ఐస్ క్రీం అమ్మినంతా ఈజీ కాదు.. విరాళాలు సేకరించడం: రఘునందన్‌రావు
ABN, First Publish Date - 2021-02-01T21:36:22+05:30
రాముడి గుడికి నిధుల సేకరణంటే ఐస్ క్రీం అమ్మి ఐదు లక్షలు సంపాదించినంతా ఈజీ కాదని.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: రాముడి గుడికి నిధుల సేకరణంటే ఐస్ క్రీం అమ్మి ఐదు లక్షలు సంపాదించినంతా ఈజీ కాదని.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ తలుచుకుంటే అయ్యేదేమీ లేదన్నారు. టీఆర్ఎస్ నేతలను రెచ్చిపోమని కేటీఆరే ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు. రామమందిరం కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా నిధులు ఇస్తున్నారు. అయోధ్యా రాముడి నిధి సేకరణపై భద్రాద్రి గుడి వద్ద చర్చకు కేటీఆర్ సిద్దమా అని రఘునందన్‌రావు సవాల్ విసిరారు.
రామదండు కదిలితే రాష్ట్రం కిష్కిందకాండ అవుతోందని.. బాధ్యత వహించటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. గతంలో రాముడు కోసం రామదండు ఏమి చేసిందో ఇప్పుడు అదే జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామదండు కదిలితే ప్రగతి భవన్, ఫాంహౌస్, టీఆర్ఎస్ నేతల కాంట్రాక్ట్‌లు ఉంటాయా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని రఘునందన్‌రావు హెచ్చరించారు. పోలీసులు కాఖీ డ్రెస్ తీసి.. పింక్ డ్రెస్ వేసుకోవాలని ఎద్దేవా చేశారు. పరకాల, వరంగల్‌లో బీజేపీ నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును బీజేపీ కార్యకర్తలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తోందని హెచ్చరించారు. అయోధ్య రాముడుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రఘునందన్‌రావు పేర్కొన్నారు.
Updated Date - 2021-02-01T21:36:22+05:30 IST