Adani : అదానీకి బొగ్గు.. జెన్‌కోకు మసి!
ABN, First Publish Date - 2022-10-30T05:21:47+05:30
అది బంగారంలాంటి బొగ్గుగని! విదేశీ బొగ్గుతో సమానమైన నాణ్యమైన బొగ్గు లభిస్తుంది. మన రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) చేతిలోనే ఉంది.
మధ్యప్రదేశ్ గని వేలంలో ఏమిటీ మతలబు?
విదేశీ బొగ్గుతో సమానమైన నాణ్యత
75% బొగ్గు వేలంలో విక్రయం
అదానీ కంపెనీకే దక్కిన బొగ్గు
బిడ్డర్లు, పోటీపై అంతా గప్‌చుప్
ఏపీఎండీసీ చేతిలోనే ఆ గని
అయినా వదులుకున్న వైనం
(అమరావతి - ఆంధ్రజ్యోతి): అది బంగారంలాంటి బొగ్గుగని! విదేశీ బొగ్గుతో సమానమైన నాణ్యమైన బొగ్గు లభిస్తుంది. మన రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) చేతిలోనే ఉంది. కానీ... అక్కడ తవ్వే బొగ్గులో 75 శాతం ‘వేలం’ రూపంలో అదానీకి సొంతమైపోయింది. ‘వేలం’లో ఎందరు పాల్గొన్నారు? బిడ్డింగ్‌లో పోటీ ఏ స్థాయిలో ఉంది? ఇదే వేలంలో జెన్‌కో ఎందుకు పాల్గొనలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం లభించడంలేదు. వివరాలు అడిగినా అధికారులు గప్‌చుప్! దీంతో... అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 1298 హెక్టార్లలో విస్తరించిన ఈ బొగ్గుగని నుంచి ఏటా ఐదు మిలియన్ టన్నుల బొగ్గును తవ్వేందుకు వీలుంది. ఇది బాగా నాణ్యమైన ‘బి’గ్రేడ్ బొగ్గు! థర్మల్ ప్లాంట్లకు బంగారం లాంటిదే. గత ప్రభుత్వ హయాంలో వేలం పాటలో ఇది ఏపీఎండీసీ సొంతమైంది. ఈ మైన్‌లో 22 ఏళ్లపాటు బొగ్గు తవ్వకాలు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మధ్యప్రదేశ్ బొగ్గును వాడుతామని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. కానీ... అది అదానీ అవసరాలు తీరుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు గనిలో 75 శాతం బొగ్గును బహిరంగ వేలంలో విక్రయించాలి.
ఈ వేలంలో ఏపీ జెన్‌కో కూడా పాల్గొనవచ్చు. దేశీయంగా నాణ్యమైన బొగ్గుకు కొరత ఉంది. బహిరంగ మార్కెట్లో టన్ను బొగ్గు ధర రూ.5300 నుంచి రూ.8000 వరకూ పలుకుతోంది. అయితే... టన్ను రూ.3200లకే అదానీ సంస్థ ఈ ‘లీజు’ దక్కించుకుంది. 2025 మార్చి వరకు రోజుకు లక్షన్నర టన్నుల బొగ్గు అదానీ కంపెనీ తవ్వుకోవచ్చు. ఈ బొగ్గును జెన్‌కో దక్కించుకుని ఉంటే... విద్యుదుత్పత్తి వ్యయం భారీగా తగ్గేదని నిపుణులు చెబుతున్నారు. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ‘బొగ్గు’ను ఒక సాకుగా చూపించారు. ఈ ప్లాంటులో 30 శాతం విదేశీబొగ్గును ఉపయోగించాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్ గనుల బొగ్గుకు విదేశీ బొగ్గుతో సమానమైన నాణ్యత ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యుత్కేంద్రాల కోసం మధ్యప్రదేశ్ బొగ్గును అప్పగించాలని ఇటీవల ఏపీఎండీసీని ఇంధన శాఖ కోరినట్లు తెలిసింది. 2025 మార్చివరకు అమలులో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుందామని ఏపీఎండీసీ ప్రతిపాదించగా... అదానీ కంపెనీ ఇందుకు నిరాకరించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తలచుకుంటే... ఈ 75 శాతం బొగ్గును స్వాధీనం చేసుకోవడం కష్టంకాదని అంటున్నారు.
Updated Date - 2022-10-30T06:28:25+05:30 IST