మళ్లీ ‘హోప్’
ABN, First Publish Date - 2022-04-24T07:04:27+05:30
గోదావరిలో బోటు ప్రమాదం నేపథ్యంలో రెండున్నరేళ్లుగా హోప్‌ఐలాండ్‌కు బోటు షికారును ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో తిరిగి బోటు ప్ర యాణాన్ని ప్రారంభించేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది.
- కాకినాడ నుంచి హోప్‌ఐలాండ్‌కు మళ్లీ బోటు షికారు
- అక్కడ జలక్రీడలకు వీలుగా పీపీపీ విధానంలో ఏర్పాట్లు
- టెండర్లు పిలిచిన పర్యాటక అభివృద్ధి సంస్థ
- ఇప్పటికే బోటు నడపడానికి ముందుకు వచ్చిన ఓ ప్రైవేటు ఆపరేటర్
- అనుమతుల జారీ కోసం ఏపీటీడీసీ ఎండీకి ప్రతిపాదనలు పంపిన పర్యాటకశాఖ
- తొలుత పర్యాటకశాఖ ముందుకు వచ్చినా బోటుకు ఫిట్‌నెస్ లేక లైసెన్సు రద్దు
కాకినాడ నుంచి హోప్ ఐలాండ్‌కు బోటులో ప్రయాణిస్తే ఆ మజానే వేరు. ఒకపక్క పోర్టు.. ఆ పక్క నుంచి నౌకలు.. ఊత్సాహపరిచే కెరటాలు.. అక్కడినుంచి సుదూరం గా అందాలొలుకుతూ కనిపించే కొరంగి అభయారణ్యం.. రారమ్మంటూ పిలిచే హోప్ ఐలాండ్.. అక్కడ దిగితే విదేశీ ఐలాండ్ వాతావరణాన్ని తలపించే చూడచక్కని ప్రకృతి అందాలు..ఇలా వర్ణించడానికి మాటలు చాలవు.. ఇలాంటి హోప్ ఐలాండ్‌కు పర్యాటకంగా మళ్లీ కొత్త రోజులు రాబోతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే కాకినాడనుంచి హోప్ ఐలాండ్‌కు వెళ్లి సేదతీరి రావొచ్చు.. ఈ విశేషాలేంటో తెలుసుకుందామా..
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
గోదావరిలో బోటు ప్రమాదం నేపథ్యంలో రెండున్నరేళ్లుగా హోప్‌ఐలాండ్‌కు బోటు షికారును ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో తిరిగి బోటు ప్ర యాణాన్ని ప్రారంభించేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. బోటుషికారును ప్రోత్సహించడంతోపాటు పీపీపీ విధానంతో హోప్‌ఐలాండ్ ప్రాంతంలో జలక్రీడలను ని ర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం టెండర్లు పిలిచింది. మరోపక్క కాకినాడ నుంచి హోప్‌ఐలాండ్‌కు బోటు నడపడానికి ఓ ప్రైవేటు సంస్థ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేస్తూ పర్యాటకశాఖను సంప్రదించింది. దీంతో మళ్లీ బోటు షికారుకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతోంది.
ఎంత హాయో..
