Yanamala: సీఎం చెబుతున్న అబద్ధాలకు, చేస్తున్న అప్పులకు అంతే లేదు..
ABN, First Publish Date - 2022-10-30T11:03:47+05:30
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెబుతున్న అబద్ధాలకు, చేస్తున్న అప్పులకు అంతే లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan) చెబుతున్న అబద్ధాలకు, చేస్తున్న అప్పులకు అంతే లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ప్రగతిపథంలో నడిపిన నవ్యాంధ్రను జగన్ రెడ్డి సర్వనాశనం చేశారని, అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రజల మధ్య కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టారని, ఏపీ జీవనాడి పోలవరాన్ని నిలిపేయడం జగన్ దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. రైతులకు ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేశారని, గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ, పావలా వడ్డీ, పంట రుణాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ హయాంలో సున్నా వడ్డీ కింద రాయితీ రూ.2 వేల కోట్లు మేర ఇస్తే దానిని జగన్ ప్రభుత్వం రూ. 487 కోట్లకు కోత కోసిందని యనమల విమర్శించారు. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే స్ప్రేయర్లు, డ్రిప్ ఇరిగేషన్, పవర్ టిల్లర్లు, యంత్ర పరికరాల సరఫరాను నిలిపేశారన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యం కూడా చేయడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్‌లు కూడా దొరకని దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. 26 జిల్లాల అభివృద్ధికి ఉపయోగపడే అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని, విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు అమ్మేయడం, ప్రజల భూములు లాక్కోవడమే ఉత్తరాంధ్రకు చేసిన మేలా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
Updated Date - 2022-10-30T11:03:51+05:30 IST