రత్నగిరిపై భక్తులకు సౌకర్యాలేవి
ABN, First Publish Date - 2022-12-07T00:27:20+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తులకు సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి సారించడం లేదు. పదే పదే ఇబ్బందులు తలెత్తుతున్నా పాఠాలు నేర్చుకోవడం లేదు. పర్వదినాల్లో కొండపై భక్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.
అధికారులు దృష్టి సారించడం లేదు
ఇబ్బందులు పడుతున్న భక్తులు
అన్నవరం, డిసెంబరు 6: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తులకు సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి సారించడం లేదు. పదే పదే ఇబ్బందులు తలెత్తుతున్నా పాఠాలు నేర్చుకోవడం లేదు. పర్వదినాల్లో కొండపై భక్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అయినప్పటికీ వారికి సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు అది వదిలేసి అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. భక్తులకు సౌకర్యాల కల్పన కూడా ఆలయ అభివృద్ధిలో భాగమేనని విషయాన్ని మరిచిపోతున్నారు. ఇటీవల కార్తీకమాసం పర్వదినాలలో వేలాదిగా భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. కానీ నిజం చెప్పాలంటే వారిలో వసతి సౌకర్యాన్ని వినియోగించుకున్న వారు చాలా తక్కువ. ఎందుకంటే వేలాదిగా వస్తున్న భక్తులకు కొండపై సరిపడ గదులు లేవు. ఇక దర్శనాల సమయంలో రద్దీ అంతాఇంతా కాదు. ఒకానొక దశలో రద్దీ నియంత్రించేందుకు పశ్చిమ రాజగోపురం తలుపులు మూసివేసిన పరిస్థితి వచ్చింది. ఆ పాఠం నుంచి అధికారులు ఎంతో నేర్చుకుని ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అన్నవరం దేవస్థానంలో సౌకర్యాల కల్పనకు భారీ నిర్మాణాలు చేపట్టాలంటే ప్రతిపాదనల దశ నుంచి నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి రావాలంటే కనీసం 5 ఏళ్ల సమయం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రత్నగిరి అధికారులు ఇప్పటి నుంచే అడుగులు వేయాలి. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు ప్రధానమైనవి వ్రత మండపాలు, సత్రం గదులు అయితే అధికారులు మాత్రం వీటిపై దృష్టి పెట్టకుండా మిగిలిన పనులపై శ్రద్ధ పెడుతున్నారు. ప్రధానంగా రూ.300 వ్రత మండపాలను టీటీడీ సత్రం వద్దకు మార్చితే ప్రయోజనం ఉంటుంది. అలాగే రూ.1500 వ్రతం చేసుకునే భక్తులు, రూ.2000 వ్రతం భక్తులు, ప్రత్యేక దర్శనాలకు వచ్చే ప్రముఖులు వెళ్లే మార్గం ఒక్కటే కావడంతో అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా రత్నగిరిపై భక్తులను వేధిస్తున్న ప్రధాన సమస్య వసతి. హరిహరసదన్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో సాధారణ భక్తుల కోసం వసతి గదులను నిర్మించాలి. ప్రధానాలయ ప్రాంగణాన్ని కేవలం దర్శనాలకు మాత్రమే వినియోగించుకుని రూ. 2 వేల వ్రత మండపాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. నిత్యాన్నదాన నూతన భవనం త్వరితగతిన పూర్తవ్వాలి. భక్తులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా దేవస్థానం అధికారులు మాత్రం పాఠాలు నేర్చుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రసాద్ స్కీం నిధులపై ఆధారపడి కనీస అవసరాలకు దేవస్థానం నిధులు ఖర్చు చేయాల్సిన విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రధానంగా భక్తులు సమర్పించే కానుకలను సౌకర్యాల కల్పనకు కాకుండా రంగులు వేసేందుకు, పరికరాల కొనుగోలుకు, చిన్నచిన్న నిర్మాణాలకు వినియోగిస్తుంది. అయితే ప్రసాద్ స్కీంకు అడుగులు పడి సుమారు మూడేళ్లు కావొస్తున్నా అదిగో మంజూరవుతున్నాయి, ఇదిగో మంజూరవుతన్నాయి అంటూ ప్రకటనలు వస్తున్నాయి తప్ప నిధులు విడుదల కావడం లేదు. నిధుల విడుదలకు కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విశ్వప్రయత్నం చేస్తున్నా నిధుల విడుదలలో జాప్యం అలానే ఉంది. ప్రధానంగా రూ.300 వ్రత మండపాలు టీటీడీ సత్రం వద్దకు మార్చాలని ప్రసాద్ స్కీంలో రూ.7.73 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇటీవల రత్నగిరికి విచ్చేసిన దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్ వ్రత మండపాలను అక్కడకు ఎలా మారుస్తారు అనడంతో రత్నగిరి అధికారులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే ప్రసాద్ స్కీం మంజూరుకు 80శాతం పనులు పూర్తయిన తర్వాత నిధుల విడుదల ప్రకటన వచ్చే సమయంలో ఇలా అడ్డుపడితే మరిన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న 30 సంవత్సరాలలో భక్తుల రద్దీని భట్టి సౌకర్యాల కల్పనకు ఇప్పటినుంచే అడుగులు వేయాలి.
Updated Date - 2022-12-07T00:27:22+05:30 IST