శ్రమదోపిడీ!
ABN, First Publish Date - 2021-11-03T04:41:44+05:30
వివిధ రంగాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల
- వలస కార్మికులతో వెట్టిచాకిరీ
- బానిస బతుకులుగా మారుతున్న జీవితాలు
- అమలుకు నోచని అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం
- షాద్‌నగర్ నియోజకవర్గంలో 13వేల మంది వలస కార్మికులు
షాద్‌నగర్ : వివిధ రంగాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల బతుకులు దుర్భరంగా సాగుతున్నాయి. శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. ఎక్కడి నుంచో వచ్చి పనులు చేస్తున్న కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉపాధి అవకాశాలు లేక పనులు వెతుక్కుంటూ వచ్చినవారు అనేక సమస్యలు ఎదుర్కొం టున్నారు. పగలు, రాత్రి అనక శ్రమిస్తుంటారు. రోజుకూ 8 గంటలు పని చేయాల్సివున్నా 12గంటలు పని చేస్తుంటారు. అయినా నెలకు వచ్చే డబ్బులను చూస్తే కన్నీళ్లు రావాల్సిందే.. చాలీచాలని జీతాలతో బతుకు వెళ్లదీస్తున్న వలస కార్మికుల వెతలను పట్టించుకునే నాథుడే లేరు.
పని ఎక్కువ.. వేతనం తక్కువ
కార్మికశాఖ నిబంధనల ప్రకారం ప్రతీ కార్మికుడు రోజుకూ 8గంటలు మాత్రమే పని చేయాలి. కానీ వలసజీవుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రోజుకూ 14గంటలు పని చేయిస్తున్నారు. నాలుగు గంటలు అదనంగా పనిచేస్తున్నా వారికి చెల్లించే కూలి డబ్బులు రోజుకూ రూ.200 నుంచి రూ.250 మాత్రమే. వసల కార్మికులను లేబర్ సప్లయ్ కాంట్రాక్టర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అసలే జీతాలు తక్కువంటే.. అందులో నుంచి లేబర్ సప్లయ్ కాంట్రాక్టర్లు సగం దోచుకుంటున్నారు. ఉదాహరణకు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు రోజువారి కూలి కింద రూ.500 చెల్లిస్తుంటే అందులో సగం జీతాన్ని లేబర్ సప్లయర్స్ దోచుకుంటున్నారు. ఆయా పరిశ్రమలకు లేబర్ సప్లయ్ చేయాలంటే కార్మిక శాఖ నుంచి లైసెన్స్ పొంది ఉండాలి. కానీ ఎలాంటి లైసెన్స్‌లు లేకుండానే వలస కార్మికులను సప్లయ్ చేస్తున్నా కార్మికశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
పత్తాలేని అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం
వలస కార్మికుల సంక్షేమం, కనీస వేతన అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర వలసకార్మిక చట్టం-1979 ప్రవేశపెట్టింది. ఈచట్టం ప్రకారం వారికి కనీస వేతనాలు, ఈఎ్‌సఐ, పీఎఫ్, బేసిక్ పే ఆధారంగా ప్రతీ ఏడాది వేతనాల పెంపులాంటి చర్యలు చేపట్టాలి. ఈ చట్టాన్ని రాష్ట్ర కార్మికశాఖ అధికారులు తుంగలో తొక్కారు. అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకున్నా ప్రయోజనం చేకూరడం లేదు. పరిశ్రమల్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే వారి వివరాలను పరిశ్రమల యాజమాన్యాలు బయటకు తెలియనీయడం లేదు. వారి కుటుంబసభ్యులను పిలిపించి కేవలం రూ. 10వేల నుంచి రూ.20వేల పరిహారం చెల్లించి వారి సొంత రాష్ర్టాలకు మృతదేహాలను పంపిస్తున్నారు. ఇతరరా ష్ర్టాల వారు కావడంతో కార్మికుల కుటుంబసభ్యులు కూడా ఎదురుతిరగకుండా అక్కడినుంచి వెళ్లిపోతున్నారు.
నియోజకవర్గంలో 13వేల మంది వలస జీవులు
షాద్‌నగర్ నియోజకవర్గంలో మొత్తం 16వేల మంది కార్మికులు ఉండగా, అందులో 13వేల మంది వలస కార్మికులున్నారు. ఎక్కువగా ఒడిస్సా, బిహార్, రాజస్థాన్, ఛత్తీ్‌సగడ్ రాష్ర్టాలకు చెందినవారున్నారు. వీరందరికీ ఉండటానికి ఇండ్లు, తినడానికి తిండి లాంటి సౌకర్యాలు కూడా పరిశ్రమల యాజమాన్యాలు కల్పించడం లేదు. రోడ్లకు ఇరువైపులా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.
చట్టం ఉన్నా.. తప్పని కష్టం
వలస కార్మికుల కోసం అంత ర్రాష్ట్ర వలస కార్మిక చట్టం ఉన్నా కార్మికులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. కనీస వేతనాలు చెల్లించడం లేదు. ఎక్కువగా క్వారీలు, ఇటుకబట్టీలు, పరిశ్రమలు, బార్లు, హోటళ్లలో వలస కార్మికులు పనిచేస్తున్నారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు కల్పించాలి. వలస కార్మికుల వివరాలను ప్రతి ఏటా నమోదు చేయాలి. కనీస వేతనం చెల్లిం చేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలి.
- పి. ప్రభాకర్, కార్మిక సంక్షేమ రాష్ట్ర కన్వీనర్
Updated Date - 2021-11-03T04:41:44+05:30 IST