వెంకటగిరి జాతరకు రాజాల తాంబూలం
ABN, First Publish Date - 2022-09-02T05:45:24+05:30
వెంకటగిరి పట్టణంలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న పోలేరమ్మ జాతర నిర్వహణకు రాజకుటుంబీకులు తాంబూల మిచ్చి అనుమతించారు.
వెంకటగిరి, సెప్టెంబరు 1 : వెంకటగిరి పట్టణంలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న పోలేరమ్మ జాతర నిర్వహణకు రాజకుటుంబీకులు తాంబూల మిచ్చి అనుమతించారు.అమ్మవారి ఆచారాలు నిర్వహించే పనిబాటలవారు, దేవదాయ శాఖ అధికారులు, పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ గొల్లగుంట మురళి, మాజీ చైర్మన్ పులి కృష్ణారెడ్డి తదితరులు బుధవారం నగరిలోని బొడ్డుసైగల్ మండపంలో రాజకుటుంబీకులైన కుమారరాజా సర్వజ్ఞకుమార యాచేంద్ర సాయికృష్ణయాచేంద్రలను కలిశారు. కుమ్మరి, చాకలి, ఎట్టివారికి రాజకుటుంబీకులు పూలమాలలు వేసి ఆకు, తాంబూలం అందించి జాతర ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.గొల్లగుంట మురళి మాట్లాడుతూ జాతరలో భక్తులకు మంచినీళ్ళు, మజ్జిగ పంపిణీ చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.అంతకుముందు రాజా నగరినుంచి ప్రదర్శనగా బయల్దేరి కైవల్యా నది వంతెన వద్ద ఉన్న వెంకటగిరి పెద్దరాజా వీవీవీఆర్‌కే యాచేంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం అర్ధరాత్రి జాతర పనిబాటల వారు కాంపాళ్ళెం వద్ద ఉన్న కామాక్షమ్మ దేవస్థానం వద్ద టెంకాయ కొట్టి చేతబట్టిన తప్పెటపై మూడు దెబ్బలు వేసి వచ్చే బుధవారం జాతరహో అంటూ దండోరా వేశారు.బుధవారం రాజాల తాంబూలంతో తొలిచాటు పూర్తి కాగా 7వ తేది రెండవ చాటు వుంటుంది. 11వ తేది అమ్మవారి రాకను తెలియజెప్పే ఘటోత్సవ కార్యక్రమం జరుగుతుంది.14వ తేది 3వ చాటుతో అమ్మవారు కొలువుదీరతారు.ఆ రోజు రాత్రే జాతర.అదే రోజు మడిబిక్షాలు, అంబలి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కోళ్లను బలి ఇచ్చి, వేయికళ్ళ దుత్తల్లో పిండిదీపాలు వెలిగించి అమ్మవారి అనుగ్రహం కోసం మొక్కులు చెల్లించుకుంటారు. 15వ తేది గురువారం దున్నపోతు బలి, ఇళ్ళ ముంగిట పోట్టేళ్ళ బలి, మడి చీరలపై నడవడం, నవధాన్యాల మొలకలు అమ్మవారికి సమర్పించి అనుగ్రహం కోరడం, అమ్మవారి విరూపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి.
Updated Date - 2022-09-02T05:45:24+05:30 IST