పేరుకే రైతు బజార్లు
ABN, First Publish Date - 2022-11-25T00:39:11+05:30
అటు రైతులకు...ఇటు కొనుగోలుదారులకు ఏక కాలంలో మేలు చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రైతు బజార్లు ప్రస్తుతం దళారుల చేతికి వెళ్లాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తూకం దళారుల వైపే
ఏళ్ల తరబడి రెన్యువల్ కాని లైసెన్స్‌లు
తక్కువ తూకాలతో వినియోగదారుల మండిపాటు
షాపులు, హోటళ్ల కేటాయింపుల్లో చేతివాటం
అటు రైతులకు...ఇటు కొనుగోలుదారులకు ఏక కాలంలో మేలు చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రైతు బజార్లు ప్రస్తుతం దళారుల చేతికి వెళ్లాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించడానికి... రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి రైతుబజార్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు రైతులకంటే దళారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. లైసెన్స్‌లు రెన్యువల్ చేయకుండా ఏళ్ల తరబడి దళారులు వ్యాపారం చేస్తున్నారు.
-కర్నూలు(అగ్రికల్చర్)
కర్నూలు సీ క్యాంపు రైతుబజార్‌లో ఒకరిద్దరు రైతులు కనిపిస్తున్నారు. అమీన్‌అబ్బాస్ నగర్, కొత్తపేట రైతుబజార్లలో ఒక్కరు కూడా లేరు. వ్యాపారులే పూర్తిగా తిష్టవేస్తున్నారు. రైతులకు గుర్తింపు కార్డుల జారీలో అవకతవకలు జరుగుతున్నాయి. దళారులే ప్రతిరోజూ తెల్లవారుజామున కర్నూలు మార్కెట్ యార్డులో హోల్‌సేల్ ధరకు కూరగాయలు కొని వాటిని రైతుబజార్లకు తీసుకెళ్లి రెట్టింపు ధరకు అమ్ముకుంటున్నారు. ఈ రైతుబజార్లలో ఒక్క కాటా కూడా సరిగ్గా లేదని, బోర్డుపై నమోదు చేసిన ధరలకు కూరగాయలు విక్రయించడం లేదని తేలిపోయింది. షాపులు, హోటళ్ల కేటాయింపులో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు, ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలను అందించేందుకని ప్రభుత్వం జిల్లాలో రూ.2 కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన రైతుబజార్లు ప్రస్తుతం అధికారులకు జేబులు నింపే మార్గాలుగా మారాయి. ప్రభుత్వ లక్ష్యం గాలికిపోయింది. రూ. కోట్ల నిధులు ఖర్చు తప్ప రైతులకు, వినియోగదారులకు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లాలో కర్నూలు నగరంలోని సి.క్యాంప్, కొత్తపేట, అమీన్ అబ్బాస్‌నగర్, నంద్యాల, ఆదోని రైతుబజార్లలో తనిఖీలు జరిగాయి. వీరి తనిఖీల్లో అడుగడుగునా అక్రమాలు వెలుగు చూశాయి. కొత్తపేట, అమీన్‌అబ్బాస్‌నగర్ రైతుబజార్లలో రైతులే లేరు. బోగస్ వివరాలతో వ్యాపారులే రైతులుగా అవతారమెత్తినట్లు ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో వెలుగు చూడడం గమనార్హం.