కాకినాడ నుంచి సముద్రంలో దాదాపు రెండు గంటలు ప్రయాణిస్తే హోప్‌ఐలాండ్ వస్తుంది. వందల ఎకరాల్లో సహజసిద్ధంగా సముద్రం మధ్యలో ఏర్పడ్డ ఈ ద్వీపం చూడ్డానికి రెండు కళ్లు చాలవు. కాకినాడ నగరానికి రక్షణ కవచంగా పిలిచే ఈ ఐలాండ్ వందల ఎకరాల్లో సహజసిద్ధంగా విస్తరించింది. ఇక్కడ ఎటుచూసినా చెట్లు.. స్వచ్ఛమైన తాగునీరు కూడా దొరుకుతుంది. ఇక్కడ దిగిన పర్యాటకులు రోజంతా తక్కువ లోతులోని సముద్ర జలాల్లో ఆటపాటలతో సేదతీరవచ్చు. అందుకే కాకినాడనుంచి హోప్‌ఐలాండ్‌కు వెళ్లే బోటు షికారుకు ఎప్పుడూ డిమాండే. విశాఖ, హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల పర్యాటకులు సైతం ఇక్కడకు పోటెత్తేవారు. 2019, సెప్టెంబరులో గోదావరి బోటు ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం అన్నిరకాల బోటు ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో హోప్‌ఐలాండ్ బోటు షికారు రద్దయింది. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఐలాండ్‌కు వెళ్లాలనుకున్నా ప్రయాణించ లేని పరిస్థితి. గతేడాది నవంబరులో తిరిగి రాష్ట్ర పర్యాటకశాఖ జలవిహారానికి అనుమతి ఇచ్చింది. దీంతో రాజమహేంద్రవరం నుంచి పాపికొండలకు బోటు షికారు ప్రారంభమైంది. అదే సమయంలో హోప్‌ఐలాండ్‌కు కూడా బోటు ప్రయాణాలు మొదలవుతాయని పర్యాటకులు ఆశపడ్డా ఆశలు అడియాశలయ్యాయి. పర్యాటకశాఖ ఇక్కడినుంచి బోటు నడపడానికి మూడు నెలల కిందట ప్రయత్నించింది. హోప్‌ఐలాండ్‌కు సర్వీసు మొదలుపెట్టడానికి వీలుగా ఏపీటీడీసీ బోటుకు లైసెన్సు మంజూరు చేయాలని కాకినాడ పోర్టు అధికారులకు దరఖాస్తు చేసుకుంది. తీరా ఆ బోటుకు కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్ లేదని లైసెన్సును తిరస్కరించారు. దీంతో చేసేది లేక గోదావరి జలవిహారం కోసం దీన్ని రాజమహేంద్రవరానికి తరలించారు. దీంతో ఇప్పటికీ హోప్‌ఐలాండ్‌కు పర్యాటక సర్వీసులు లేక పర్యాటకులు ఈసురోమంటున్నారు.
పర్యాటకుల ఆరా
అనేకమంది కాకినాడకు వచ్చే పర్యాటకులు హోప్‌ఐలాండ్ పర్యటన కోసం ఆరా తీస్తున్నారు. తీరా ఇంకా మొదలుపెట్టలేదని తెలిసి ఈసురోమంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీటీడీసీ తాజాగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కాకినాడ నుంచి హోప్‌ఐలాండ్‌కు బోటు షికారు ప్రారంభించడంకోసం ప్రైవే టు పార్టీలనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ టెండరు పిలిచిం ది. బోటు షికారుతోపాటు హోప్‌ఐలాండ్ పరిసరాల్లో జలక్రీడ లు కూడా నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది. పీపీపీ విధానంలో ఈ సౌకర్యాలు చేపట్టడానికి నిర్ణయించింది. హోప్‌ఐలాండ్ నుంచి స్పీడ్‌బోట్‌ల్లో షికారుతోపాటు పలు రకాల జల క్రీడలు ప్రోత్సహించేలా టెండర్ నిబంధనల్లో వివరాలు ప్రస్తావించింది. దీంతో పలు సంస్థలు దరఖాస్తు చేయడానికి ముందుకు వచ్చాయి. ఉదయం హోప్‌ఐలాండ్‌కు వెళ్లే పర్యాటకులకు అక్కడే విశ్రాంతి గదులు, ఆటపాటలు పూర్తిచేసుకుని తిరిగి సాయంత్రానికి వచ్చేలా వసతులు కల్పించాలని పర్యాటకశాఖ భావిస్తోంది. దీంతో ఓ ప్రైవేటు సంస్థ ఇటీవల బోటు షికారు ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. పర్యాటకశాఖ జిల్లా అధికారులను సంప్రదించింది. దీంతో ఈ ప్రతిపాదనలను జిల్లా అధికారులు ఏపీటీడీసీ ఎండీకి పంపించారు. అన్ని నిబంధనలు పక్కాగా ఉంటే త్వరలో హోప్‌ఐలాండ్ షికారుకు పచ్చజెండా ఊపనుంది.
Updated Date - 2022-04-24T07:04:27+05:30 IST