Raithu Barosa : పైసలు పడలేదు జగనా!
ABN, First Publish Date - 2022-10-30T05:13:00+05:30
ఇల్లు అలకగానే పండగ కాదు. అలాగే... బటన్ నొక్కగానే డబ్బులూ పడవు! అన్నీ ఉత్తుత్తి నొక్కుళ్లూ... మాయ చేసే మాటలే! దీనికి తాజా ఉదాహరణ...
రైతు భరోసాపై ఉత్తుత్తి ‘నొక్కుడేనా’!?
17న ఆళ్లగడ్డలో బటన్ నొక్కిన సీఎం
వెంటనే రూ.4 వేలు పడతాయని స్పీచ్
పీఎం కిసాన్ 2 వేలు మాత్రమే జమ
అనేక మందికి జమకాని రాష్ట్ర వాటా
(అమరావతి - ఆంధ్రజ్యోతి) : ఇల్లు అలకగానే పండగ కాదు. అలాగే... బటన్ నొక్కగానే డబ్బులూ పడవు! అన్నీ ఉత్తుత్తి నొక్కుళ్లూ... మాయ చేసే మాటలే! దీనికి తాజా ఉదాహరణ... ‘రైతు భరోసా’ బటన్ నొక్కుడే! ‘వైఎస్సార్ రైతు భరోసా’ రెండో విడత డబ్బులు వేసేస్తున్నామహో.... అంటూ ఈనెల 17వ తేదీన కోట్లు ఖర్చుపెట్టి పత్రికల్లో ప్రకటనలు జారీ చేశారు. ‘నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం బటన్ నొక్కిన వెంటనే రూ.4వేలు రైతుల ఖాతాలో పడిపోతాయి’ అని ఊదరగొట్టారు. ఇందులో రూ.2వేలు కేంద్ర ప్రభుత్వ వాటా అయినప్పటికీ, దానికి కూడా జగన్ తన కలరింగ్ ఇచ్చుకున్నారు. ఆళ్లగడ్డ జూనియర్ కళాశాల మైదానంలో సభ పెట్టి జగన్ బటన్ నొక్కారు. ఆ నొక్కుడు నొక్కి ఇప్పటికి దాదాపు రెండు వారాలు! దాదాపు మూడోవంతు మంది రైతులకు రాష్ట్ర వాటాగా పడాల్సిన రూ.2వేలు పడలేదని తెలుస్తోంది. దీంతో బటన్ నొక్కుడు మాయేనా అనిరైతులు విస్తుపోతున్నారు. ‘‘రెండో విడతకు సంబంధించి 50.92లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,096కోట్లు జమ చేస్తున్నాం’’ అని ఆళ్లగడ్డలో సీఎం చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటున్నారు.
మాటమీద నిలబడటం ఇదేనా...
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి! ‘వెంటనే’ అని రెండువారాలవుతోంది. అయినా...మూడోవంతు రైతుల ఖాతాల్లోకి భరోసా డబ్బులు రూ.2వేలు పడకపోవడం గమనార్హం. కొన్నిచోట్ల దాదాపు సగం మంది రైతులకు సొమ్ము జమ కాలేదని సమాచారం. గతంలో క్యాంప్ ఆఫీ్‌సలో కూర్చుని బటన్ నొక్కితే... కనీసం వారంలోనైనా డబ్బులు జమ అయ్యాయి. ఈసారి ఆళ్లగడ్డ వెళ్లి బటన్ నొక్కి రెండు వారాలవుతున్నా డబ్బులు పడనే లేదు. అదేరోజున జగన్‌కంటే ముందు ఢిల్లీలో ప్రధాని మోదీ బటన్ నొక్కిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ టకటకా రూ.2వేలు ‘పీఎం కిసాన్’ డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులు మాత్రం జమ కాలేదు. రైతు భరోసా వెబ్‌సైట్‌లో స్టేటస్ చూసుకుని, బ్యాంక్ ఖాతాలో ఒక రూ.2వేలే కన్పిస్తుండటంతో సొంత పార్టీ వారే ఖంగుతింటున్నారు. సొంత భూమి ఉన్న రైతులకు పీఎం కిసాన్ రూ.2వేలైనా పడ్డాయి. కౌలు రైతులకు జగన్ సర్కార్ చెప్పిన రూ.4వేలలో రూపాయి కూడా పడలేదు. దీనిపై క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులను అడిగితే... వేల ఖాతాలకు ‘ప్రాసెస్’ అనే వస్తోందని చెబుతున్నారు. లబ్ధిదారులు ఈకేవైసీ నమోదు చేసుకోకపోయినా.. బ్యాంక్ ఖాతాలు ఫ్రీజింగ్‌లో ఉన్నా.. లబ్ధిదారు మృతి చెందినా.. ఆదాయపన్ను పరిధిలోకి వెళ్లినా.. రైతుభరోసా - పీఎం కిసాన్ రాదని బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అసలు సొమ్ము పడుతుందా? లేదా? అని చాలా మంది మదనపడుతున్నారు.
Updated Date - 2022-10-30T06:24:30+05:30 IST