అమరావతేఏకైక రాజధాని
ABN, First Publish Date - 2022-10-24T05:26:44+05:30
అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వం దాష్టీకాలు, దౌర్జన్యాల నివారణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఏపీ ప్రభుత్వాన్ని శిక్షించాలని, జగన్ పట్ల ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వ దాష్టీకాలపై ప్రత్యేక కమిషన్ వేయాలి
బాధిత రైతాంగ పోరాట వేదిక సదస్సులో వక్తలు
హైదరాబాద్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వం దాష్టీకాలు, దౌర్జన్యాల నివారణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఏపీ ప్రభుత్వాన్ని శిక్షించాలని, జగన్ పట్ల ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని ఉండాలని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై పోలీసుల నిర్బంధం, ప్రజా ప్రతినిధుల దమనకాండకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాధిత రైతాంగ పోరాట వేదిక సదస్సు ఆదివారం నిర్వహించారు. వేదిక అధ్యక్షుడు, న్యాయవాది తన్నీరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమరావతిలో రాజధాని కడతామని గత టీడీపీ ప్రభుత్వం ముందుకొస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని 29 గ్రామాల ప్రజలు ఏడాదికి మూడు పంటలు పండే 34వేల ఎకరాలకు పైగా ఇచ్చారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని ప్రకటించి రైతుల త్యాగాలకు విలువలేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చే శారు. అమరావతి కోసం 1,041 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటికి 185 మంది చ నిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే తాము భావిస్తున్నామన్నారు. చనిపోయిన రైతు కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.3కోట్ల నష్టపరిహరం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతుసంఘం నాయకుడు కోటయ్య మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం తమ పంట భూములు ఇవ్వాలని వచ్చిన తహసీల్దార్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయారు. రాజధాని కోసం మనుసు చంపుకుని భూములు ఇచ్చామని, నేడు జగన్ ప్రభుత్వం అమరావతి కాదని మూడు రాజధానుల కోసం ప్రయత్నించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అమరావతి రైతు గాంధీ మాట్లాడుతూ మూడు రాజధానులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. న్యాయ వ్యవస్థను గౌరవించకుండా అమరావతికి జగన్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అమరావతి రైతు ఆలూరు కోటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అమరావతి రైతులు భాను, సీతయ్య, చేవెళ్ల స్వామి, ఎ.శివారెడ్డి, జెల్లి లింగయ్య, నీలిమ, గుంటుపల్లి రైతు వెంకటేశ్వరరావు, నాయకురాలు వినీల త దితరులు ప్రసంగించారు. సదస్సులో పలువురు రైతులు పాల్గొని అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారు.
Updated Date - 2022-10-24T11:05:55+05:30 IST