తెల్లారిన బతుకులు
ABN, First Publish Date - 2022-11-19T00:53:33+05:30
గొల్లపూడిలోని మహాత్మాగాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం వేకువజామున టిప్పర్ ఢీకొని ఇద్దరు ముఠా కార్మికులు మృతిచెందారు.
విద్యాధరపురం, నవంబరు 18 : గొల్లపూడిలోని మహాత్మాగాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం వేకువజామున టిప్పర్ ఢీకొని ఇద్దరు ముఠా కార్మికులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు భవానీపురానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు (48), వైఎస్సార్ కాలనీకి చెందిన మోకర నీలకంఠం (52) గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లోని గరుడ ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తుంటారు. తమతో పాటు నలుగురు ముఠా కార్మికులతో కలిసి రాత్రివేళల్లో విధులు నిర్వహిస్తారు. వీరంతా గురువారం రాత్రి 7 గంటలకు పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని వేకువజామున 2.20 గంటలకు ఇళ్లకు బయల్దేరారు. ఈ క్రమంలో బైపాస్ రోడ్డులో డివైడర్ దాటుతుండగా, సితార సెంటర్ నుంచి గొల్లపూడి వైపునకు వస్తున్న ఏపీ 39 టీజెడ్ 9488 నెంబరు కలిగిన టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా, హారన్ కొట్టకుండా దూసుకుంటూ వచ్చాడు. బైకుపై ఉన్న నీలకంఠం, వెంకటేశ్వర్లును ఢీకొట్టాడు. ఆ సమయంలో బైక్ నడుపుతున్న నీలకంఠం ఎగిరి కింద పడటంతో తల, ఇతర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాలు విరిగి తీవ్రగాయామైన వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలిస్తుండగా, మరణించాడు. ప్రత్యక్ష సాక్షి తాడేపల్లికి చెందిన ముఠామేస్త్రి తుమ్మా మోజస్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - 2022-11-19T00:53:34+05:30 IST