గురుకులం...సమస్యల నిలయం..!
ABN, First Publish Date - 2022-12-12T00:06:29+05:30
280 మంది విద్యార్థులకు 13 మరుగుదొడ్లు, 8 తరగతులకు ఆరు గదులు, పడక, పాఠాలు ఒకేచోట, ఎక్కడికక్కడే ఆగిపోయిన భవన నిర్మాణాలు. ఇదీ రొద్దం మండలంలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల దుస్థితి.
రొద్దం ఎంజేపీ పాఠశాల విద్యార్థుల అవస్థలు
వేధిస్తున్న వసతుల లేమి
మరుగుదొడ్లకూ ఇబ్బందే..
తరగతి గదుల కొరత
ఆరుబయటే పాఠాలు
నాలుగేళ్లుగా పూర్తికాని భవన నిర్మాణాలు
బిల్లులు అందక పాఠశాల
గదులకు కాంట్రాక్టర్ తాళం
రొద్దం
280 మంది విద్యార్థులకు 13 మరుగుదొడ్లు, 8 తరగతులకు ఆరు గదులు, పడక, పాఠాలు ఒకేచోట, ఎక్కడికక్కడే ఆగిపోయిన భవన నిర్మాణాలు. ఇదీ రొద్దం మండలంలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల దుస్థితి. కనీస వసతులు కరువయ్యాయి. నాలుగేళ్లుగా భవన నిర్మాణాలు పూర్తికాలేదు. ఎక్కడివక్కడ ఆగిపోయాయి. బిల్లులు రాక కాంట్రాక్టర్లు విలవిల్లాడుతున్నారు. బిల్లులివ్వండి మహాప్రభో అంటూ పాలకులను వేడుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చేసేదిలేక, బిల్లులు అందలేదని తరగతి గదులకు ఏకంగా తాళం వేసి, నిరసన తెలిపారు. అయినా.. బిల్లులు రాలేదు. దీంతో పాఠశాల భవన నిర్మాణ పనులు అటకెక్కాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్నింటికీ కొరతే...
టీడీపీ హయాంలో 2019 మార్చి 19న ఎంజేపీ గురుకుల పాఠశాల పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పటి ఎమ్మెల్యే బీకే పార్థసారథి పనులను ప్రారంభించారు. భవన నిర్మాణాలకు రూ.35కోట్లు కేటాయించారు. టీడీపీ హయాంలో పనులు వేగంగా సాగాయి. ఆ తరువాత వైసీపీ అధికారం చేపట్టడంతో పనులు అటకెక్కాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో మొత్తం 280 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అంతమందికి 13 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. కాలకృత్యాలకు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. ఎనిమిది తరగతులకుగాను ఆరు గదులే ఉన్నాయి. రెండు తరగతులకు ఆరుబయట పాఠాలు చెప్పాల్సి వస్తోంది. పడక, చదువు ఒకేచోట ఉండటంతో పాఠాలు అర్థంకాక విద్యార్థులు అవస్థలు చెప్పనలవికావు. ఆరుబయటే స్నానాలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు.
పూర్తయ్యేదెన్నడో..?
టీడీపీ హయాంలో పాఠశాల భవన నిర్మాణానికి రూ.35కోట్లు మంజూరు చేసింది. వైసీపీ అధికారం చేపట్టాక నిర్మాణాలు అటకెక్కడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. మూడేళ్ల క్రితం పాఠశాల నిర్మాణ పనుల కోసం రూ.15.39 కోట్లతో భూమిపూజ చేశారు. కాంట్రాక్టరుకు బిల్లులు మాత్రం అందలేదు. దీంతో తొమ్మిది నెలల క్రితం నిర్మాణపనులను అర్ధాంతరంగా ఆపేసి, వెళ్లిపోయారు. డార్మెటరీ, తరగతి గదులు, వాటర్ ట్యాంక్, ప్రిన్సిపాల్ గదుల పనులు ఆపేశారు.
పాఠశాల గదులకు తాళాలు
మూడేళ్ల క్రితం రొద్దం ఎంజేపీ పాఠశాలలో వసతుల కల్పనకు బీసీ సంక్షేమ శాఖ రూ.17 లక్షలు మంజూరు చేసింది. ఓ సంస్థ పనులు దక్కించుకోగా.. సబ్ కాంట్రాక్టర్ ధనుంజయ పనులు పూర్తిచేశారు. మూడు తరగతి గదులు, ఆరు మరుగుదొడ్లు పూర్తి చేశారు. రూ.17 లక్షల బిల్లుకుగాను రూ.8.5 లక్షలు మాత్రమే ఎంబుక్ రికార్డ్ చేశారు. మిగిలిన నిధులు ఏమయ్యాయని సబ్ కాంట్రాక్టర్ అనంతపురం, పుట్టపర్తి కలెక్టరేట్లకు చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. దీంతో విసిగి వేసారిన సబ్ కాంట్రాక్టర్ 10 రోజుల క్రితం రొద్దం ఎంజేపీ పాఠశాల గదులకు తాళాలు వేశారు. గనులు, భూగర్భవనరుల శాఖ నుంచి మిగిలిన రూ8.5లక్షల బిల్లులు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తమకు సంబంధం లేదనీ, తమ వద్ద ఫైల్ లేదని ఆ శాఖాధికారులు బదులివ్వడంతో కాంట్రాక్టర్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. దీంతో పాఠశాల గదులకు తాళాలు వేయాల్సి వచ్చింది. ఇలా అయితే పాఠశాలలో నిర్మాణాలు పూర్తయ్యేదెన్నడు, విద్యార్థులకు వసతులు కల్పించి, సవ్యంగా విద్యాబోధన సాగేదెన్నడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉన్న వసతులతోనే సర్దుకుపోతున్నాం
రూ.17 లక్షలతో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించింది. ఉన్నవాటితోనే సర్దుకుపోతున్నాం. విద్యార్థుల సంఖ్య పెరగడంతో పెనుకొండలో రెండో పాఠశాలను ఏర్పాటు చేశాం. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టరు పనులు ఆపేశారు. ప్రస్తుతం పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేవు. పాఠశాల గదుల బిల్లుల కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం.
- గోపాల్, ప్రిన్సిపాల్
Updated Date - 2022-12-12T00:06:33+05:30 IST