మెడికల్ సీట్ల మాఫియా!
ABN, First Publish Date - 2022-04-23T08:05:49+05:30
రాష్ట్రంలో మళ్లీ మెడికల్ సీట్ల మాఫియా తెరమీదికి వచ్చింది.

- కోట్ల రూపాయల కుంభకోణానికి ప్లాన్
- మెరిట్‌కు అన్యాయం చేస్తూ భర్తీ బ్లాక్
- 65 సీట్లు బ్లాక్ చేసినట్లు వర్సిటీ అంచనా
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ మెడికల్ సీట్ల మాఫియా తెరమీదికి వచ్చింది. పీజీ, ఎంబీబీఎస్ సీట్లే టార్గెట్‌గా కోట్ల రూపాయల కుంభకోణానికి భారీ స్కెచ్‌లే వేస్తోంది. పదేళ్ల క్రితం కాలేజీల్లో సీట్లు బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకున్న పరిస్థితి ఉంది. కాలక్రమంలో టెక్నాలజీ పెరిగి, సీట్లు బ్లాక్ చేసే విధానానికి బ్రేక్ పడింది. దశాబ్దం తర్వాత మళ్లీ మెడికల్ మాఫియా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియను కేంద్రంగా చేసుకుని కోట్ల కుంభకోణానికి కొందరు ప్రణాళిక రచించారని సమాచారం. దీనికిగాను ప్రైవేటు కాలేజీలను లక్ష్యంగా చేసుకుని పదుల సంఖ్యలో సీట్లను బ్లాక్ చేశారు. అది కూడా మేజర్ కాలేజీల్లో సీట్లు బ్లాక్ అయ్యాయి. ఆయా సీట్లను స్థానిక విద్యార్థులకు కాకుండా యూపీ, బిహర్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కేటాయించినట్టు తెలుస్తోంది. ఆయా కాలేజీల్లో ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటు రూ.30 లక్షలకు పైగా పలుకుతోంది. ఇప్పటి వరకు 65 సీట్లు బ్లాక్ అయినట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. వాస్తవంగా ఈ 65 సీట్లు మెరిట్ విద్యార్థులకు దక్కాలి. వీటిని మెడికల్ మాఫియా అక్రమంగా బ్లాక్ చేసి.. వాటిని ఎక్కువ ధరకు అమ్ముకునేలా ప్రణాళికలు రచించడం ఆలస్యంగా వెలుగు చూసింది.
అక్కడ పీజీ.. ఇక్కడ ఎంబీబీఎస్!
తెలంగాణలో ఇప్పటికే కొన్ని పీజీ సీట్లు బ్లాక్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అక్కడ పీజీ సీట్లు బ్లాక్ చేస్తే.. ఏపీలో ఎంబీబీఎస్ సీట్లపై మాఫియా కన్నేసింది. గత నెల 4న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ, సీ కేటగిరి సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 5 నుంచి 11 వరకు దరఖాస్తులు తీసుకున్నారు. అదే నెల 26 నుంచి 27 వరకు తొలి విడత కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు దరఖాస్తుదారులకు అవకాశం కల్పించారు. 18 ప్రైవేటు వైద్య కాలేజీల్లో సీట్లు కలిపి 938 ‘బీ’ కేటగిరి సీట్లు, 435 ‘సీ’ కేటగిరి సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ‘సీ’ కేటగిరీ విషయంలో ఇబ్బంది లేదు. ఈ కేటగిరిలో కాలేజీల ఆధారంగా సీటును రూ.25-35 లక్షల వరకు అమ్ముకునేందుకు వర్సిటీ అనుమతిచ్చింది. ‘బీ’ కేటగిరీ సీట్లలోనే సమస్య వచ్చింది. వర్సిటీ అధికారులు వీటి భర్తీకి ఇప్పటి వరకు మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు.
మొదటి, రెండో విడతలతో పాటు ‘మాప్ అప్ రౌండ్’ నిర్వహించారు. మెడికల్ మాఫియా తొలి నుంచి కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తూ వచ్చింది. తొలి, రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు బ్లాక్ చేసే పరిస్థితి ఉండదు. దీంతో మొత్తం వ్యవహారం మాప్ అప్ రౌండ్‌లోనే జరిగిందని తెలుస్తోంది. మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత వారంపాటు అభ్యర్థులు కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. అభ్యర్థులు చేరకుండా మిగిలిపోయిన ‘బీ’ కేటగిరీ వివరాలను వర్సిటీకి పంపించారు. మాప్ అప్ రౌండ్ తర్వాత మిగిలిన సీట్ల కోసం మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించరు. ఈ సీట్లను కాలేజీ యాజమాన్యం ‘సీ’ కేటగిరిగా మార్చుకుని అమ్ముకునే అవకాశం ఉంది. ఇదే మెడికల్ మాఫియాకు పెద్ద అస్త్రంగా మారింది. మాప్ అప్ రౌండ్ తర్వాత కొన్ని కాలేజీల్లో సీట్లు బ్లాక్ చేశారు. ముఖ్యంగా గుంటూరుకు సమీపంలోని ఒక మేజర్ మెడికల్ కాలేజీలో 20 సీట్లు, మిగిలిన కాలేజీల్లో 3 నుంచి 4 సీట్ల వరకు బ్లాక్ చేశారు. ‘సీ’ కేటగిరి సీటుకు రూ.25-35 లక్షల వరకు వసూలు చేశారు. నాలుగున్నరేళ్లకు కలిపి రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు చెల్లించాలి. సీట్లు బ్లాక్ కావడంపై వర్సిటీ కూడా తప్పుదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. మాప్ అప్ రౌండ్‌ను మరోసారి నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాఫియా వ్యవహారంపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విషయాన్నీ పరిశీలిస్తున్నారు.
Updated Date - 2022-04-23T08:05:49+05:30 IST