ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సంక్షేమం’తోనే సరి!

ABN, First Publish Date - 2021-08-22T08:52:55+05:30

‘‘సంక్షేమం విషయంలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం చేరని ఇల్లే లేదు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా సంక్షేమ పథకాలకే
  • ఖజానాకు నెలకు సగటున రూ.10 వేల కోట్ల రాబడి
  • ప్రధాన పథకాలకు అవుతున్న ఖర్చు 11 వేల కోట్ల పైనే
  • జీతాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపునకు వెతుకులాటే
  • పెట్టుబడులు, మౌలిక సౌకర్యాల కల్పనకు.. అప్పులే దిక్కు!
  • కొత్తగా ‘దళితబంధు’ పేరిట అమల్లోకి భారీ పథకం 


హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘సంక్షేమం విషయంలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకం చేరని ఇల్లే లేదు’’.  సీఎం కేసీఆర్‌ ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలివి. ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ  పథకాలు అమలవుతున్నాయి. వాటికి భారీగా నిధులు ఖర్చవుతున్నాయి. అవి ఏ స్థాయిలో అంటే.. ఖజానాకు వచ్చే ఆదాయంలో 87 శాతానికి పైగా నిధులను ఈ పథకాలకే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.


ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో కలుపుకొంటే.. ప్రభుత్వానికి వచ్చే నికర ఆదాయం కన్నా ఎక్కువ నిధులు అవసరమవుతున్నాయి. దీంతో వివిధ రంగాల్లో పెట్టుబడులు, మౌలిక సౌకర్యాల కల్పన కోసం వెచ్చించేందుకు నిధుల్లేక.. అప్పులు చేయడంతోపాటు ప్రభుత్వ ఆస్తులను విక్రయించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదాహరణకు.. ఈ ఏడాది జూన్‌లో జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, అమ్మకం పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీలు, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నులు, పన్నేతర రాబడి, గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌ కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.10,218 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే రైతుబంధు, ఆసరా పెన్షన్లు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్లు, వడ్డీలేని రుణాలు, గొర్రెల పంపిణీ, రేషన్‌ బియ్యం, పారిశ్రామిక రాయితీలు, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి వంటి పథకాలకు కలిపి రూ.7734 కోట్లు చెల్లించాల్సివచ్చింది. వీటికితోడు గతంలో చేసిన అప్పులకు సంబంధించి వాయిదా, దానిపై వడ్డీ కలిపి రూ.1247 కోట్లు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు దాదాపు రూ.2500 కోట్లు చెల్లించింది. మొత్తంగా జూన్‌లో రూ.11,477 కోట్లు ఖర్చయ్యాయి. అంటే.. విధిగా చెల్లించాల్సిన వాటికే లోటు ఏర్పడుతోంది. 


‘దళిత బంధు’కు నెలకు రూ.3333 కోట్లు!

జూన్‌తో పోలిస్తే.. జూలైలో ప్రభుత్వ ఆదాయం కొంత మేర పెరిగి ఉండవచ్చన్న అంచనా ఉన్నా.. ఖజానాలో పెద్దమొత్తంలో నిధులు మిగిలే అవకాశంలేదు. దీంతో వివిధ రంగాల్లో పెట్టుబడులకు నిధులు సమకూర్చడమన్నది ప్రభుత్వానికి సవాలుగానే మారనుంది. వ్యవసాయ రంగాన్ని అబివృద్ధి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతోపాటు విద్య, వైద్యం, రహదారులు వంటి మౌలిక సౌకర్యాల కల్పనకు నిధుల సమస్య తలెత్తనుంది. వీటికోసం అప్పులు తేవడమో, ప్రభుత్వ ఆస్తులను విక్రయించడమో తప్పని పరిస్థితి. ప్రభుత్వ బాండ్ల అమ్మకం వంటి వాటి ద్వారా వచ్చే మొత్తాన్ని ఆదాయంగా బడ్జెట్‌లో సూచిస్తోంది. ఈ అప్పులతోనే పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోంది. అయితే ప్రభుత్వం తాజాగా ‘దళిత బంధు’ పేరిట భారీ పథకాన్ని ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ ఇటీవల హుజూరాబాద్‌లో దీనిని ప్రారంభిస్తూ.. ఈ పథకానికి ప్రతి ఏటా రూ.30-40 వేల కోట్లు కేటాయించుకుందామంటూ ప్రకటించారు. ఏడాదికి రూ.40 వేల కోట్లను కేటాయిస్తే.. నెలకు రూ.3,333 కోట్లను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇది బడ్జెట్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతుంది? నిధుల సమీకరణ ఎలా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. 


ఆదాయం అత్తెసరే..

వాస్తవానికి రాష్ట్రంలో రాబడులు భారీగా తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌, మే, జూన్‌)లో జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, అమ్మకం పన్ను, ఎక్సైజ్‌ డ్యూటీలు, కేంద్ర పన్నుల వాటా, ఇతర పన్నులు, పన్నేతర రాబడి, గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌ కలిపి రూ.24,629.17 కోట్లు వచ్చాయి. అంటే.. నెలకు సగటున రూ.8209.72 కోట్ల రాబడి వచ్చినట్లయింది. 2021-22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో ఈ రెవెన్యూ రాబడులు రూ.1,76,126.94 కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీని ప్రకారం.. నెలకు సగటున రూ.14,677.24 కోట్లు సమకూరాలి. మూడు నెలలకు కలిపి రూ.44,031,72 కోట్ల మేర ఆదాయం రావాలి. అయితే కరోనా పరిస్థితుల వల్ల ఆదాయం సమకూరలేదు. సగటున నెలకు 8209 కోట్లే వచ్చాయి. 


ఇప్పటికే 44.8% మేర అప్పు

రాబడులు తగ్గడం, మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎంతో కొంత మేర తప్పనిసరిగా చెల్లిస్తుండడంతో.. ఉద్యోగుల వేతనాలకు, పెన్షన్లకు, ప్రభుత్వం తీసుకున్న అప్పులపై వడ్డీలకు నిధులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ‘అప్పుల బాట’ పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు 15 వరకు నాలుగున్నర నెలల కాలంలో రూ.20,391.64 కోట్ల అప్పు చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం... జీఎ్‌సడీపీలో 5 శాతం మేర అప్పు తీసుకునే అవకాశముండటంతో ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో రూ.45,509.59 కోట్ల అప్పును సేకరించాలని నిర్దేశించుకుంది. అంటే.. ఇప్పటికే 44.80 శాతం పూర్తయింది. మిగతా ఏడున్నర నెలల కాలంలో 55 శాతంగా రూ.25,117.85కోట్ల అప్పునే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్పు సరిపోతుందా అనేది రాబడులను బట్టి తేలునుంది. 

Updated Date - 2021-08-22T08:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising