భూ పరిహారం కాజేశారని..
ABN, First Publish Date - 2021-12-19T05:49:51+05:30
భూ పరిహారం కాజేశారని..
- ప్రగతిభవన్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
- ఒంటిపై పెట్రోల్ పోసుకున్న నాదర్‌గుల్ వాసులు
- కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
ఇబ్రహీంపట్నం/ బేగంపేట: భూపరిహారం రాక మనోవేదనకు గురైన ఓవ్యక్తి కుటుంబంతో సహా శనివారం ప్రగతి భవన్ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకొని పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు. బాధితుడు ఐలేశ్ మీడియాకు తన గోడును వివరించాడు. ఇబ్రహీంపట్నం సమీపంలోని నాదర్‌గుల్‌లో సర్వే నెంబరు 58లో 1979లో ఐలేశ్‌యాదవ్(34) తండ్రి వెంకయ్యకు భూదాన బోర్డు ఐదెకరాలు కేటాయించింది. 2010లో ఆ భూమిని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎ్‌సజీ) కేటాయించారు. పరిహారంగా ప్రభుత్వం ఎకరానికి 5.40లక్షల చొప్పున చెల్లించింది. అప్పటి రెవెన్యూ అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమి పరిహారాన్ని కాజేశారని ఐలేశ్ ఆరోపించాడు. దీనిపై రెవెన్యూ అధికారులను నిలదీస్తే మరోచోట భూమి ఇస్తామని చెప్పారన్నాడు. ఖర్చు అవుతుందని చెప్పడంతో రూ.8లక్షల వరకు అధికారులకు ఇచ్చానని రోదిస్తూ చెప్పాడు. ప్రస్తుతం తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఆత్మహత్య చేసుకుందామనుకున్నామని వాపోయాడు. సీఎంను కలిసి వివరించాలనే తన భార్య అనురాధ, పిల్లలు అక్షిత, మనీ్‌షతేజ్, వేనుతేజ్‌తో కలిసి శనివారం ఉదయం 10.55 గంటలకు ప్రగతిభవన్ వద్దకు చేరుకున్నట్టు చెప్పాడు. భద్రతాసిబ్బంది అనుమతించక పోవడంతో వెంటతెచ్చుకున్న పెట్రోల్‌ను భార్య, తాను పోసుకున్నట్టు తెలిపాడు.
- ఇబ్రహీంపట్నంలో కలకలం..
ఇబ్రహీంపట్నానికి చెందిన ఐలేష్ ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఐలేష్ తండ్రి వెంకయ్యకు 1979లో సర్వేనెంబర్ 58/306లో భూదాన్ బోర్డు ఐదెకరాలు ఇచ్చింది. వెంకయ్య మృతిచెందాడు. అతడికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వారిలో ఐలేష్ పెద్దవాడు. అతడు నాదర్‌గుల్(ప్రసుత్తం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్)లో స్థిరపడ్డారు. 1998లో వెంకయ్య పట్టాను భూదాన్ బోర్డు రద్దుచేసి ఇదే భూమిని ఇబ్రహీంపట్నంకు చెందిన ముత్యాల శ్రీరాములుకు ఇచ్చింది. ఈ భూమి ఎన్‌ఎ్‌సజీకిపోగా 2011లో శ్రీరాములుకు అవార్డును ప్రకటించారు. సర్వే నెంబర్ 58/307లో మద్దెల విజయ్‌కుమార్‌కు 1.27ఎకరాలు, సునీల్‌కుమార్‌కు 1.26ఎకరాలు, అనిల్‌కుమార్ 1.27ఎకరాలకు పరిహారం ఇచ్చారు. వారి సర్వే నెంబర్ 58/306 అని పడింది. దీంతో తమ నెంబరు తప్పు పడిందని, దీన్ని 58/307గా సరిచేసి పరిహారం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తితో సరిచేసి పరిహారం అందజేశారు. తమ పరిహారాన్ని విజయ్‌కుమార్, సునీల్‌కుమార్, అనిల్‌కుమార్ తీసుకున్నారని ఐలేష్ కోర్టును ఆశ్రయించారు. విజయ్‌కుమార్, సునీల్‌కుమార్, అనిల్‌కుమార్‌లతో పాటు అప్పటి ఆర్డీవో రాజేందర్, ఎమ్మార్వో విఠల్, మాజీ వీఆర్వో రాంరెడ్డి, భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్‌రెడ్డిలపై 2017 నవంబర్ 20న పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇది సివిల్ కేసు గనుక కోర్టులో తేల్చుకోవాలంటూ పోలీసులు కేసును మూసేశారు. అప్పట్లోనూ ఐలేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. భూదాన్ బోర్డు రద్దుతో దీనిపై స్పష్టతనిచ్చే వారు లేరు.
- తహసీల్దార్ వివరణ..
దీనిపై ఇబ్రహీంపట్నం తహసీల్దార్ అనిత వివరణ ఇస్తూ.. వెంకయ్య పేరున 1979లో 58/306తో భూదాన్ బోర్డు ఐదెకరాల పట్టా ఇచ్చిందన్నారు. 1998లో వెంకయ్య పేరున ఉన్న పట్టాను రద్దుచేసి ముత్యాల శ్రీరాములు పేరున ఇచ్చారన్నారు. భూసేకరణలో శ్రీరాములుకు పరిహారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Updated Date - 2021-12-19T05:49:51+05:30 IST