Nandyala Dist.: రేపు రాష్ట్రపతి శ్రీశైలం పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు
ABN, First Publish Date - 2022-12-25T12:14:48+05:30
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) శ్రీశైలం (Srisailam) పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం శ్రీశైలం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
నంద్యాల జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) శ్రీశైలం (Srisailam) పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం శ్రీశైలం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. తెలంగాణ (Telangana), ఆంధ్రా (Andhra) సరిహద్దు ప్రాంతమైన లింగాల గట్టు, ఏపీ సరిహద్దు ప్రాంతం శిఖరం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రపతి శ్రీశైలం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి లింగాలగట్టు, శిఖరం వద్ద రాకపోకలకు అనుమతి ఇస్తామన్నారు. శ్రీశైలం వచ్చే భక్తులు ట్రాఫిక్ ఆంక్షలకు ముందుగానే వచ్చేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. శ్రీశైలం చేరుకున్న భక్తుల వాహనాలు రింగురోడ్డు చుట్టూ ఉన్న పార్కింగ్ సముదాయంలోనే పార్కు చేయవలసి ఉంటుందన్నారు. మరోసారి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాహనాల రాకపోకలను నిలిపివేసి.. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి వెళ్ళిన వెంటనే సుండిపెంట, శిఖరం వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా శ్రీశైలానికి చేరుకునే భక్తులు సోమవారం ఉదయం 10 గంటల లోపు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే శ్రీశైలం నుంచి బయలుదేరేవారు కూడా ఉదయం 9 గంటల లోపు బయలుదేరి వెళ్లిపోయే విధంగా చూసుకోవాలని చెప్పారు.
Updated Date - 2022-12-25T12:16:08+05:30 IST