెచ్చామన్నారు.అంతే గాకుండా ఋణమాఫీ ని ఒకవైపు అమలు పరుస్తూనే వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని రైతుబందు పధకం కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టి ఆర్ యస్ ప్రభుత్వం అని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత నే ప్రధాన కారణమని ఆయన చెప్పారు.
Updated Date - 2021-06-25T21:11:59+05:30 IST