అటో ఇటో ఎటోవైపు
ABN, First Publish Date - 2022-11-24T00:34:00+05:30
ఓవైపు అధినేత జగన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 గెలవాలన్న లక్ష్యంతో ‘వై నాట్ 175’ అంటుంటే, ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రం పోరాటమా.. అస్త్ర సన్యాసమా.. అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడిచిపోయింది. ఏడాదిలో ఎన్నికలు రానున్న తరుణంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఓటమి భయం వెంటాడుతోంది. కొందరు సిట్టింగ్ స్థానాలను వదిలి కొత్త స్థానాలను వెతుక్కుంటుండగా, మరికొందరు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇక ఎన్నికల బరిలో నిలవబోనని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. - (విజయవాడ, ఆంధ్రజ్యోతి)
మైలవరంవైపు చూస్తున్న జోగి రమేశ్
పామర్రు షిఫ్ట్ అవుదామని రక్షణనిధి యోచన
పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో కొందరు
పార్టీ మారే యోచనలో ఇంకొందరు
పెడన టూ మైలవరం
సాక్షాత్తూ మంత్రిగా ఉన్న జోగి రమేశ్‌కే సిట్టింగ్ స్థానంలో గెలుస్తానన్న ధీమా లేకుండా పోయింది. దీంతో ఆయన మైలవరం నుంచి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. 2014లో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా చేతిలో సుమారు 7,500 ఓట్ల తేడాతో జోగి రమేశ్ ఓడిపోయారు. 2019లో పెడన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి అయినప్పటి నుంచి ఆయన తన జోరు పెంచారు. కృష్ణాజిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంపై ఆయన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. చిన్నచిన్న కార్యక్రమాలకూ జోగి రమేశ్ హాజరవుతున్నారు. ఆయన హాజరయ్యే కార్యక్రమాలకు ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు. మరోవైపు మైలవరం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఇసుక, బూడిద ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని, అందులో తమకు ఎలాంటి వాటాలు ఇవ్వడం లేదన్న అసంతృప్తిలో ఆయన వర్గం ఉంది. జోగి రమేశ్ తమ్ముడికి కొండపల్లి మున్సిపాలిటీ పీఠం దక్కకుండా చేయడంలో ఎమ్మెల్యే కీలకంగా వ్యవహరించారన్న ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలో మైలవరం నుంచి వసంతను సాగనంపి అక్కడి నుంచి బరిలోకి దిగాలన్న యోచనలో జోగి రమేశ్ ఉన్నారు. ఇదే ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో వసంత, జోగి వర్గాల నడుమ మంటలు పుట్టిస్తోంది.
వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలతో ఉలికిపాటు
మైలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇటీవల ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి జోగి రమేశ్ తమ్ముడు జోగి రామును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర దుమారం రేపాయి. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని జోగి రాముకి ఇవ్వడం కుదరదని, ఇక్కడ గౌడ సామాజికవర్గానికి 350 ఓట్లే ఉన్నాయని గతంలో వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన తండ్రి నాగేశ్వరరావు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును తప్పుబట్టారు. మంత్రివర్గంలో కమ్మ సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు జోగి రమేశ్ వర్గానికి కలిసొచ్చాయి. వీటిని బూచిగా చూపి వసంత పార్టీ మారుతున్నారంటూ సామాజిక మీడియాల్లో ప్రచారం చేస్తున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా బుధవారం వసంత కృష్ణప్రసాద్.. సజ్జలను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో ఉన్న చికాకులను సజ్జలకు వివరించానని చెప్పారు. తన తండ్రి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. త్వరలోనే సీఎంను కలిసి అన్ని విషయాలు వివరిస్తానన్నారు.
తిరువూరు టూ పామర్రు
తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి సొంత పార్టీ నుంచే తీవ్రస్థాయిలో అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ఈయన ఈసారి పామర్రు నుంచి రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రక్షణనిధి స్వగ్రామం పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం. ఈ గ్రామ సర్పంచిగానే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత పమిడిముక్కల జడ్పీటీసీగా చేశారు. దీంతో పామర్రుపై ఆయనకు మంచి పట్టు ఉంది. 2014, 2019ల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రక్షణనిధి వరుసగా మూడోసారి అక్కడి నుంచి గెలవడం కష్టమని భావిస్తున్నారు. ఓవైపు సొంత పార్టీ నాయకులు సహకరించకపోవడం, మరోవైపు ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఆయన పామర్రు నుంచి పోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.
జంపింగ్ రాజాలు..
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిలో ఒకరికి నియోజకవర్గంలో ఇంటిపోరు ఎక్కువ కావడమే కారణంగా ఉండగా, మరొకరికి పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదన్న అసంతృప్తి, ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా చెబుతున్నారు. మరో జంపింగ్ ఎమ్మెల్యే సైతం సొంతగూటికి చేరాలని తహతహలాడుతున్నట్లు సమాచారం. వీరేకాకుండా మరో ఎమ్మెల్యే సైతం ‘పొత్తు’లను బట్టి వైసీపీని వీడే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జనసేన, టీడీపీ కలిస్తే సదరు ఎమ్మెల్యే వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేన కండువా కప్పుకోవాలని భావిస్తున్నారు. మరో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసలు పోటీ చేయాలా, వద్దా అన్న మీమాంసంలో ఉన్నట్లు చెబుతున్నారు. మల్లాది విష్ణు పోటీ చేయబోనని సన్నిహి తుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణం గానే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఔత్సాహికులు ఇప్పటి నుంచే పోటీలు పడుతున్నారని సమాచారం. కృష్ణాజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సైతం పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.
Updated Date - 2022-11-24T00:34:01+05:30 IST