భగత్‌కు 30వేల మెజారిటీ ఖాయం
ABN, First Publish Date - 2021-04-05T06:15:16+05:30
టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ 30వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నల్లగొండ, మార్చి4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ 30వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, మూడు నెలలుగా ప్రతి మూడు రోజులకు వస్తున్న సర్వే నివేదికలు అవే చెబుతున్నాయన్నారు. ఏనాడూ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గ్రాఫ్ పెరగలేదని అన్నారు. భగత్ యువకుడు కూడా కావడంతో యూత్ ఆయన వైపే చూస్తోందని, నర్సింహయ్య మృతితో సానుభూతి కూడా భగత్‌కే ఉందని, ఆ మేరకు గ్రామ పెద్దలు ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టు సర్వేల్లో ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని, పదవీ కాలం కూడా ఇంకా రెండేళ్లే మిగిలి ఉండటం వల్ల, తండ్రి మృతిచెందిన పిల్లవాడు బరిలో నిలుచున్నందున ఆ కుటుంబాన్ని గౌరవిస్తూ జానారెడ్డి పోటీ నుంచి ఉపసంహరించుకుంటే మంచిదని, ఈ విషయాన్ని ముందే పబ్లిక్‌గా సూచించానని అన్నారు. ఏడుమార్లు గెలుపొందిన జానారెడ్డి ఎన్నడూ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు. మండలానికి ఒక సామంత రాజుని నియమించుకొని ప్రజలకు ఆయన దూరమయ్యారన్నారు. సాగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నది రెండేళ్లే కాగా, అందులో ఒక ఏడాది కరోనాకే పోయిందన్నారు. దీంతో తమ మార్కును పూర్తిగా చూపించలేకపోయామన్నారు. భగత్‌ను గెలిపించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. పోలీసు వాహనాల్లో డబ్బు, మద్యం పంపిణీ వంటి ఉత్తమ్ మాటల కారణంగా జానారెడ్డికే నష్టం జరుగుతుందన్నారు. నోముల బతికుండగానే మిషన్ భగీరథ ఇచ్చారని, తాజాగా డిగ్రీ కళాశాల, 30వేల ఎకరాలకు సాగునీరు అందించే నెల్లికల్లు లిఫ్ట్, హాలియా పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులకు జీవోలు జారీ అయ్యాయన్నారు.
Updated Date - 2021-04-05T06:15:16+05:30 IST