ఇరిగేషన్ స్థలాలు, భూములు కబ్జా
ABN, First Publish Date - 2022-12-04T00:53:34+05:30
ఇరిగేషన్ స్ధలాలు, భూములు కబ్జాకు గురవుతున్నాయి. కాల్వగట్ల వెంబడి ఉన్న స్థలాలను కబ్జాచేసి గెస్ట్‌హౌస్‌లు, భవంతులు నిర్మిస్తున్నారు. విలువైన ఇరిగేషన్ భూములను పరాయి వ్యక్తులు స్వాధీనం చేసుకుని దర్జాగా సాగుచేస్తూ అనుభవిస్తున్నారు.
పక్కా భవనాలు, గెస్ట్‌హౌస్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం
రూ.4 కోట్ల విలువైన ఇరిగేషన్ భూములు పరాయిపాలు
ఆక్రమణలతో కుచించుకుపోతున్న పంటకాల్వలు
ఆత్రేయపురం, డిసెంబరు 2: ఇరిగేషన్ స్ధలాలు, భూములు కబ్జాకు గురవుతున్నాయి. కాల్వగట్ల వెంబడి ఉన్న స్థలాలను కబ్జాచేసి గెస్ట్‌హౌస్‌లు, భవంతులు నిర్మిస్తున్నారు. విలువైన ఇరిగేషన్ భూములను పరాయి వ్యక్తులు స్వాధీనం చేసుకుని దర్జాగా సాగుచేస్తూ అనుభవిస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువైన ఇరిగేషన్ భూములు అన్యాక్రాంతమైనా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.ఇరిగేషన్ ఆస్తులను పరిరక్షిస్తామని బీరాలు పలుకుతున్న అధికారులు, నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. కబ్జాదారులకు నాయకులు బాహాటంగా సహకారం అందించడంతో అధికారులు సైతం వాటి వంక తొంగి చూడట్లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. మరోవైపు పంటకాల్వలు, మురుగు డ్రెయిన్లు, ప్రధాన కాల్వల రూపురేఖలు మారిపోయాయి. ఆక్రమణలతో అవి కాస్తా కుచించుకుపోయాయి. దీంతో శివారు రైతులు సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనవలసిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా లొల్ల లాకులు, బొబ్బర్లంక వద్ద ఇరిగేషన్ కార్యాలయ సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు. అందులో కొన్ని శిథిలస్థితికి చేరుకోగా మరికొన్ని క్వార్టర్లను ఆక్రమణదారులు స్వాధీనం చేసుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. సుమారు రెండుచోట్లా 50 మంది వరకు ఈ క్వార్టర్లు, స్థలాలను ఆక్రమించుకుని పునర్నిర్మాణాలు చేపట్టారు. బొబ్బర్లంకలో శిథిలస్థితికి చేరుకున్న క్వార్టర్లను తొలగించి అక్రమార్కులు భవనాలు నిర్మించుకున్నారు. క్వార్టర్లు అన్యక్రాంతమైనా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
రూ.4 కోట్లు విలువైన 4 ఎకరాలు కబ్జా..
ఇరిగేషన్‌కు చెందిన భూములు నేటికీ ఆక్రమణదారుల కబంధ హస్తాల్లోనే ఉన్నాయి. పేరవరం పంపింగ్ స్కీమ్ సర్వే నెం.45/3లో సుమారు ఎకరం భూమి ఉంది. అయితే దీనిని వేరే వ్యక్తులు స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్నారు. లొల్ల లాకుల వద్ద సర్వే నెం.134లో సుమారు మూడు ఎకరాలు ఇరిగేషన్‌కు చెందిన భూములను సైతం కొంతమంది అక్రమించుకుని సాగు చేస్తున్నారు. వీటి విలువ రూ.4కోట్ల వరకు ఉంటుంది. కోట్ల విలువైన ఆస్తులు స్వాహా చేస్తున్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొబ్బర్లంక టవర్ లైన్ సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు చెంతనే ఓ రెవెన్యూ విశ్రాంత ఉద్యోగి కాల్వ గట్టును ఆక్రమించుకుని భవంతులు నిర్మించాడు. అలాగే కొంత స్థలాన్ని సాగు చేస్తున్నాడు. రావులపాలెం-ఊబలంక నుంచి ఆత్రేయపురం-బొబ్బర్లంక వరకు బ్యాంకు కెనాల్, మురుగు కాల్వలను పూడ్చి షాపింగ్ నిర్మాణాలను ఆక్రమణదారులు చేపట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ఆత్రేయపురం రేవు సెంటర్‌లో మురుగు డ్రెయిన్‌ను ఆక్రమించి షాపులు నిర్మించారు. దీంతో రైతులు సాగునీరు అందట్లేదంటూ పంట విరామం ప్రకటించినా అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఆక్రమణదారులకు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆత్రేయపురం రేవు సెంటర్లో ఉన్న ఇరిగేషన్ ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్సు నిర్మించేందుకు ఆక్రమణదారులు చర్యలు చేపడుతుండగా ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. సంబంధిత వ్యక్తులు షాపులు నిర్మించేందుకు పైరవీలు సాగిస్తున్నారు. ఈ సంఘటనపై ఇరిగేషన్ ఏఈ పిల్లా సత్యనారాయణను వివరణ కోరగా.... ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆక్రమణలపై కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు చేపడతామన్నారు. ఇరిగేషన్ భూముల అన్యాక్రాంతంపై సర్వే నిర్వహించి స్వాధీనం చేసుకుంటామన్నారు. నూతనంగా ఆక్రమణల్లో భవనాలు నిర్మిస్తే అడ్డుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాఖా పరమైన చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు చెంతనే ఉన్న ఆక్రమణలను తొలగించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వ ఆశయం నెరువుతుందని భక్తులు చెప్తున్నారు. ట్రాఫిక్‌పరమైన సమస్యలనూ నివారించవచ్చు.
Updated Date - 2022-12-04T00:53:38+05:30 IST