Tiripathi: మనకోసమే జీవిస్తే ఏం జీవితం..: ద్రౌపదీ ముర్ము
ABN, First Publish Date - 2022-12-05T14:58:58+05:30
ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
తిరుపతి: ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘సర్వశ్రేష్టమైన మనుషులమై ఉండి. మీ కోసం మాత్రమే మీరు జీవించకండి.. జంతువులు కూడా అలాగే జీవిస్తుంటాయి.. మన కోసమే జీవిస్తే ఏం జీవితం.. ఇతరుల కోసం జీవించినపుడే సరైన జీవితం అవుతుంది.. మీరు ఎదగండి.. వెనక్కు చూడండి.. వెనుకబడిన వారు ఎందుకు అలా ఉన్నారో తెలుసుకుని వారినీ ముందుకు తీసుకువెళ్లటానికి కృషి చేయండి’’ అంటూ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు వారి వారి గ్రామాలను దత్తత తీసుకుని, ఒకటి రెండు రోజులు రాత్రుల్లో అక్కడే ఉండాలని, మహిళలతో, పిల్లలతో, పురుషులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు వారి వద్దకు చేరుతున్నాయా? లేదా? తెలుసుకోవాలని సూచించారు. దేశ అభివృద్ధికి ఇంకా ఎలాంటి పథకాలు కావాలి. పిల్లలకు ఉన్న స్కీములు సరిగ్గా ఉన్నాయా? మార్పులు చేయాలా? తెలుసుకుని కలెక్టర్‌కు నివేదికలు ఇవ్వాలన్నారు.
రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుతోందని కిచెన్ గార్డన్‌ల ద్వారా పచ్చదనాన్ని పెంచాలని ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆడ, మగబిడ్డల మధ్య బేధం చూపకూడదని, ఇద్దరినీ సమానంగా దైర్యాన్ని, అవకాశాలను కల్పించాలన్నారు. తక్కువ చదువుకున్నాం అనే భావన వద్దని, అన్నిటికీ చదువు ముఖ్యం కాదన్నారు. గ్రామాల్లో నాటు మందులు తయారు చేసే వారు ఎంబీబీఎస్ చదవక పోవచ్చు. అయితే వారి వైద్యంలో ఎంతో నాణ్యత ఉంటుందన్నారు. గతంలో మహిళలు బ్యాంకులకు, కలెక్టరేట్‌లకు వెళ్లటానికి కూడా భయపడేవారని, స్వయం సహాయక బృందాల వల్ల కలిసి చేసే ప్రయాణంతో వారికి దైర్యం వచ్చిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
Updated Date - 2022-12-05T14:59:02+05:30 IST