గుప్తనిధుల పేరిట బురిడీ
ABN, First Publish Date - 2022-12-24T23:39:52+05:30
గుప్తనిధుల పేరుతో మహిళల నుంచి రూ.లక్షల్లో డబ్బు తీసుకుని ఓ మహిళ ఉడాయించిందంటూ యాడికిలో కలకలం చెలరేగింది.
రూ.30లక్షలతో మహిళ ఉడాయింపు? మహిళ నివాసం వద్ద పోలీసుల విచారణ
యాడికి, డిసెంబరు 24: గుప్తనిధుల పేరుతో మహిళల నుంచి రూ.లక్షల్లో డబ్బు తీసుకుని ఓ మహిళ ఉడాయించిందంటూ యాడికిలో కలకలం చెలరేగింది. దీంతో ఆ మహిళ ఇంటి వద్ద శనివారం పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికుల కథనం మేరకు... యాడికిలోని లాలెప్పకాలనీలో ఒక ఉపాధ్యాయుడికి చెందిన ఇంటిలో 9నెలలక్రితం ఒక మహిళ వచ్చి అద్దెకు దిగింది. ఇంట్లో పెద్దఎత్తున పూజలు చేసేదని, ఆ కాలనీలోని మహిళలతో బాగా చనువు పెంచుకొని వారిని శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర తీర్థయాత్రలకు పిలుచుకొని వెళుతుండేదన్నారు. ఆ పరిచయంతో తాను గుప్త నిధులువెలికి తీశామని, పెద్దమొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మబలికింది. ప్రస్తుతానికి అవసరాల నిమిత్తం కొద్దిమేర డబ్బులు అవసరమని పదుల సంఖ్యలో మహిళలు ఒకరికి తెలియకుండా మరొకరితో ఇలా రూ.30వేల నుంచి రూ.5లక్షల మేర వసూలు చేసింది. ఇలా వసూలు చేసిన మొత్తం సుమారు రూ.30లక్షల వరకు ఉంటుందని బాధితుల నుంచి తెలుస్తోంది. పదిరోజులక్రితం మహిళ ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోయిందని, ఆ సమయంలో స్థానికంగా ఉన్న మహిళలు తమ డబ్బులు కావాలని నిలదీయగా, గుప్తనిధుల డబ్బులు వచ్చాయని వాటిని తీసుకొస్తానని చెప్పి వెళ్లిపోయింది. పదిరోజులైనా మహిళ రాకపోవడంతో తాము మోసపోయినట్లు కాలనీవాసులు గుర్తించారు. స్థానికంగా ఒక గుడిలో అర్చకునిగా పనిచేస్తున్న వ్యక్తి నుంచి సుమారు రూ.8లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని నుంచి రూ.1.5లక్షలు తీసుకున్నట్లు చర్చ సాగుతోంది. నిట్టూరు, తాడిపత్రి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, అంకిరెడ్డిపల్లి తదితర గ్రామాల మహిళల నుంచి కూడా ఇలాగే ఆ మహిళ డబ్బులు తీసుకొని ఉడాయించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సుమారు పది రోజులైనా సదరు మహిళ తిరిగి రాకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే గుప్తనిధుల కేసుల్లో తాము ఎక్కడ ఇరుక్కుపోవాల్సి వస్తుందోనని బాధితులు ముందుకు రాకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు మోసగించిన మహిళ ఉంటున్న ఇంటివద్దకు వెళ్లి విచారణ చేశారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
Updated Date - 2022-12-24T23:39:53+05:30 IST