ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రాజకీయ వేడి

ABN, First Publish Date - 2021-07-07T08:19:51+05:30

రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికార, విపక్షాలు పరస్పరం పైచేయి సాధించటానికి కాలు దువ్వుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యూహ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూకుడు..

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ బాధ్యతల స్వీకరణ నేడు

రేపు షర్మిల పార్టీ ఆవిర్భావం

ఆగస్టు 9 నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముందు..

తెలంగాణలో అనూహ్య పరిణామాలు

అందరి లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికలే


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికార, విపక్షాలు పరస్పరం పైచేయి సాధించటానికి కాలు దువ్వుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ విషయంలో ఒక్కో పార్టీ ఒక్కో పంథాను అనుసరిస్తున్నప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలే అందరి లక్ష్యంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి కొంచెం అటు, ఇటుగా రెండున్నర ఏళ్ల వ్యవధి ఉన్నప్పటికీ, ఇప్పటినుంచే పార్టీల కార్యక్రమాలు ఊపందుకోవడం, నాయకుల ప్రకటనల్లో వాడి పెరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల వరకు రాజకీయాలు జోరుమీదున్నాయి.


టీఆర్‌ఎ్‌స-కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌స-బీజేపీ మధ్య వైరం చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో ఉండగా, రెండు, మూడు స్థానాల కోసం కాంగ్రెస్‌, బీజేపీ గట్టిగానే పోటీ పడ్డాయి. ఊహించని విధంగా రాష్ట్రంలో మార్చి 2020లో కరోనా తొలి కేసు నమోదయ్యాక, అన్ని వ్యవస్థలు స్తంభించినట్లుగానే, రాజకీయ కార్యకలాపాలు మందగించాయి. మధ్య మధ్యలో దుబ్బాక, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటికీ, పార్టీల దూకుడు ఆయా ఎన్నికలకే పరిమితమైంది. ఇటీవల కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, భూ కబ్జా ఆరోపణలతో కేబినెట్‌ నుంచి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ కావటం, ఆయన టీఆర్‌ఎ్‌సను వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరటంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో వేగం పెరిగింది. ఈటల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుండటం కూడా అందుకు కారణమైంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల్లోనూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నింటికంటే మించి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.


శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇదివరకటి స్థాయిలో చలోక్తులతో ప్రసంగాలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. గ్రామ సభలు, సహపంక్తి భోజనాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కృష్ణా నదీ జలాలను ఏపీ ప్రభుత్వం దోచుకెళ్తూ, అన్యాయం చేస్తోందంటూ తెలంగాణ సెంటిమెంట్‌ను రగలిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు టీపీసీసీ అధ్యక్షుడి మార్పుపై నిర్ణయం తీసుకుంది. కొత్త అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ రేవంత్‌రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చాణక్యం, వరుస ఓటముల కారణంగా రాష్ట్రంలో బలహీనపడ్డ కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌రెడ్డి చీఫ్‌ కావటం టానిక్‌గా పనిచేస్తుందనే చర్చ జరుగుతోంది. మాటల్లో, చేతల్లో దూకుడు ప్రదర్శించే ఆయన, కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎ్‌సలో చేరిన నేతలను రాళ్లతో కొట్టి చంపండి అని ఇప్పటికే పిలుపునిచ్చారు. పార్టీలోని అసంతృప్తులను వ్యూహాత్మకంగా చల్లార్చటానికి, అందరివాడిగా గుర్తింపు పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు టీఆర్‌ఎస్‌, బీజేపీ విషయంలో ఆయన వైఖరి దుందుడుకుగా ఉండే అవకాశాలున్నాయి.


రంగంలోకి బండి సంజయ్‌..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర ముగింపు హుజూరాబాద్‌లో ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 8 నుంచి జిల్లాల పర్యటనలకూ సిద్ధమయ్యారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజయాలతో అందివచ్చిన ఊపును పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో నిలబెట్టుకోలేకపోయిన బీజేపీ, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నాటికి పుంజుకోవటానికి సంజయ్‌ పాదయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చెల్లెలు వైఎస్‌ షర్మిల గురువారం రాష్ట్రంలో వైఎ్‌సఆర్‌ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఆమె వివిధ జిల్లాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై స్పందించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర నలుమూలలకు వెళ్లటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.


విపక్షాలన్నీ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నప్పటికీ, ప్రధానంగా అధికార టీఆర్‌ఎ్‌సను లక్ష్యంగా చేసుకోవటంలో దూకుడు ప్రదర్శించటానికి సిద్ధమవుతున్నాయి. వాటిని నిలువరించి, తన ఆధిపత్యాన్ని కొనసాగించే ఎత్తుగడలతో టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో విజయం వంటి తక్షణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అంతిమ లక్ష్యంగా తమ ప్రతి కదలికను ప్లాన్‌ చేసుకుంటున్నాయి.

Updated Date - 2021-07-07T08:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising