విద్యార్థులు.. వెతలు
ABN, First Publish Date - 2022-12-22T00:35:12+05:30
ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు.. ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం విద్యార్థులకు నరకం చూపింది. సీఎం సభలంటే సామాన్య జనానికి ఇబ్బందులు తప్పకపోవడం పరిపాటిగా మారింది. అయితే ఈ సారి అది విద్యార్థుల వంతైంది.
చుండూరు, భట్టిప్రోలు/బాపట్ల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలు.. ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం విద్యార్థులకు నరకం చూపింది. సీఎం సభలంటే సామాన్య జనానికి ఇబ్బందులు తప్పకపోవడం పరిపాటిగా మారింది. అయితే ఈ సారి అది విద్యార్థుల వంతైంది. బుధవారం చుండూరు మండలం యడ్లపల్లి జడ్పీ పాఠశాలలో జగన్ పుట్టినరోజు, ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. సభ జరిగే గ్రామానికి వెళ్లే రోడ్లు ఇరుకుగా ఉండడం, సభా ప్రాంగణం చిన్నదిగా ఉండడం, ప్రాంగణాన్ని మించి విద్యార్థులను తరలించడంతో వారి కష్టాలు చెప్పనలవి కాకుండా పోయాయి. మొత్తం మీద ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం ఆసాంతం విద్యార్థులను అగచాట్లకు గురి చేసింది. 300 బస్సుల్లో ఏడు, ఎనిమిది మండలాల నుంచి 8వ తరగతి విద్యార్థులను, తల్లిదండ్రులను, డ్వాక్రా గ్రూపు సభ్యులను, అంగన్‌వాడీ కార్యకర్తలను ఉదయం 6 గంటలకే ఆయా ప్రాంతాల నుంచి తరలించారు. ఎన్నో వ్యయప్రాసలకు ఓర్చి వచ్చిన వారి వాహనాలను దాదాపు మూడు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఆయా వాహనాలను నిలిపివేశారు. దీంతో చిన్నారులతో పాటు పెద్దలు అక్కడి నడిచి సభా ప్రాంగణానికి రావాల్సి వచ్చింది. ఆపాసోపాలు పడుతూ ఉరుకులు పరుగులతో అంత దూరం నడుచుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అంత దూరం నడిచి వచ్చినా కొంతమంది విద్యార్థులను ప్రాంగణంలోనికి అనుమతించలేదు. అమర్తలూరు మండలం ప్యాపర్రు జడ్పీ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు రెండుకిలోమీటర్ల నడిచి వచ్చినట్లు తెలిపారు. చుండూరు - వలివేరు రోడ్డులో 2 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు వాహనాలను నిలిపి వేయడంతో సభా ప్రాంగణానికి నడిచివెళ్లారు. ఉదయం 8 గంటల కల్లా విద్యార్థులు సభా ప్రాంగణానికి చేరుకుంటే మధ్యాహ్నం 2 గంటలకు సభ ముగిసింది. ఆ సమయంలో విద్యార్థులకు కనీసం భోజన వసతులు అధికారులు కల్పించలేదు. సభ ముగిసేసరికి మధ్యాహ్నం అవుతుందని తెలిసి కూడా అధికారులు విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతమంది ఆకలికి తాళలేక నీరసించి సృహతప్పి పడిపోయారు. విద్యార్థుల పరిస్థితి చూసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సభ ముగిసిన తర్వాత యధావిధిగా కిలోమీటర్ల కొద్దీ ఆకలితో నడుచుకుంటూ విద్యార్థులు బస్సులు ఎక్కి తిరుగు పయనం కావాల్సి వచ్చింది. సభకు విద్యార్థుల సేకరణపై చూపిన ఆసక్తి వారికి భోజన వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు చూపలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. చుండూరు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులను ఆటోల్లో తరలించారు. అయితే వారు సభకు వెళ్లకుండానే బయట కాలక్షేపం చేసి వెనుదిరిగారు. సభా ప్రాంగణం తక్కువగా ఉన్నా నాలుగు వేల మంది విద్యార్థులు, మరో నాలుగు వేల మంది తల్లిదండ్రులు, డ్వాక్రా, అంగన్‌వాడీలను పెద్ద ఎత్తున తరలించారు. కానీ, అక్కడ సరైన వసతులు లేకపోవడంతో చాలామంది సభకు వెళ్లకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. కొంతమంది విద్యార్థులు, వృద్ధులు, ప్రజలు జగన్ ప్రసంగం ప్రారంభం కాగానే అక్కడ నుంచి జారుకోవడం కనబడింది. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు తననెందుకు బయటకు పంపించరని పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది. ఇక హెలిప్యాడ్ వద్ద జగన్ చూసేందుకు వచ్చిన అభిమానులు కూడా ఇబ్బందులు పడ్డారు. అక్కడకు చేరుకున్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పోలీసుల ఆంక్షలతో అసహనం వ్యక్తం చేశారు. పనులు మానుకుని వచ్చామని, కనీసం చూడనీయకుండా చేశారని పోలీసుల తీరుపై కొందరు మహిళా కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు గంటల్లో ముగిసిన కార్యక్రమం..
వారం నుంచి అధికారుల హడావుడి.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు.. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల నడక.. ఇరుకైన సభా ప్రాంగణంలో అవస్థల మధ్య బుధవారం ముఖ్యమంత్రి కార్యక్రమం జరిగింది. ఉదయం 10:52 గంటలకు ముఖ్యమంత్రి జగన్ యడ్లపల్లిలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులతో సమావేశం తర్వాత జడ్పీ హైస్కూల్‌కు చేరుకున్నారు. అక్కడ స్టాల్స్‌ను సందర్శించిన అనంతరం 11:28 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2:10 గంటలకు హెలిప్యాడ్ నుంచి జగన్ తిరుగుపయనమయ్యారు. ఐలవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని సాయినాగశ్రీ విద్యారంగంలో జగన్ తీసుకువచ్చిన మార్పులపై ఆంగ్లంలో ప్రసంగించింది. తెనాలి మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన సాత్విక తెలుగులో మాట్లాడుతూ జగన్ ప్రవేశపెట్టిన వివిధ పథకాలను కీర్తించింది. కార్యక్రమంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు కరణం బలరాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, మాధవరావు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఇన్‌చార్జిలు బాచిన కృష్ణచైతన్య, రావి రామనాఽథంబాబు, కరణం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
వేదికపైన అంటీముట్టనట్లుగా నేతలు
చీరాల వైసీపీలో ఉన్న విభేదాలు ముఖ్యమంత్రి సభసాక్షిగా కూడా బహిర్గతమయ్యాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వేదికపైకి వచ్చి రెండో వరుసలో కూర్చున్నారు. తర్వాత కొద్దిసేపటికే ఎమ్మెల్యే బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ వేదికపైకి వచ్చారు. వీరు ఎడమొహం, పెడ మొహంగా వ్యవహరించారే తప్ప కనీసం అభివాదం కూడా చేసుకోలేదు. దీంతో సభ సాక్షిగా చీరాలలో ఉన్న కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి.
చదువుతోనే తలరాతల మార్పు
ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విప్లవం
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
‘నేటికీ సమాజంలో అంతరాలు ఉన్నాయి. అవి తొలగిపోవాలంటే విద్యతోనే సాధ్యం. తలరాతలు మారాలంటే చదువు అనే ఒక ఒక్క ఆస్తి ద్వారానే సాధ్యం..’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం చుండూరు మండలం యడ్లపల్లిలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఓదార్పుయాత్ర నుంచి పాదయాత్ర వరకు తాను చేసిన రాజకీయ ప్రయాణంలో విద్యార్థుల తల్లిదండ్రుల పడుతున్న బాధలు చూశానన్నారు. సమాజంలో కొందరు 21వ శతాబ్దంలో ఉంటే మరికొందరు ఇంకా 19వ శతాబ్దంలోనే బతికే పరిస్థితి ఉందన్నారు. వీరి బతుకు మార్చలేమా అన్న ప్రశ్నలే తన ప్రతి అడుగులో కనిపిస్తాయన్నారు. పలకల నుంచి ట్యాబుల దిశగా పిల్లల ప్రయాణం సాగిందన్నారు. ప్రస్తుతం అందించే ట్యాబ్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పనిచేస్తాయన్నారు. నాడునేడు అమలయ్యే కొద్దీ 6 వతరగతి నుంచి ప్లస్ టూ వరకు ఐఎఫ్‌పీ(ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్)లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచే డిజిటల్ క్లాస్‌రూంలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానం జగన్మోహనరెడ్డిదన్నారు. మనిషిని మహాత్మునిగా తీర్చిదిద్దాలంటే చదువు ఒక్కటే మార్గమని జ్యోతిరావుపూలే చెప్పారన్నారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమానికి జిల్లాను వేదిక చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సీఎంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
బాపట్లకు వరాల జల్లు..
- కృష్ణానది మీద ఓలేరు - తూర్పుపాలెం గ్రామాలు, భట్టిప్రోలు మండలంలో 4.96 టీఎంసీల సామర్థ్యంతో రూ.2,500 కోట్లతో బ్యారేజీ నిర్మాణ పనులకు ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెడతాం.
- జంపని షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా.
- రూ.17.6 కోట్లతో పీఎంజీఎస్‌వై కింద రోడ్ల నిర్మాణం చేపడతాం.
కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని పది లంక గ్రామాల్లో 1811 ఎకరాలు సాగు చేసుకుంటున్న 3749 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేస్తాం.
- ఏవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల ఏర్పాటుకు ఆమోదం.
================================================================
Updated Date - 2022-12-22T00:35:23+05:30 IST