భూసారం తెలిసేదెలా?
ABN, First Publish Date - 2022-12-18T23:57:23+05:30
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పది లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
అటకెక్కిన పరీక్షలు
ఆందోళనలో రైతులు
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 18: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పది లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యం లభించడంతో రైతులు భూమిలో ఏ పోషకాలు ఎంత ఉన్నదీ తెలుసుకొని ఎరువులు వాడేవారు. దీని వల్ల సాగులో భారీ ఖర్చు ఉండేది కాదు. పంటల దిగుబడి బాగా ఉండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భూసార పరీక్షలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ జిల్లాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. సాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 శాతం మంది రైతులు ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో సారం తక్కువగా ఉంది. కొన్ని చోట్ల చౌడునేలలు కూడా ఉన్నాయి. భూసారం ఆధారంగా సాగు చేస్తేనే అన్నదాతకు ఆదాయం సమకూరుతుంది. లేదంటే నష్టపోవాల్సిందే. ఏప్రిల్, మే నెలల్లో భూములు ఖాళీగా ఉంటాయి. ఆ సమయంలో భూసార పరీక్ష కోసం వ్యవసాయాధికారులు మట్టి నమూనాలు సేకరించి కర్నూలు, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన తదితర పరిశోధన కేంద్రాలకు ఆ మట్టిని పంపించేవారు. మూడేళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూసార పరీక్షల కోసం అవసరమైన కెమికల్స్‌ను సమకూర్చుకునేందుకు నిధులను అందించడం లేదు. దీంతో భూసార పరీక్షలు అటకెక్కిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో గతంలో భూసార పరీక్ష కేంద్రాలు పని చేసేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంచార ప్రయోగశాల వాహన నిర్వహణ ఖర్చు భరించలేకపోవడంతో అమరావతికి వాటిని పంపించి వేశారు. ప్రస్తుతం ఒక్క మట్టి నమూనాను కూడా అధికారులు పరీక్షించడం లేదు. ఇలా అయితే వ్యవసాయం ఎలా చేయాలని రైతులు వాపోతున్నారు.
Updated Date - 2022-12-18T23:57:24+05:30 IST