కేటాయింపులో గోల్‌మాల్
జిల్లాలో రైతుబజార్ల మీద ఏడీఎం పర్యవేక్షణ ఉంది. సీ క్యాంప్ రైతుబజార్‌తో పాటు, అమీన్‌అబ్బాస్ నగర్, కొత్తపేట, నంద్యాల, ఆదోని రైతుబజార్లలో షాపులు, హోటళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగు తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. షాపులు అద్దెకు తీసుకున్న వారు వ్యాపారం చేయకుండా ఇతరుల నుంచి రెట్టింపు అద్దె తీసుకొని వారికి అప్పగించినట్లు ఫిర్యాదులు అందాయి. కొన్ని రైతు బజార్లలో షాపులను అక్కడ పని చేస్తున్న సిబ్బందే బినామీ పేర్లతో దక్కించుకుని ఇతరులకు అధిక అద్దెకు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తప్పుడు వివరాలతో రైతు కార్డులు
సి.క్యాంప్ రైతుబజార్‌లో 1433 మంది రైతులు, 26 మంది పొదుపు మహిళలు కూరగాయలు విక్రయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తపేట రైతుబజార్‌లో 26 మంది, అమీన్‌అబ్బాస్‌నగర్‌లో 22 మంది రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారని, నంద్యాలలో 24 మంది, ఆదోనిలో 20 మంది రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారని అధికారులు అంటున్నారు. ఈ రైతుబజార్లలో ప్రతి రోజూ 1000 క్వింటాళ్ల కూరగాయలను 16 వేల మంది రైతులు కొనుగోలు చేస్తున్నారని కమిషనర్‌కు ప్రతిరోజూ నివేదికలు పంపిస్తున్నారు. ఇటీవల విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఈ రైతు బజార్లలో పది నుంచి 20 మంది రైతులు మాత్రమే గుర్తింపుకార్డులు తెచ్చుకున్నారు. మిగిలిన వారంతా మర్చిపోయి వచ్చామని తప్పించుకున్నారు. వారికి అధికారులు వంత పాడారు. పొదుపులక్ష్మి మహిళలు కొన్ని సంవత్సరాలైనా గుర్తింపు కార్డులు రెన్యువల్ చేయించుకోలేదు. కొన్ని రైతుబజార్లలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల సిఫారసుతోనే ఇతరులకు కూరగాయలు అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చినట్లు ఎస్టేట్ అధికారులు చెబుతున్నారు. వీరి నుంచి పొదుపులక్ష్మి గ్రూపు మహిళలతోపాటు రోజూ అద్దె వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివరాలను రికార్డులో నమోదు చేయకపోవడంతో ప్రతి రోజూ వేల రూపాయలు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళ్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గృహ మిత్ర కౌంటర్లూ పరాధీనం
రైతు బజార్లల్లో కూరగాయలే కాకుండా నిత్యావసర వస్తువులు బియ్యం, కంది బేడలు, తదితర కిరాణ వస్తువులను కూడా తక్కువ ధరకే నాణ్యమైనవి వినియోగదారులకు అందించేందుకు గృహమిత్ర పేరుతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డబ్బు బలం ఉన్న వ్యక్తులు మార్కెటింగ్ శాఖ అధికారులను మేనేజ్ చేసుకొని కిరాణ షాపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. చౌక దుకాణాలు నిర్వహిస్తున్న డీలర్లకు రైతుబజార్లలో కిరాణ అంగళ్లను కేటాయిస్తే వాళ్లు సొంతంగా వ్యాపారం చేయకుండా నెలకు రూ.10 వేల నుంచి రూ. 20 వేల అద్దె తీసుకొని వేరే వారికి కట్టబెట్టారు. పైగా డీలర్లు మిగిల్చుకున్న బియ్యం, తదితర వస్తువులను ఇక్కడ దుకాణాల్లో విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రైతుబజార్లలో బినామీలు చొరబడటం, తూకాలు తక్కువ వంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నా అధికారులు తనిఖీలు చేయడం లేదని, కేవలం రికార్డుల్లో సంతకాలకే పరిమితమైపోతున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు.
ప్రక్షాళన చేస్తాం
రైతులు వారి పొలాల్లో పండిన కూరగాయలను రైతుబజార్లకు తెచ్చి విక్రయించుకోవాలి. రైతుబజార్లలో దళారులే ఎక్కువగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలోనే తనిఖీలు చేసి బోగస్ రైతులను ఏరివేస్తాం. ఏదైనా సమస్య వస్తే వినియోగదారుడు నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. బోర్డులపై పేర్కొన్న ధర ప్రకారమే వినియోగదారులకు కూరగాయలు విక్రయించాలి. లేకపోతే చర్యలు తీసుకుంటాం.
- నారాయణమూర్తి, ఏడీఎం, కర్నూలు
Updated Date - 2022-11-25T00:39:14+05:30 IST