ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ జిల్లాలో అరడజను మంది ఎంపీలు.. ఎప్పుడూ నోరెత్తరంతే..!

ABN, First Publish Date - 2022-09-27T04:29:31+05:30

ఏపీఆర్, వీపీఆర్, వీఎస్ఆర్, ఎంఎస్ఆర్, బీఎంఆర్, ఎంజీఎం... ఏంటీ షార్ట్‌ కట్స్‌ అనుకుంటున్నారా?... వీరంతా ఉమ్మడి నెల్లూరు (Nellore) జిల్లా ఎంపీలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Andhrapradesh: ఏపీఆర్, వీపీఆర్, వీఎస్ఆర్, ఎంఎస్ఆర్, బీఎంఆర్, ఎంజీఎం... ఏంటీ షార్ట్‌ కట్స్‌ అనుకుంటున్నారా?... వీరంతా ఉమ్మడి నెల్లూరు (Nellore) జిల్లా ఎంపీలు. ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా మూడున్నరేళ్లగా ఎంపీలుగా కొనసాగుతున్నవారే. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శ్రీకాళహస్తి-నడికుడి రైల్వేలైన్‌, బిట్రగుంట రైల్వే పరిశ్రమ, కోస్టల్ కారిడార్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, దుగ్గరాజుపట్నం సీ పోర్టు... ఇలా ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. అయితే.. అరడజను మంది ఎంపీలు ఉన్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా పార్లమెంట్‌లో ఏ సమస్య గురించీ నోరుమెదపక పోవడం చర్చనీయాంశంగా మారుతోంది.


ఇక.. ముందుగా.. ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి (Mp Adala PrabhakarReddy) గురించి ఓ సారి పరిశీలిస్తే.. పార్లమెంట్‌లో తన ఉనికిని కాపాడుకోవడానికో, ఫోటోలు, వీడియోలు కోసమో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాల ఆలోచన ఉందా?... పులుల మరణాల తగ్గింపుకి ఏం చర్యలు తీసుకుంటున్నారు?.. సాగరమాల పథకానికి కేటాయించిన నిధులు ఎన్ని?.. జగనన్న విద్యా దీవెన వంటివి కేంద్రం అమలు చేస్తుందా?.. ఇలా నెల్లూరుకు సంబంధించి ఏ ఒక్క ప్రశ్న అడిగిన పాపాన పోలేద. ఆదాల ప్రశ్నలు గమనించిన నెల్లూరు ప్రజలు.. వారిలో వారే సెటైర్లు చేసుకుంటున్నారట. అప్పట్లో.. జగన్‌.. వైసీపీ ఎంపీలందర్నీ గెలిపించండి.. కేంద్రం మెడలు వంచుతాం.. ప్రత్యేక హోదా ఎందుకివ్వరో తేల్చుకుంటాం.. అంటూ పాదయాత్రలో ఏవేవో ఊకదంపుడు ఉపన్యాసాలు ఊదరకొట్టారు. కానీ.. వైసీపీ ఎంపీలకేమో ఆ ఊసే లేకుండా పోయిందని నెల్లూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు నెల్లూరు జిల్లా వైసీపీ (Ycp)కి పెద్ద దిక్కు. జగన్ తర్వాత.. జగన్ అంతటోడని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురించి చెప్పుకుంటూ ఉంటారు. వేమిరెడ్డికి రాజ్యసభ, ఆయన శ్రీమతికి టీటీడీ ఉన్నత పదవులు ఇచ్చారు. ఈ మధ్యనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కూడా కట్టబెట్టారు. అయితే వేమిరెడ్డి మాత్రం.. ఇప్పటివరకు రాజ్యసభలో నోరుమెదిపిన చరిత్రే లేదు. నెల్లూరు సమస్యలపై ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రశ్నించడం చూడలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. 


ఇక ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి (VijaySaireddy)ది కూడా నెల్లూరు జిల్లానే. నెల్లూరుకి కూతవేటు దూరంలో ఉన్న తాళ్లపూడి గ్రామం సొంతూరు. వైఎస్ హయాంలో చక్రం తిప్పినా జగన్ ప్రభుత్వంలో స్టీరింగ్‌ తిప్పుతున్నా సొంత ఊరికి చేసిందేమీ లేదట. దీంతో విజయసాయిరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఎప్పుడూ సొంతూరి మొఖం చూడని ఆయన.. మొన్నా మధ్య హడావుడిగా వెళ్లారట. 13.5కోట్లతో 73 పనులకు వడివడిగా శంకుస్థాపనలు చేసేశారట. అంతే మళ్లీ ఊళ్లోకి అడుగుపెట్టలేదట. ఆ 73 పనుల్లో కనీసం ఒక్క పని కూడా పూర్తికాలేదట. సగం రోడ్డు, సగం కాలువ నిర్మించి వదిలేశారంట. ఇక పార్లమెంట్‌లో ప్రశ్నలంటారా.. సరేసరి.. ఊరికే చిన్నమెత్తు ఉపకారం చేయనోడు జిల్లాకేమి చేస్తాడు.. రాష్ట్రానికి ఏమి చేస్తాడంటూ సొంత పార్టీ నేతలే సణుగుతున్నారట.


