ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Annamayya project: శిథిలాల మధ్యే వ్యథలు

ABN, First Publish Date - 2022-11-18T04:00:03+05:30

021 నవంబరు 19వ తేదీ! అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఉన్న ఆరు గ్రామాలకు అది కాళరాత్రి! అప్పటికే నిండుకుండలా ఉన్న ప్రాజెక్టు మట్టికట్ట మెల్లగా బీటలు వారడం మొదలుపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిపించలేదా వీరి కష్టాలు?

అన్నమయ్య ప్రాజెక్టు విషాదానికి ఏడాది

మాటలకే పరిమితమైన ముఖ్యమంత్రి సాయం

సర్వం కోల్పోయి.. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు

రెండు నెలల్లో ఇళ్లు కట్టిస్తామని నాడు జగన్‌ హామీ

350 ఇళ్లు మంజూరు.. పునాదులు దాటని నిర్మాణాలు

టార్పాలిన్‌ గుడారాల్లోనే బాధితుల ఆవాసం

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ బతుకులు

ఇసుక మేటలుగా మారిన పొలాలు

సాగుకు పొలం లేదు.. చేయడానికి పనీ లేదు

మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఎక్కడ?

అది ముఖ్యమంత్రి సొంత జిల్లా! అందులో మూడు గ్రామాలు! రాత్రికి రాత్రి వరద విరుచుకుపడింది! ప్రాజెక్టు కొట్టుకుపోయింది! ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జనం పరుగులు తీశారు. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్లేదు. ఇది ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల దైన్యం! అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వచ్చారు. అనాథ రక్షకుడిలా, ఆపద్బాంధవుడిలా మాట్లాడారు. కన్నీళ్లు తప్ప ఇంకేమీ మిగలని బాధి తులు ఆయన మాటలు విని... భావోద్వేగంతో మరిన్ని కన్నీళ్లు కార్చారు. ‘అన్న వచ్చాడు. మాట ఇచ్చాడు. నిలబెట్టు కుంటాడు’... అని భావించారు. ఇదంతా జరిగి ఏడాది గడిచిపోయింది. ‘మాట’ మాటగానే మిగిలిపోయింది. బాధితుల గోడు... అలాగే వినిపిస్తోంది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి, పెను విధ్వంసం సృష్టించి రేపటికి ఏడాది అవుతున్న సందర్భంగా, క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సవివర, సచిత్ర కథనం..

(రాయచోటి - ఆంధ్రజ్యోతి)

2021 నవంబరు 19వ తేదీ! అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఉన్న ఆరు గ్రామాలకు అది కాళరాత్రి! అప్పటికే నిండుకుండలా ఉన్న ప్రాజెక్టు మట్టికట్ట మెల్లగా బీటలు వారడం మొదలుపెట్టింది. మట్టి జారుతూ.. నిమిషాల వ్యవధిలోనే మట్టికట్ట కరిగిపోయింది. ప్రాజెక్టు పరిధిలో ఒద్దికగా ఉండాల్సిన చెయ్యేరు ఒక్కసారిగా ఊళ్లపై విరుచుకుపడింది. రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట, గుండ్లూరు, రామచంద్రాపురం గ్రామాలను ఊడ్చేసింది. ఇళ్లు నేలమట్టమయ్యాయి. పొలాలు ఇసుకదిబ్బల్లా మారాయి. 39 నిండు ప్రాణాలను చెయ్యేరు తనలో కలిపేసుకుంది. శివాలయంలో పూజ చేయడానికి వెళ్లిన మందపల్లెలోని పూజారి కుటుంబంలో 9మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా 390 ఇళ్లు రాళ్ల కుప్పలుగా, ఇసుక దిబ్బలుగా మారాయి. వేలసంఖ్యలో మూగ జీవాలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పచ్చగా కనిపించే పొలాలపైన ఇసుక దిబ్బలు తిష్టవేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే..... ఆ గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ కనీసం రూ.20 లక్షలు, గరిష్ఠంగా రూ.50 లక్షలు నష్టపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు వారాలు హడావుడి చేశారు. ఆ తర్వాత బాధితులను అదే వరదకు వదిలేశారు. ‘మూడు నెలల్లో అందరికీ ఇళ్లు కట్టించి... మీ చేతుల్లో తాళాలు పెడతాం’ అని పలికిన ముఖ్యమంత్రి జగన్‌ మళ్లీ అటు వైపు రానే లేదు.

ఒక్కరోజు తర్వాత వచ్చిన సీఎం...

