‘షికారు’ సాగేనా
ABN, First Publish Date - 2022-10-28T01:51:02+05:30
కాకినాడ నుంచి హోప్ ఐలాండ్‌కు సముద్రంలో విహరిస్తే ఆ మజాయే వేరు. చుట్టూ నీలిసముద్రం.. నీటిపై తేలి యాడుతూ కట్టిపడేసే మడ అడవులు ప్రకృతి ప్రియులకు మాటల్లో వర్ణించలేని అనుభూతులు అందిస్తాయి. కచ్చు లూరు బోటు ప్రమాదం తర్వాత హోప్ ఐలాండ్‌కు పర్యాటక రాకపోకలు నిలిచిపోయాయి.
కాకినాడ నుంచి హోప్‌ఐలాండ్‌కు 50సీట్లతో పర్యాటక బోటు
తీరం నుంచి హౌస్‌బోట్,స్పీడ్‌బోట్,జెట్‌స్కీ సర్వీసులు కూడా
సాహస జల క్రీడల పేరుతో ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించిన ఏపీటీడీసీ
కచ్చులూరు ప్రమాదం తర్వాత మూడేళ్లుగా హోప్ ఐలాండ్‌కు నిలిచిన బోటు షికారు
ఆరునెలల కిందట తిరిగి మళ్లీ బోటు తిప్పాలని పర్యాటక సంస్థ ప్రయత్నం
తీరా పాతది కావడంతో లైసెన్సు తిరస్కరించిన పోర్టు అధికారులు
ఏపీటీడీసీ టెండర్లకు కొన్నేళ్లుగా స్పందన రాని నేపథ్యంలో ఈప్రాజెక్టుపైనా నీలినీడలు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
కాకినాడ నుంచి హోప్ ఐలాండ్‌కు సముద్రంలో విహరిస్తే ఆ మజాయే వేరు. చుట్టూ నీలిసముద్రం.. నీటిపై తేలి యాడుతూ కట్టిపడేసే మడ అడవులు ప్రకృతి ప్రియులకు మాటల్లో వర్ణించలేని అనుభూతులు అందిస్తాయి. కచ్చు లూరు బోటు ప్రమాదం తర్వాత హోప్ ఐలాండ్‌కు పర్యాటక రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హోప్ ఐలాండ్ చూడా లనుకునే వారికి ఆ కల కలగానే మిగిలిపోయింది. మళ్లీ మూడేళ్ల తర్వాత మళ్లీ హోప్ ఐలాండ్‌కు షికారు మొదలు పెట్టేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. తన వద్దనున్న పాతబోటుకు లైసెన్సులు రాకపోవడంతో ఇప్పుడు ప్రైవేటు సంస్థతో కలిపి సర్వీసులు ప్రారంభించడానికి టెండర్లు పిలిచింది. 50సీట్ల సామర్థ్యంతో కొత్త బోటుతో షికారు మొదలుపెట్టడానికి అడుగులు వేస్తోం ది. కాకినాడ తీరం నుంచి పర్యాటకులు సొంతంగా హౌస్ బోట్, స్పీడ్‌బోట్, జెట్‌స్కీలో వెళ్లేలా సాహస జలక్రీడలూ నిర్వహించబోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఏపీటీడీసీ టెండర్లకు కూడా స్పందన కొరవడుతున్న నేప థ్యంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతాయా? అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి.
ఆచరణపై అనుమానాలెన్నో...