ఇదిలావుంటే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిది కూడా నెల్లూరే. ఇప్పటికి అయిదుసార్లు ఎంపీ అయినా ఏ ఒక్కసారీ నెల్లూరు జిల్లా సమస్యల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించిన దాఖలాలు లేవు. మొన్నీ మధ్య మధ్యంతర ఎన్నికల్లో జగన్ వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి.. తిరుపతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయన పరిధిలో ఉన్నాయి. అయితే గురుమూర్తి గెలిచి ఇన్నాళ్లు అయినా ఇప్పటివరకు ఆయనకు ప్రజా సమస్యల గురించి అవగాహనే లేదట. ఇటీవల విజయసాయిరెడ్డి క్లోజ్ ఫ్రెండ్ బీద మస్తాన్‌రావు కూడా రాజ్యసభ సభ్యుడయ్యారు. అయితే ఆ ముందోళ్లంతా కేంద్రాన్ని కడిగేసి మెడలు వంచారు.. ఇప్పుడు వీరొచ్చి కేంద్రాన్ని వణికిస్తారా? అంటూ గురుమూర్తి, బీఎంఆర్‌పై నెల్లూరీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారట.


వాస్తవానికి సీఎంగా ఎవరున్నా పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీలందరితోనూ సమావేశమవుతారు. రాష్ట్రానికి‌ సంబంధించి ఏ ప్రశ్నలు సంధించాలి?, కేంద్రం నుంచి ఏం సాధించాలనే అంశాలపై చర్చిస్తారు. అయితే ఇప్పటివరకు సీఎం జగన్ ఒక్కసారి కూడా ఎంపీలందరితో సమావేశం నిర్వహించిందే లేదు. కొందరు ఎంపీలకు కనీసం కాల్ షీట్లు కూడా దొరకడం లేదట. అనుమతి లేనిదే, ఏమీ మాట్లాడకూడదు. ఎక్కడికీ వెళ్లకూడదనే ఆంక్షలూ ఉన్నాయట. సొంత జిల్లాలోని నియోజకవర్గాల్లోనూ ఎక్కడంటే అక్కడ స్చేచ్చగా తిరిగేది లేదట. ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాలనే షరతు ఉండటంతో చాలా మంది జనంలోకి వెళ్లడమే మానేశారని, మౌన మునులుగా మారారని టాక్. అదేమని ఎవరైనా ఏదైనా అడిగితే తమ బాధలు తమవి అంటున్నారట. అంతేకాదు తాము ఏపీలో వైసీపీ ఎంపీలం అయితే ఏపీ దాటి తర్వాత బీజేపీ ఎంపీలమని చెప్పుకోవాల్సి‌ వస్తుందని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. నిజానికి ఒకప్పుడు ఎంపీ అంటే ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో ఆ గౌరవం, ఆ హోదా, ఆ దర్పమే వేరు. కానీ వైసీపీ ఎంపీలకు ఇప్పుడా పరిస్థితే కరువైందట. 


ఇదిలావుంటే.. తెలుగు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్‌టాపిక్ అయ్యారు. సినిమాల్లో నటించినప్పుడు అంతగా పట్టించుకోని వారు కూడా, ప్రస్తుతం ఆమె గురించే చర్చిస్తున్నారు. ఏ రాష్ట్రం వారైతేనేమి? పార్లమెంట్‌లో తెలుగు ఎంత చక్కగా మాట్లాడింది.. కనీసం తెలుగు ప్రజలు, తెలుగు బాష, తెలుగు ప్రాంతాలపై ఆమెకున్న అభిమానం కూడా.. మన ఎంపీల్లో కనిపించడం లేదు.. మహిళ అయితేనేమి.. వైసీపీ ఎంపీలకంటే చాలా బెటర్‌ అంటూ తెగ చర్చిస్తున్నారట. ఇక.. అభివృద్ధి విషయంలోనూ నెల్లూరు ఎంపీల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉందట. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి నెల్లూరు జిల్లాకు మిథానీ కంపెనీని తెచ్చారు. వందల కోట్లతో మిథానీ అల్యుమినియం ఫ్యాక్టరీ ఏర్పాటైతే చాలా మంది బతుకులు మారుతాయని భావించారు. రేగడిచెలిక ప్రాంతంలో మిథానీ కంపెనీ శంకుస్థాపన స్థాయి వరకు‌ వచ్చింది. కానీ.. వెంకయ్య వస్తే, తాను రానని సీఎం జగన్ అన్నారట. ఇంకేముంది.. జగన్‌రెడ్డి అహంకారంతో వచ్చిన పరిశ్రమ కాస్తా.. పోయిందని ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల్లో‌ తీరని బాధ వ్యక్తమవుతూనే ఉందట.


మొత్తంగా ఎంపీ పదవంటే పార్లమెంట్‌లో సమస్యలు ప్రశ్నించేందుకో, హక్కులు సాధించేందుకో కాదు.. హోదా, వ్యాపార లావాదేవీలు చక్కదిద్దుకోవడం, వ్యక్తిగత, పార్టీ పనులు‌ చేయించుకోవడానికే అన్నట్టు వైసీపీ ఎంపీలు‌ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ ఎంపీల పరిస్థితి చూస్తుంటే అంతేగా అంతేగా అనక తప్పదు మరి!



Updated Date - 2022-09-27T04:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising