Heavy rain: బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్ష సూచన
ABN, First Publish Date - 2022-11-20T19:58:49+05:30
దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో ఆదివారం ఉదయం బలపడి వాయుగండంగా మారింది.
విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో ఆదివారం ఉదయం బలపడి వాయుగండంగా మారింది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ మధ్యాహ్ననికి చెన్నైకు 630 కి.మీ. ఆగ్నేయంగా, శ్రీలంక (Sri Lanka)లోని జాఫ్నాకు 580 కి.మీ. తూర్పున కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ మంగళవారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడులో అక్కడక్కడా వర్షాలు కురవగా ఉత్తరకోస్తా, రాయలసీమ (Rayalaseema)లో అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించాయి.
సోమవారం దక్షిణ కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాతీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ.లు, అప్పుడప్పుడు 65 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తున్నందున సోమ, మంగళ, బుధవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడ రేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేయగా కళింగపట్నం, భీమునిపట్నం రేవులను అప్రమత్తం చేశారు.
Updated Date - 2022-11-20T19:58:50+05:30 IST