ఆత్మతో ఆదాయపు పన్ను కట్టించిన అధికారులు.. లబోదిబోమంటున్న బాధితులు.. అసలు ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2022-12-25T19:23:52+05:30
సామాజిక పెన్షన్ ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనడానికి ఇదో నిదర్శనం. ఏకంగా ఆత్మతోనే ఆదాయపు పన్ను కట్టించారు.
అనంతపురం: సామాజిక పెన్షన్ ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనడానికి ఇదో నిదర్శనం. ఏకంగా ఆత్మతోనే ఆదాయపు పన్ను కట్టించారు. 25 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి ఇప్పుడు ఆదాయపు పన్ను కట్టాడని చూపుతూ ఆ కుటుంబంలోని వితంతువుకు పెన్షన్ నిలిపేశారు. వినడానికి విడ్డూరంగా, వింతగా ఉన్నా.. ఇది నిజంగా నిజం. అనంతపురం జిల్లా (Anantapur District) విడపనకల్లు మండల కేంద్రానికి చెందిన తాతప్పగారి బోయ శాంతివీరన్న పాతికేళ్ల క్రితం మృతిచెందాడు. అతడి కుమారుడు మోహన్ ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో అతడి భార్య లక్ష్మీదేవి, ముగ్గురు పిల్లలు వీధిన పడ్డారు. ఆమెకు టీడీపీ (TDP) హయాంలో వితంతు పెన్షన్ (ఐడీ నెంబరు 112779354) మంజూరు చేశారు. అప్పట్నుంచి ఆమె పెన్షన్ (Pension) తీసుకుంటోంది.
తాజాగా పెన్షన్ ఏరివేతకు వైసీపీ ప్రభుత్వం (YCP Govt) శ్రీకారం చుట్టింది. లక్ష్మీదేవి.. టీడీపీ మద్దతుదారురాలు కావడంతో ఆమె పెన్షన్ ఎలాగైనా తొలగించాలని గ్రామ వలంటీర్, వైసీపీ నాయకులు పన్నాగం పన్నారు. అందుకు కారణమేమీ దొరకలేదు. దీంతో దొడ్డిదారి వెతికారు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మరణించిన శాంతి వీరన్న ఇప్పుడు ఆదాయపు పన్ను చెల్లించాడని చూపుతూ లక్ష్మీదేవి పెన్షన్ నిలిపేశారు. శాంతివీరన్న చనిపోయిన సమయానికి అప్పట్లో ఆధార్ కార్డే లేదు. రేషన్ కార్డు కూడా లేదు. మరి అతడు ఎలా ఆదాయపు పన్ను కట్టాడో, ఎలా కట్టించారో అంతుచిక్కని విషయం. పోనీ, కట్టాడనుకుంటే.. లక్ష్మీదేవి రేషన్ కార్డులో అతడి పేరు కూడా లేదు. ఆ కార్డుకు మ్యాపింగ్ ఎలా చేయగలిగారు? ఇప్పుడు ఆ కుటుంబంలోకి శాంతివీరన్న ఆత్మను ఎలా చేర్చగలిగారో మరి..
ఈ ప్రశ్నలను బాధిత లక్ష్మీదేవి.. ఎంపీడీఓ శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీరును అడిగింది. ఆన్‌లైన్ తప్పిదం వల్ల అలా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి, పంపించారు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్న లక్ష్మీదేవి పెన్షనను అన్యాయంగా నిలిపేయడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కూలికెళ్తేగానీ ఇల్లు గడవదనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఆసరాగా ఉన్నపెన్షనను తొలగిస్తే ఎలా బతకాలని కన్నీటి పర్యంతమవుతోంది.
Updated Date - 2022-12-25T19:25:04+05:30 IST