Pawan Kalyan: అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్‌కల్యాణ్
ABN, First Publish Date - 2022-12-18T16:18:58+05:30
మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు.
సత్తెనపల్లి: మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి, వైసీపీ నేతలవి ఉత్తర కుమార ప్రగల్భాలని ఎద్దేవాచేశారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటని దుయ్యబట్టారు. ఆయనది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని ధ్వజమెత్తారు. తనకు సినిమాలే ఆధారమని, అంబటిలాగా కాదన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదన్న వ్యక్తి మంత్రా? అని ప్రశ్నించారు. కాపు నేతలతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తానెలా తిరుగుతానో చూస్తామని వైసీపీ గాడిదలు ఓండ్రు పెడుతున్నాయని, బాధ్యత లేకుండా మాట్లాడే నేతలకు బలంగా సమాధానం చెబుతానని పవన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత తనదన్నారు.
అధికారం చూడని కులాలకి సాధికారత కావాలని పవన్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు తగ్గుముఖం పట్టాలని, జనసేన (Janasena) నేతలకిచ్చిన హెచ్చరికలనే వైసీపీ నేతలకు కూడా పోలీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014లాగే తాము కూటమిలా ఉంటే వైసీపీ గెలిచేది కాదని పవన్ గుర్తుచేశారు. బీసీలకు బిర్యానీలు పెట్టడం కాదు.. హాస్టళ్లలో పోషకాహారం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ఎదుగుతున్నారని విమర్శించారు. వైసీపీ (YCP) వ్యతిరేక ఓటును చీలనివ్వమని మరోసారి ప్రకటించారు. బీజేపీ, టీడీపీ (BJP TDP)కి అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ము నుంచి కమీషన్లు కొట్టే రకం కాదన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యల వల్లే రోడ్ల మీదకు వచ్చి పోరాడుతున్నామని పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
నేను సీఎం అవుతా: పవన్
‘‘మీ అందరి గుండె చప్పుడు బలంగా ఉంటే నేను సీఎం అవుతా. నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకోండి. ప్రభుత్వం మారకపోతే ఏపీ అంధకారంలోకి పోతుంది. మీ అందరూ కోరుకుంటే నేను సీఎం అవుతా. నా వ్యూహం అంతా ఏపీ భవిష్యత్తు కోసమే. నేను సొంతంగా రూ.30 కోట్లు ఇవ్వగలను. అధికారం ఇస్తే లక్షల కోట్లను ప్రజల కోసం ఖర్చు చేస్తా. ఎన్నికల వ్యూహం నాకు వదిలేయండి.. నన్ను నమ్మండి. నా వారాహిని ఆపండి.. నేనేంటో అప్పుడు చూపిస్తా. పల్నాడులో బెదిరించే నేతలను ఎదిరించే యువత ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని వెంటనే పెంచాలి. మన ప్రభుత్వంలో వయోపరిమితి పెంచుతాం. నన్ను పీకేస్తే మళ్లీ మొలుస్తా.. తొక్కేస్తే మళ్లీ లేస్తా’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Updated Date - 2022-12-18T16:19:19+05:30 IST