కాకినాడ అంటే పర్యాటకులకు ఠక్కున గుర్తొచ్చేది హోప్ ఐలాండ్. సముద్రంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ద్వీపం రక్షణ కవచంలా నగరాన్ని కాపాడుతోంది. ఈ హోప్ ఐలాం డ్ చూడ్డానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తికాదు. అం దుకే ఎక్కడెక్కడినుంచో పర్యాటకులు పరుగులు తీసుకుని కాకినాడకు వాలిపోతారు. 2019, సెప్టెంబర్‌లో గోదావరిలో కచ్చులూరువద్ద బోటు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అన్ని రకాల బోటుషికార్లను నిలిపివేసింది. దీంతో హోప్ ఐలాండ్‌కు పర్యాటకుల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు హోప్‌ఐలాండ్‌కు వెళ్లేడానికి వీల్లేని పరి స్థితి. ఆరునెలల కిందట తిరిగి హోప్‌ఐలాండ్‌కు బోటు షికా రు ప్రారంభించడానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రయత్నించింది. ఇంతకుముందు కాకినాడ నుంచి హోప్‌ఐలాండ్‌కు నడిపిన పాత బోటును తిరిగి ప్రా రంభించడానికి సిద్ధపడింది. ఇది పాతది కావడంతో ఫిట్‌నెస్ పరీక్షలో నిలబడలేకపోయింది. దీంతో ఈ బోటుకు లెసెన్సు ఇవ్వడానికి కాకినాడ పోర్టు అధికారులు అంగీకరించలేదు. ఫ లితంగా ఏపీటీడీసీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పోనీ కొత్త బోటు కొందామంటే కోట్లలో ఖర్చవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక మిన్నకుండి పోయింది. ఇప్పుడు స ముద్రంలో సాహస జల క్రీడల పేరుతో ప్రైవేటు సంస్థలతో కలిపి బోటు షికారు సర్వీసులు మొదలుపెట్టడానికి తాజాగా ఏపీటీడీసీ ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రైవేటు ఏజెన్సీలకు బిడ్లు ఆహ్వానం
కాకినాడనుంచి హోప్ ఐలాండ్‌కు 50 సీట్లతో బోటు షికారు ప్రారంభించడానికి ప్రైవేటు ఏజెన్సీలు ముందుకు రా వాలని బిడ్లు ఆహ్వానించింది. రూ.50లక్షల ప్రాజెక్టు వ్యయం తో దీన్ని చేపడుతున్నామని, పనులు దక్కించుకున్న సంస్థ పర్యాటకులతో రాకపోకలు సాగించడంతోపాటు ఇందుకు అ వసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని టెండర్ నిబంధన ల్లో ప్రస్తావించింది. వచ్చేనెల 22వతేదీ నాటికి బిడ్లు దాఖలు చేయాలని కోరింది. కాకినాడ తీరంనుంచి హోప్ ఐలాండ్ వరకు విడివిడిగా వ్యక్తులు సరదాగా వెళ్లి రావడానికి వీలుగా హౌస్‌బోట్, స్పీడ్‌బోట్, జెట్‌స్కీ సర్వీసులు కూడా ప్రారం భించాలని నిర్ణయించింది. రూ.70లక్షల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో భాగంగా బోట్లు సమకూర్చడానికి ప్రైవేటు సం స్థలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి సముద్రంలో సాహస జలక్రీడల పేరుతో ఏపీటీడీసీ గత మూడేళ్లనుంచీ టెండర్లు పిలుస్తూనే ఉంది. కానీ ప్రైవేటు సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాకినాడ బీచ్‌లో పలురకాల సముద్ర జల క్రీడల నిర్వహణకు వీలుగా గతేడాది ఏపీటీడీసీ టెండ ర్లు ఆహ్వానించింది. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ ప్రతిపాదనలు మూలనపడ్డాయి. ఇప్పుడు హోప్‌ఐలాండ్ పేరుతో జల క్రీడలకు ప్రతిపాదించినా దీనికి మునుపటి గతే పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర క్రీడల పేరుతో పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రతిపాదిస్తున్న ప్రా జెక్టు వ్యయాలు అధికంగా ఉండడం, ఆ తర్వాత నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంలో వాటా అధికంగా అడుగుతుం డడంతో ఏ ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదనే విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ఈ నేపథ్యంలో హోప్‌ఐలాండ్ బోటు షికారు ఇప్పట్లో పట్టాలు ఎక్కడం సందేహంగా మారింది.
Updated Date - 2022-10-28T01:51:05+05:30 IST