పెట్రో మోతతో ఖజానా గలగల
ABN, First Publish Date - 2021-02-14T07:46:44+05:30
రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వినియోగదారులకు భారంగా మారుతుంటే.. ప్రభుత్వ ఖజానాను మాత్రం భారీగా నింపుతున్నాయి. మద్యం అమ్మకాలు కూడా దన్నుగా నిలుస్తున్నాయి
వ్యాట్ రూపంలో పెరుగుతున్న రాబడి
నెలకు సగటున 800 కోట్ల వసూళ్లు
ధరల పెరుగుదలతో సర్కారుకు ఊరట
మద్యంపై వ్యాట్ 17.85% వృద్ధి
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వినియోగదారులకు భారంగా మారుతుంటే.. ప్రభుత్వ ఖజానాను మాత్రం భారీగా నింపుతున్నాయి. మద్యం అమ్మకాలు కూడా దన్నుగా నిలుస్తున్నాయి. కరోనా దెబ్బకు ఖజానా అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో.. ఈ రెండింటి ద్వారా సమకూరుతున్న రాబడి సర్కారుకు కాస్త ఊరటనిస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరలు కొంతకాలంగా ఊర్ధ్వముఖం పట్టడం, మద్యం అమ్మకాలూ జోరు మీదుండడంతో వీటి ద్వారా వచ్చే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) రాబడి పెరుగుతూ వస్తోంది. గతేడాదితో పోలిస్తే పెట్రోలు, డీజిల్‌పై వచ్చే వ్యాట్ 14ు తగ్గినా.. నవంబరు నుంచి గణనీయమైన వృద్ధి రేటు నమోదైంది. ప్రతి నెలా సగటున రూ.800 కోట్లకు పైగా సమకూరింది. మద్యం అమ్మకాలపై వసూలైన వ్యాట్ మాత్రం ఏకంగా 17.85 శాతం పెరగడం గమనార్హం.
వాస్తవానికి కరోనా లాక్‌డౌన్‌తో ఈ ఆర్థిక సంవత్సరం తీవ్ర ఆటుపోట్లకు గురైంది. ముఖ్యంగా మార్చి 22 నుంచి జూలై వరకు వాహనాలు పెద్దగా రోడ్లపైకి రాలేదు. దీంతో పెట్రోలు, డీజిల్ వినియోగం చాలా తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం క్రమంగా లాక్‌డౌన్ నిబంధనలనను సడలిస్తూ రావడంతో సెప్టెంబరు నుంచి వాహనాలు రోడ్లపైకి రావడం మొదలు పెట్టాయి. ప్రజా రవాణా వ్యవస్థ కూడా పుంజుకుంది. మరోవైపు పెట్రోలు, డీజిల్ రేట్లు ఏడాది కాలంలోనే రూ.16 వరకు పెరిగాయి. శనివారం నగరంలో లీటరు పెట్రోలు ధర రూ.91.96, డీజిల్ ధర రూ.85.89 ఉంది. దీంతో ప్రభుత్వానికి వ్యాట్ కూడా అదే స్థాయిలో వసూలవుతోంది.
అంచనాలకు మించి వ్యాట్ వసూలు..
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 35.20ు, డీజిల్‌పై 27ు మేర వ్యాట్‌ను వసూలు చేస్తోంది. మద్యంపై 70 శాతం మేర వ్యాట్‌ను విధిస్తోంది. ఈ రెండింటి ద్వారా 2020-21లో రూ.26,400 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఒక్క పెట్రోలు, డీజిల్‌పైనే రూ.9000 కోట్ల వరకు వస్తాయని భావించింది. అంటే నెలకు రూ.700 కోట్ల పైచిలుకు రావాల్సి ఉంది. కానీ, నవంబరు నుంచి పెట్రోలు, డీజిల్‌పై నెలకు రూ.800 కోట్ల వరకు వ్యాట్ రాబడి సమకూరుతోంది. ధరలు పెరుగుతుండడమే ఇందుకు కారణం. 2019-20 ఆర్థిక సంవత్సరం జనవరి వరకు రూ.7720 కోట్లు రాగా.. ఈసారి జనవరి వరకు రూ.6736 కోట్లు సమకూరాయి. రూ.984 కోట్లు(14ు) తగ్గినా.. కరోనా కాలంలో రాబడి ఆశాజనకంగానే ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మద్యం అమ్మకాల్లో గణనీయ వృద్ధి
మద్యం అమ్మకాలతో వ్యాట్ రాబడి గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే.. ఏకంగా 17.85 శాతం వృద్ధి నమోదైంది. వాస్తవానికి మద్యంపై ఎక్సైజ్ ట్యాక్స్, అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ కాకుండా 70 శాతం మేర ప్రభుత్వం వ్యాట్‌ను వసూలు చేస్తోంది. దీని ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.17,400 కోట్ల వరకు సమకూరాలి. ఈ జనవరి వరకు 10 నెలల కాలంలో రూ.9405 కోట్లు వచ్చాయి. అదే 2019-20లో జనవరి వరకు రూ.7980 కోట్లు మాత్రమే సమకూరాయి. అంటే.. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా రూ.1425 కోట్లు వచ్చినట్లయింది. కరోనా లాక్‌డౌన్‌తో మార్చి, ఏప్రిల్‌లో మద్యం రాబడి లేకపోయినా... జనవరి వరకు గతేడాదికంటే 17.85 శాతం ఎక్కువగా రాబడి సమకూరడం గమనార్హం.
Updated Date - 2021-02-14T07:46:44+05:30 IST