సబ్జెక్టు టీచర్ల సర్దుబాటు కసరత్తు పూర్తి
ABN, First Publish Date - 2022-12-11T23:59:42+05:30
జిల్లాలో మిగులుగా తేలిన సబ్జెక్టు టీచర్ల సర్దుబాటు కసరత్తు కొలిక్కివచ్చింది. మొత్తం 350 మంది టీచర్లకు స్థానం చలనం కలగనుంది. వీరందరికీ సోమవారం సర్దుబాటు ఉత్తర్వులు జారీ కానున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తామని ఆ మూడు తరగతులకు హైస్కూళ్లలో విలీనం చేసి నెలల గడుస్తోంది.
నేడు ఉత్తర్వులు
ఒంగోలు (విద్య), డిసెంబరు 11 : జిల్లాలో మిగులుగా తేలిన సబ్జెక్టు టీచర్ల సర్దుబాటు కసరత్తు కొలిక్కివచ్చింది. మొత్తం 350 మంది టీచర్లకు స్థానం చలనం కలగనుంది. వీరందరికీ సోమవారం సర్దుబాటు ఉత్తర్వులు జారీ కానున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తామని ఆ మూడు తరగతులకు హైస్కూళ్లలో విలీనం చేసి నెలల గడుస్తోంది. అయితే ఇప్పటికీ వారికి అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు బోధించడం లేదు. దీంతో ఈ పాఠశాలలకు మిగులుగా తేలిన సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు ప్రాధాన్యతలను నిర్దేశించింది. ఆ ప్రకారం 6నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులున్న హైస్కూళ్లలో ప్రతి సబ్జెక్టు బోధించేందుకు కనీసం ఒక్క సబ్జెక్టు టీచర్‌ను అయినా సర్దుబాటు చేయాలి. రెండో ప్రాధాన్యతగా 3,4,5 తరగతులు విలీనమైన పాఠశాలల్లో ఆ మూడు తరగతులకు బోధించేందుకు అవసరమైన సబ్జెక్టు టీచర్లను నియమించాలి. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లకు మిగులు టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంది.
363 మంది అవసరం
ఉపాధ్యాయుల పునర్విభజన నిబంధనల ప్రకారం విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి పరిగణలోకి తీసుకుంటే అన్ని పాఠశాలలకు అదనంగా 363 మంది సబ్జెక్టు టీచర్లు అవసరమని తేల్చారు. వీరిలో స్కూలు అసిస్టెంట్ బయాలాజికల్ సైన్స్ 47, ఇంగ్లీషు 81, హిందీ 18, గణితం 77, ఫిజికల్ సైన్స్ 34, సోషల్ స్టడీస్ 57, తెలుగు 49 అవసరమని గుర్తించారు. అయితే విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి టీచర్ల పునర్విభజన నిబంధనల ప్రకారం జిల్లాలో 349 మంది సబ్జెక్టు టీచర్లు మిగులుగా ఉన్నట్లు తేల్చారు. 68 ఖాళీలు ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 281 మంది మాత్రమే మిగులు టీచర్లు తేలారు. అయితే వీరందరినీ సర్దుబాటు చేసేందుకు పాఠశాలల మధ్య దూరం ప్రతిబంధకంగా మారింది. దీంతో ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఇటీవల ఉద్యోగోన్నతి పొందిన వారు, అదేవిధంగా అర్హులైన సెకండ్ గ్రేడ్ టీచర్లను అవరమైన స్థానాలకు సర్దుబాటు చేశారు. ప్రాథమికంగా అసలు సబ్జెక్జు టీచర్ లేని హైస్కూళ్లకు 120 మందిని, 3,4,5 తరగతుల విలీనమైన హైస్కూళ్లకు 201 మంది టీచర్ల సర్దుబాటు చేశారు. మూడో ప్రాధాన్యంగా 29 మందిని కేటాయించారు. సర్దుబాటు ఫలితంగా మొత్తం 350 మంది టీచర్లకు స్థానచలనం కలగనుంది.
నేడు ఉత్తర్వులు
ఇతర పాఠశాలలకు సర్దుబాటు అయిన టీచర్లకు సోమవారం ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు డీఈవో విజయభాస్కర్ తెలిపారు. టీచర్లను వీలైనంత వరకు పక్కనున్న మండలాల్లోనే సర్దుబాటు చేశామన్నారు. స్కూలు అసిస్టెంట్లుగా ఇటీవల ఉద్యోగోన్నతులు పొందిన వారు, అర్హులైన కొందరు సెకండరీ గ్రేడ్ టీచర్లను సర్దుబాటు చేసినట్లు డీఈవో తెలిపారు.
Updated Date - 2022-12-11T23:59:43+05:30 IST