సూర్యగ్రహణం
ABN, First Publish Date - 2022-10-26T01:38:12+05:30
దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రం సూర్యగ్రహణం సమయంలోను తెరిచే ఉంది. గ్రహణాన్ని పురస్కరించుకుని అన్ని ఆలయాలను ఉదయమే మూసివేయగా పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, అష్టాదశ శక్తి పీఠాల్లో దశమ శక్తి పీఠమయిన పుర్హుతికాఅమ్మవారు, దత్తాత్రేయస్వామి ఆలయాలతోపాటు ఇతర ఉపాలయాలన్నీ తెరిచే ఉంచారు.
గ్రహణ సమయంలో తెరిచే ఉన్న పాదగయ క్షేత్రం
యథావిధిగా అభిషేకాలు, పూజలు
పాదగయ పుష్కరిణిలో పట్టువిడుపు స్నానాలు
రాష్ట్రంలో తెరిచే ఉండే రెండు ఆలయాల్లో ఇదొకటి
పిఠాపురంలో తెరిచే ఉన్న పాదగయ
పిఠాపురం, అక్టోబరు 25: దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రం సూర్యగ్రహణం సమయంలోను తెరిచే ఉంది. గ్రహణాన్ని పురస్కరించుకుని అన్ని ఆలయాలను ఉదయమే మూసివేయగా పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, అష్టాదశ శక్తి పీఠాల్లో దశమ శక్తి పీఠమయిన పుర్హుతికాఅమ్మవారు, దత్తాత్రేయస్వామి ఆలయాలతోపాటు ఇతర ఉపాలయాలన్నీ తెరిచే ఉంచారు. గ్రహణ సమయంలో కుక్కుటేశ్వరస్వామి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. వేదపండితులు, అర్చకులు జపాలు ఆచరించారు. పాదగయ పుష్కరిణిలో పట్టు విడుపు స్నానాలు ఆచరించి పూజలు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పురాతన కాలంనుంచి వస్తున్న ఆచార వ్యవహారాలకు అనుగుణంగా రాష్ట్రంలోని శ్రీకాళహస్తి, పిఠాపురంలోని పాదగయ క్షేత్రాలను మాత్రమే గ్రహణ సమయంలో తెరిచి ఉంచుతారని వేదపండితులు తెలిపారు. పూజా కైంకర్యాలు యథావిధిగా నిర్వహించామని చెప్పారు. ఏర్పాట్లను ఆలయ ఈవో సౌజన్య, ధర్మకర్తల మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు.
సామర్లకోట, అక్టోబరు 25: సూర్యగ్రహణం సందర్భంగా సామర్లకోట భీమే శ్వరాలయం మంగళవారం ఉదయం 10 గంటలకు మూసివేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వేదపండితులు వే మూరి సోమేశ్వరశర్మ, కొంతేటి జోగారావుశర్మ, రాంబాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 5.02 నిమిషాలనుంచి సాయంత్రం 6.27నిమిషాల వరకూ సూర్యగ్రహణ వేళలో ఆలయ తలుపులు మూసి ఉంచారు. బుధవారం తెల్లవారు జామున ఐదు గంటలకు ఆలయ పరిసరాలు పరిశుభ్రం చేసి మహాసంప్రోక్షణ పూజలు చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.నాగమల్లేశ్వరరావు తె లిపారు. స్వామివారికి, అమ్మవారికి పూజా కార్యక్రమాలు, దర్శనాలు యథావిధి గా జరపనున్నట్లు ఈవో నాగమల్లేశ్వరరావు తెలిపారు. బుధవారం రోజునుంచే ఆలయంలో కార్తీకమాసం ప్రారంభమవుతుందని ఈవో తెలిపారు.
సత్యదేవుడి ఆలయం మూసివేత
అన్నవరం, అక్టోబరు 25: సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం సత్యదేవుడి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం 8.30 వరకు వ్రతం టిక్కెట్లు విక్రయించి 11గంటల వరకు సర్వదర్శనాలకు అనుమతించారు. 11.05 నిమిషాలకు మహానివేదన పెట్టి ప్రధానార్చకులు కోట శ్రీను ఆధ్వర్యంలో అర్చకులు సుధీర్, ఆలయ విభాగ ఏఈవో సమక్షంలో ప్రధానాలయ తలుపులు మూసివేశారు. గ్రహణ పట్టు, విడుపుల సమయంలో గ్రహణస్నానం మూలవరులకు చేయించారు. బుధవారం వేకువజామున ఆలయ సంప్రోక్షణ తర్వాత సర్వదర్శనాలు, వ్రతాలను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Updated Date - 2022-10-26T01:38:15+05:30 IST