బయటే మేలు..!
ABN, First Publish Date - 2022-10-23T00:21:28+05:30
సబ్సిడీ పప్పుశనగ విత్తనం తీసుకు నేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని ఆర్బీకేల్లో రైతుల పేర్ల రిజిస్ర్టేషన ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
సబ్సిడీ పప్పు శనగ క్వింటం రూ.4,842
బహిరంగ మార్కెట్‌లో ధర రూ.5000
అప్పుగా తీసుకున్నా.. ధర తక్కువే..!
సబ్సిడీ పప్పుశనగపై రైతుల నిరాసక్తత
బహిరంగ మార్కెట్‌లో కొంటున్న వైనం
సబ్సిడీ పప్పుశనగ విత్తనం తీసుకు నేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని ఆర్బీకేల్లో రైతుల పేర్ల రిజిస్ర్టేషన ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. సబ్సిడీ ధరకు, బహిరంగ మార్కెట్ ధరకు పెద్ద తేడా లేకపోవడమే ఇందుకు కారణమని రైతులు అంటున్నారు. మరోవైపు ఈ సారి సబ్సిడీని తగ్గించారు. గత ప్రభుత్వ హయాంలో 30 శాతం సబ్సిడీ ఇచ్చేవారు. ప్రస్తుతం 25 శాతానికి కుదించారు. దీంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నల్ల రేగడి భూములున్న మండలాల్లో ఈ నెల 10 నుంచి పప్పుశనగ విత్తనాల కోసం రైతుల పేర్లను రిజిస్టర్ చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఇప్పటి దాకా 9,637 మంది రైతులు 9,879 క్వింటాళ్ల విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు.
- అనంతపురం అర్బన
చిన్న రైతులే..
సబ్సిడీ విత్తనం కోసం అనంతపురం మండలంలో 147 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. ఆత్మకూరు మండలంలో 44, బెళుగుప్ప 349, బొమ్మనహాళ్ 67, బుక్కరాయసముద్రం 110, డి.హీరేహాళ్ 150, గుత్తి 56, కణేకల్లు 2660, కూడేరు 80, పామిడి 30, పెద్దపప్పూరు 750, పెద్దవడుగూరు 195, పుట్లూరు 2320, శింగనమల 30, తాడిపత్రి 785, ఉరవకొండ 961, వజ్రకరూరు 1000, విడపనకల్లు 1039, యాడికి 350, యల్లనూరు 1,550 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరు డబ్బులు చెల్లించిన తరువాతే ఆర్బీకేలకు ఏపీసీడ్స్ అధికారులు పప్పుశనగ విత్తన బస్తాలు పంపుతున్నారు. రిజిస్ట్రేషన ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని, ముందే విత్తనం పంపితే.. మిగిలిన బస్తాలను వెనక్కి తెచ్చుకునేందుకు రవాణా ఖర్చులు భరించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే డబ్బులు చెల్లించిన తరువాతే విత్తనం పంపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4,820 క్వింటాళ్ల పప్పుశనగ విత్తనాన్ని పంపిణీ చేశారు.
ధరలో తేడా లేదు..
క్వింటా పప్పుశనగ విత్తన ధర రూ.6,456గా నిర్ణయించారు. ఇందులో 25 శాతం సబ్సిడీ రూ.1,614 పోనూ రైతు వాటాగా రూ.4,842 చెల్లించాలి. తాడిపత్రి ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో క్వింటం పప్పుశనగ ధర రూ.4900 నుంచి రూ.5 వేలు పలుకుతోంది. బెళుగుప్ప ప్రాంతంలో క్వింటం రూ.5 వేలు పలుకుతోంది. అప్పుగా తీసుకుంటే రూ.5,200 నుంచి రూ.5,300 ధరకు ఇస్తున్నారు. పంట పండిన తర్వాత ఈ మొత్తాన్ని పట్టుకుని, మిగిలిన దిగుబడికి రైతులకు వ్యాపారులు డబ్బులు చెల్లిస్తారు. సబ్సిడీ, మార్కెట్ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం, పైగా వ్యాపారులు ఓ రూ.200 అధిక ధరతో అప్పు ఇస్తుండటంతో రైతులు ఆ వైపే మొగ్గు చూపుతున్నారు. హెక్టారులోపు పొలం ఉన్న రైతులు మాత్రమే సబ్సిడీ విత్తనం కోసం రిజిస్ట్రేషన చేసుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ పొలం ఉన్నవారు ఇప్పటికే మార్కెట్‌లో కొని.. విత్తనం వేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల వర్షాలు కురవడంతో నల్లరేగడి భూముల్లో కాస్త తడి ఆరగానే విత్తనం వేయాలని నిర్ణయించుకున్నారు. సన్న, చిన్నకారు రైతులు మాత్రం సబ్సిడీ విత్తనం కోసం ఎదురు చూస్తున్నారు.
బయటే కొన్నాం..
పప్పుశనగ సబ్సిడీని తగ్గించారు. దీంతో మార్కెట్ ధరకు, సబ్సిడీ ధరకు పెద్దగా తేడా లేదు. ఈసారి పదెకరాల్లో పప్పుశనగ సాగు చేయాలనుకుంటున్నా. వర్షాలు బాగా కురిశాయి. మార్కెట్‌లో విత్తనం కొని పెట్టుకున్నాం. మార్కెట్‌లో నాణ్యమైన విత్తనం రూ.5 వేలకే దొరుకుతోంది. అందుకే సబ్సిడీ విత్తనం కోసం ఆర్బీకేలో రిజిస్ట్రేషన చేయించలేదు.
- విజయ్ కుమార్ నాయుడు, నారాయణపల్లి, పుట్లూరు మండలం
తేడా లేదు..
బహిరంగ మార్కెట్‌లో పప్పుశనగ క్వింటం ధర రూ.5 వేలు పలుకుతోంది. సబ్సిడీ విత్తనం ధర రూ.4,842 అంటున్నారు. పెద్దగా తేడా లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లోనే కొంటున్నాం. అదునులోనే పదునైంది. అందుకే విత్తనం కొనుగోలు చేసి పెట్టుకుంటున్నాం. పొలాల్లో తడి ఆరితే విత్తనం వేస్తాం.
- రాజేష్‌నాయుడు, కోమటికుంట్ల, పుట్లూరు మండలం
Updated Date - 2022-10-23T00:21:37+05:30 IST