ap: ఆంధ్రాభిమానానికి అందలమేదీ?
ABN, First Publish Date - 2022-11-01T05:52:56+05:30
రాష్ట్రావతరణ కోసం ప్రాణాలర్పించిన యోధుల త్యాగాలను గత ప్రభుత్వం గుర్తించలేదు. అందుకే అవతరణ దినోత్సవాలను జరపడం లేదు.
ఆంధ్రాభిమానానికి
మన కీర్తిని, ప్రగతిని చాటే వేదిక ఎక్కడ?
ఉన్న ఒక్క అవకాశం రాష్ట్రావతరణ దినోత్సవం
దానినీ ఫార్సుగా మార్చేసిన జగన్ ప్రభుత్వం
ఉమ్మడి ఏపీలో ఘనంగా జరిగిన ‘అవతరణ’
బాబు నవనిర్మాణదీక్షలతో నవ్యాంధ్రకు ఉత్సాహం
సాంస్కృతిక వైభవం, భవిష్యత్ అభివృద్ధి లక్ష్య నిర్దేశం
అవతరణను బ్రహ్మాండంగా చేస్తానన్న సీఎం జగన్
కానీ, ఫ్యామిలీ కార్యక్రమంగా మార్చేసిన వైనం
క్యాంప్ ఆఫీసులో జెండా వందనంతో సరి
నేడే రాష్ట్రావతరణ దినోత్సవం
నాడు
ఉమ్మడి ఏపీలో రాష్ట్రావతరణ వేడుకంటే సందడిగా ఉండేది. అవతరణ వేడుకంటే పుట్టినరోజు లాంటిది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సంయుక్తంగా వేడుకలను జరుపుకొనేవి. రాష్ట్ర ఖ్యాతిని చాటిచెబుతూ, కొత్త లక్ష్యాలు, అభివృద్ధి గమ్యాల గురించి చెప్పేవారు.
నేడు
చంద్రబాబు ప్రభుత్వం నవంబరు 1న కాకుండా, విభజన జరిగిన జూన్ 2వ తేదీన ‘సంకల్ప దినం’ నిర్వహిస్తూ వచ్చింది. జగన్ సర్కారు మళ్లీ ‘నవంబరు 1’ని తెరపైకి తెచ్చింది. దీనిని ‘కుటుంబ’ వ్యవహారంగా మార్చింది. క్యాంప్ ఆఫీసులో జెండా వందనం, ఆ తర్వాత తండ్రి పేరిట పెట్టిన పురస్కారాల ప్రదానం! ఇదే ‘అవతరణ’ వేడుక!
(అమరావతి-ఆంధ్రజ్యోతి):‘‘రాష్ట్రావతరణ కోసం ప్రాణాలర్పించిన యోధుల త్యాగాలను గత ప్రభుత్వం గుర్తించలేదు. అందుకే అవతరణ దినోత్సవాలను జరపడం లేదు. మేం అలా కాదు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటూ అవతరణ ఉత్సవాలు తిరిగి నిర్వహిస్తాం. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని నలుదిశలా చాటుతాం’... 2019 అక్టోబరు 31న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఇది. దీన్నే ముఖ్యమంత్రి జగన్ వల్లె వేశారు. ఆ ఏడాది నవంబరు 1న రాష్ట్రావతరణ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఆ తర్వాత తను ఇచ్చిన మాటను ఆయన మరిచిపోయారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో లేదా మరో చోట అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఓ దండవేసి, దండం పెట్టి సరిపెట్టేశారు. దీంతో ఇదేనా త్యాగధనుల స్మరణనా? అంతకుమించి మరేమీలేదా?
అవతరణ నుంచి నవ దీక్షల వరకు..
