గృహలక్ష్మి ఏదీ?
ABN, First Publish Date - 2022-10-29T23:46:06+05:30
ఉమ్మడి జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా పడకేశాయి. లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,272 మందికి టిడ్కో ఇళ్లు కట్టిస్తామని చెప్పింది.
ఇల్లు లేదు.. నగదు రాదు..!
ఉమ్మడి జిల్లాలో
స్తంభించిన టిడ్కో ఇళ్ల నిర్మాణం
రూ. 33 కోట్ల డిపాజిట్ కోసం
లబ్ధిదారుల ఎదురు చూపు
మూడేళ్లుగా డబ్బు కోసం ప్రదక్షిణలు
అనంతపురం సిటీ, అక్టోబరు 29: ఉమ్మడి జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా పడకేశాయి. లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,272 మందికి టిడ్కో ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. మిగిలిన 34,628 మందికి డిపాజిట్‌ల రూపంలో చెల్లించిన రూ.33 కోట్ల నగదు తిరిగి వెనక్కిస్తామని ప్రకటించి చేతులు దులుపుకుంది. కానీ మూడేళ్లయినా ఇంతవరకూ పైసా చెల్లించలేదు. దీంతో టిడ్కో ఇల్లు రాక.. నగదు అందక లబ్ధిదారులు ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో...
గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50,900మంది లబ్ధిదారులు కేటగిరీల వారిగా నగదు చెల్లించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడ్కో ఇళ్లపై షరతులు విధించింది. 16,272మందికి మాత్రమే టిడ్కో ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. మిగిలిన 34,628 మందికి వారు చెల్లించిన రూ. 33 కోట్లును వెనక్కి ఇస్తామని చెప్పింది. తద్వారా టిడ్కో ఇళ్ల కోసం నగదు చెల్లించి ఇల్లు రాకపోవడంతో నిరాశకు గురైనప్పటికి చెల్లించిన నగదు వస్తుందిలే అని కాస్త ఉపశమనం పొందారు. కానీ ఏళ్లు గడుస్తున్నా నగదు రాకపోవడంతో బాధిత లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల కిందట ప్రకటన చేసినప్పటికి లబ్ధిదారులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కరికి కూడా ఇప్పటికి టిడ్కో ఇళ్లు అప్పగించలేదు. నగదు ఇవ్వలేదు. ఏళ్ల తరబడి డిపాజిట్‌ల నగదు ఇవ్వకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాం తాల వారిగా బాధిత లబ్ధిదారులు ఆయా మున్సిపాలిటీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అటు ప్రభుత్వం కానీ.. ఇటు అధికార యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పడకేసిన నిర్మాణాలు
ఉమ్మడి జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణం నాలుగేళ్ల కిందట ప్రారంభమైంది. మూడేళ్ల కిందట వైసీపీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాలో నిర్మాణాలు పడకేశాయి. అనంతపురం నగరంతో పాటు గుంతకల్లు, రాయదుర్గం, తాడిపత్రి ప్రాంతాల్లో మాత్రమే 1600 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన గుత్తి, పామిడి, ధర్మవరం, హిందూపురం, కదిరి, పుట్టపర్తి ప్రాంతాలలో టిడ్కో ఇళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ నిర్మాణాలు స్తంభించిపోయాయి. అయితే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ఈ ఏడాది డిసెంబరులోపు వేలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ప్రకటించడం ఏ మేరకు సాధ్యమవుతుందో వేచి చూడాలి.
Updated Date - 2022-10-29T23:46:17+05:30 IST