అన్నమయ్య ప్రాజెక్టుకట్ట తెగిపోయిన మరుసటి రోజే...అంటే గత ఏడాది నవంబరు 20న సీఎం జగన్‌ ఆ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేశారు. బాధితులను ఆదుకోవాలని కలెక్టర్‌, ఇతర అధికారులను ఆదేశించారు. 22న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ గ్రామాలలో పర్యటిస్తున్నట్లు ప్రకటించడంతో అంతా అప్రమత్తమయ్యారు. తక్షణ సాయంగా దెబ్బతిన్న ఇంటికి రూ.5,800 చొప్పున చెక్కులు ఇచ్చారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. సొంత జిల్లాలో ఇంత విధ్వంసం జరిగినా... ముఖ్యమంత్రి కాలు కింద పెట్టలేదన్న విమర్శలు తీవ్రమయ్యాయి. ఎట్టకేలకు డిసెంబరు 2న జగన్‌ ‘దిగి’ వచ్చారు. దెబ్బతిన్న గ్రామాలలో పర్యటించారు. ‘‘మీరెవరూ అధైర్యపడవద్దు. ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే రెండు నెలల్లో ఇళ్లు నిర్మించి.. బీగాలు మీ చేతికి పెడుతుంది’’ అని చెప్పారు.

దాతల సాయమే దిక్కు

ఇంటితో పాటు సర్వం కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.95వేలు అందించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారమూ చెల్లించారు. ప్రతి ఇంటికీ తక్షణ సాయంగా రూ.5,800 ఇచ్చారు. అంతటితో సర్కారు వారి ‘సహాయ పాత్ర’ ముగిసింది. బాధిత గ్రామాల్లో ఉన్న ఇళ్లలో బురద తొలగించేందుకే ఒక్కొక్కరు రూ.20వేల నుంచి లక్ష దాకా ఖర్చు పెట్టారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పొలాల్లో ఇసుక మేటలు ఉన్నాయి. దీంతో పొలాలు పండడం లేదు. ఫలితంగా కూలి పనులు కూడా దొరకడం లేదు. వ్యవసాయ పనులపైనే ఆధారపడ్డ కూలీలు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. మృతుల కుటుంబాలకు మాజీ సీఎం చంద్రబాబు రూ.లక్ష, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. నిత్యావసరాలు మొదలుకుని అత్యవసరాల వరకు... పలు స్వచ్ఛంద సంస్థలు బాధితులకు తమకు తోచిన విధంగా సాయం చేశాయి. దాతల సాయమే లేకుంటే.. ప్రభుత్వం చేసిన నామమాత్రపు సాయానికి ఎప్పుడో చనిపోయే వాళ్లమని బాధితులు వాపోతున్నారు.

పునాదుల దశలోనే ఇళ్లు..

పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేటలలో బాధితులకు ప్రభుత్వం 350 ఇళ్లు మంజూరు చేసింది. పులపత్తూరు, మందపల్లె బాధితులకు ఒకే చోట ఐదు సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్ని ఇచ్చారు. ఇందులో ఒకటిన్నర సెంటులో ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్పింది. సుమారు 100 మంది బాధితులు తామే స్వయంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. మరో 250 ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వం కాంట్రాక్టరుకు అప్పగించింది. ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ ఈ ఇళ్లన్నీ పునాదుల దశలోనే ఉన్నాయి. సొంతంగా కట్టుకున్న వారికీ డబ్బులు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చెప్పి పన్నెండు నెలలు అవుతోంది. ‘తాళం చెవుల’ సంగతి పక్కనపెడితే... ఆ ఇళ్ల నిర్మాణం తలుపుల దశకూ చేరుకోలేదు.

నీటితో కష్టాలు... గాలిలో ప్రాణాలు...

పచ్చటి పొలాలు! చేతినిండా పనులు! ప్రశాంతంగా సాగే జీవితం! అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో అందరి జీవితాలు తలకిందులయ్యాయి. ఈ వరదలో సర్వం కోల్పోయిన వారిలో పులపత్తూరుకు చెందిన వెంకట సుబ్బయ్య (30) ఒకరు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోయారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక.. తలదాచుకునేందుకు సరైన గూడు లేకపోవడంతో బాధితులు ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ, వానకు తడుస్తూ బతుకులీడుస్తున్నారు. రేకుల షెడ్లు, టార్పాలిన్‌ గుడారాలు వీరి ప్రాణాలను కాపాడలేకపోతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండ వేడిని తాళ్లలేక వడ దెబ్బతో నలుగురు మరణించారు. వీళ్ల కుటుంబాలకు ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