2014కు ముందు ఏపీ అవతరణ దినోత్సవం అంటే ఓ పండగలా జరిగేది. ప్రభుత్వ పెద్దలు, అధికారయంత్రాంగంతోపాటు ప్రజలు భాగస్వాములయి సంబరాలు జరుపుకొనేవారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ.. ఆంధ్రా,సీమ, తెలంగాణల్లో ఉత్సవాలు జరిగాయి. రాజధానితోపాటు పట్టణాలు, పల్లెల్లో ప్రభుత్వం సంబరాలు చేసింది. ఏపీ అవతరణ ఆవశ్యకత ను చాటిచెబుతూ, రాష్ట్రం కోసం పోరాడిన పొట్టిశ్రీరాములు, మరి కొందరు త్యాగధనులను స్మరించుకుంటూ వారి చరిత్రను కీర్తించారు. రాష్ట్ర ఖ్యాతి, పేరు, ప్రతిష్ఠలను మరింతగా ఇనుమడింపచేసేలా ఏపీతోపాటు ఇతర రా ష్ట్రాల్లో, దేశాల్లోని తెలుగువారు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా రంగాల్లో నిపుణులు, నిష్ణాతులు, మేధావులు, కళాకారులు, రచయిత లు, ప్రజలకోసం త్యాగాలుచేసిన వారిని పిలిచి సన్మానించి వారి సేవలను గుర్తుచేసుకున్నారు. దీంతో ఆ రోజును మరుపురానిదిగా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. విద్యార్ధులు, యువతకు ప లు పోటీలు నిర్వహించి వారిలో కొత్త ఉత్సా హం నింపారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అవతరణ దినోత్సవం జరగలేదు. ఆ తర్వాత నుంచి.. నవాంధ్ర అవతరించిన జూన్ 2న ఏటా నాటి ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలను చేపట్టింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రజల్లోకి వచ్చి రాష్ట్రాభివృద్ధి, సాంస్కృతిక వైభవం, భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాల గురించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రజలను భాగస్వాములను చేశారు.
‘ఘనత’ అంతా మాటల్లోనే...
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక నవంబరు 1న తిరిగి అవతరణ దినోత్సవం నిర్వహిస్తామని 2019 అక్టోబరు 28న ప్రకటించారు. ఈ మేరకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉత్సవాలు నిర్వహించారు. సహజంగానే గత ప్రభుత్వంపై ఈ వేదికపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుల త్యాగాలను గత ప్రభుత్వం గుర్తించలేదని విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం ఏటేటా ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవాలను నిర్వహిస్తుందని ప్రకటించారు. అంతే, అంతకు మించి మరేమీ జరగలేదు. ఆ సభ మినహా ఆ ఏడాది మరే ఇతర కార్యక్రమం జరగలేదు. మరుసటి ఏడాది అంటే 2020లో కరోనా కారణంగా ఉత్సవాలు జరగలేదు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అమరజీవి పొట్టిశ్రీరాములు ఫొటోకు దండవేసి నివాళి అర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గత ఏడాది ఉత్సవాలు జరిగినా కేవలం ఓ కార్యక్రమానికే పరిమితం చేశారు. ప్రజల భాగస్వామ్యం లేదు. రాష్ట్రావతరణ ఉత్సవాల సందర్భంగా తమ ప్రభుత్వ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ ఏమిటో ప్రజలకు దిశానిర్దేశం చేయనేలేదు. ఈ సారి కూడా ఎలాంటి సందడి, హడావుడి లేకుండా జగన్ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించనుంది. అదేదో వైఎస్ రాజశేఖరరెడ్డి స్మరణ కార్యక్రమంలా డిజైన్ చేశారు. వైఎ్‌సఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్స్ పేరిట కొంద రికి అవార్డులు ఇచ్చే వేదికగా ఈ కార్యక్రమాన్ని మార్చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద న్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ పాల్గొనేలా ఈ కార్యక్రమం రూపొందించారు. దీంతో రాష్ట్రావతరణ వేడుకలంటే ఇంతేనా? అని సగటు ఆంధ్రుడు పెదవి విరిస్తున్నాడు.
ఆ సందడి ఇప్పుడేదీ?
‘‘ఉమ్మడి ఏపీలో రాష్ట్రావతరణ వేడుకంటే సందడిగా ఉండేది. అవతరణ వేడుకంటే పుట్టినరోజు లాంటిది. మా తెలుగుతల్లికి మల్లెపూ దండ గీతాలాపనతో కార్యక్రమాలు అంరంగ వైభవంగా జరిగేవి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సంయుక్తంగా వేడుకలను జరుపుకొనేవి. రాష్ట్ర ఖ్యాతిని చాటిచెబుతూ, కొత్త లక్ష్యాలు, అభివృద్ధి గమ్యాల గురించి చెప్పేవారు. ఇప్పుడు జగన్ ఈ కార్యక్రమాన్ని వైఎ్‌సఆర్ అవార్డుల పేరిట మరో దారికి తీసుకెళ్తున్నట్లుగా ఉంది. అంటే, ఇకపై రాష్ట్రావతరణ వేడుకంటే వైఎ్‌సఆర్ అవార్డుల ప్రదానమే అని గుర్తుకు వచ్చేలా చేస్తారేమో? ఆ రోజంతా వైఎ్‌సఆర్ స్మరణే ఉంటుంది. ఇక రాష్ట్రం, పేరు ప్రతిష్ఠలు, అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాల ప్రస్తావన ఎక్కడ ఉంటుంది?’’ అని ప్రజాఉద్యమాల జాతీయ వేదిక కన్వీనర్ సుబ్బరాజు వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-11-01T06:32:48+05:30 IST