TTD: రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ
ABN, First Publish Date - 2022-10-31T19:57:34+05:30
తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy) సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు (Timeslot tokens) మంగళవారం నుంచి తిరుపతిలో భక్తులకు జారీ చేయనున్నారు.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy) సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు (Timeslot tokens) మంగళవారం నుంచి తిరుపతిలో భక్తులకు జారీ చేయనున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీచేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. శని, ఆది, సోమవారాల్లో రోజుకు 25వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD Eo Dharma Reddy) తెలిపారు. టోకెన్ లభించిన భక్తులు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మూడుప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని, నిర్దేశిత కోటా పూర్తవ్వగానే కౌంటర్లు మూసివేస్తామన్నారు.
టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠం క్యూంకాంప్లెక్స్-2 ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. లోటుపాట్లను సరిదిద్దుకుంటూ క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచుతామని తెలిపారు. ఆధార్ నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్ పొందే అవకాశముంటుందన్నారు. తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గించడం కోసం డిసెంబరు 1వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తామని, అక్కడే గదులు కేటాయిస్తామని తెలిపారు.
Updated Date - 2022-10-31T19:58:18+05:30 IST