‘తానా’ షెడ్లే దిక్కు

‘బాధితులకు తక్షణం గూడు, నీడ కల్పిస్తున్నాం’ అంటూ అప్పట్లో అధికారులు హడావుడి చేశారు. సీఎం వచ్చేముందు బాధిత గ్రామాల్లో జర్మన్‌ షెడ్లు వేశారు. ఆ తర్వాత వాటినీ తొలగించారు. బాధితులకు తాత్కాలికంగానైనా గూడు ఉండాలని అప్పట్లో పులపత్తూరులో తానా (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా) వారు ఐరన్‌ షీట్లతో రెండు భారీ షెడ్లు వేశారు. ఒక్కో షెడ్డులో 30 కుటుంబాలు ఇప్పటికీ ఆ షెడ్లలోనే తలదాచుకుంటున్నాయి.

బాధితులకు ప్రభుత్వం మొదట ఏట్లో తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేసింది. తర్వాత వాటిని తొలగించి సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. మూడు నెలల క్రితం వచ్చిన భారీ గాలులకు పైకప్పుగా వేసిన రేకులు కొట్టుకుపోవడంతో ఈ మరుగుదొడ్లు కూడా నిరుపయోగంగా మారాయి.

నాడు జగన్‌ ఇచ్చిన మాట..

‘‘ఇప్పటికే 99 శాతం సహాయక చర్యలు పూర్తి చేశాం. ఇంకా ఎవరికైనా సాయం అందకపోతే సోషల్‌ ఆడిట్‌ ద్వారా అందరికీ సహాయం చేస్తాం. పులపత్తూరులో 293 ఇళ్లు కుప్పకూలిపోయాయి. వారందరికీ సురక్షిత ప్రాంతాల్లో 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇల్లు కట్టించి తాళం చెవి మీ చేతికిస్తాం. మిగిలిన ఆరు గ్రామాల బాధ్యతా ప్రభుత్వమే తీసుకుంటుంది. వరద ఉధృతికి పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. సమగ్ర సర్వే చేసి ఇసుక మేటలను తొలగించేందుకు హెక్టారుకు 12 వేలు ఇస్తాం. పులపత్తూరు నుంచి నందలూరు బ్రిడ్జి వరకు చెయ్యేరు ఇరువైపులా నదీ తీరంలో వరద ముంపు గ్రామాల్లో రక్షణ గోడ నిర్మిస్తాం. ఆటోలు, బైకులు కోల్పోయిన వారికి... రిజిస్ట్రేషన్‌ నంబర్ల ఆధారంగా న్యాయం చేస్తాం!’’

(గత ఏడాది డిసెంబరు 2వ తేదీన

పులపత్తూరులో సీఎం జగన్‌ చెప్పిన మాటలు)

ఎక్కడి సమస్యలు అక్కడే..

వరదనీటితో రోడ్లన్నీ కొట్టుకు పోయాయి. చాలాచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేశారు. మరికొన్ని చోట్ల మట్టితో సరిచేశారు. చినుకుపడితే.. ఈ రోడ్లమీద నడవడం కష్టంగా ఉంది.

వందలాదిగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం కొంతమేర శిథిలాలను తొలగించింది. కొన్నింటిని వదిలేసింది. అవన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

వేల ఎకరాల్లో ఇసుకమేట వేసింది. తొలుత ఇసుక తొలగింపు పేరిట హడావుడి చేశారు. ఆపై చేతులెత్తేశారు.

వరద ఉధృతికి పొలాల గట్లు తెగిపోయాయి. ఏది ఎవరి పొలమో తెలియని పరిస్థితి. ‘జగనన్న భూరక్ష’ అని ఆర్భాటపు ప్రచారం చేస్తున్న ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు బాధిత గ్రామాల్లో ఆ సర్వే చేపట్టలేదు.

ఇక్కడ ఊళ్లున్నాయనిగానీ, ప్రజలున్నారని గానీ అధికార యంత్రాంగం గుర్తించడమే లేదు. కనీసం ఎలా ఉన్నామో చూసేందుకూ ఆర్డీవో, తహసీల్దార్‌ తమ గ్రామాలకు రావడం లేదని బాధితులు వాపోతున్నారు.

ప్రముఖ పురాతన మందిరంపాలేశ్వరాలయం. చెయ్యేరు వరదలో నామరూపాల్లేకుండా పోయింది. ప్రభుత్వం లేదా టీటీడీ గుడి నిర్మిస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. మరిచిపోయారు.

Updated Date - 2022-11-18T04:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising