ఒడిదుడుకులలో కర్ణాటక పొగాకు మార్కెట్
ABN, First Publish Date - 2022-10-30T00:15:42+05:30
రాష్ట్రంలో రానున్న సీజన్ మార్కెట్‌కు దిక్చూచిగా పరిగణించే ప్రస్తుత కర్ణాటక పొగాకు మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అనుమతిచ్చిన దానికన్నా గణనీయంగా పంట ఉత్పత్తి తగ్గడమే కాక పండిన పంటలో నాణ్యమైనది అధికంగా ఉన్నప్పటికి ఆశించిన ధరలు అక్కడి రైతులకు అందడం లేదని సమాచారం.
ఇటీవల వారం నిలిచిన వేలం
ఒంగోలు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న సీజన్ మార్కెట్‌కు దిక్చూచిగా పరిగణించే ప్రస్తుత కర్ణాటక పొగాకు మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అనుమతిచ్చిన దానికన్నా గణనీయంగా పంట ఉత్పత్తి తగ్గడమే కాక పండిన పంటలో నాణ్యమైనది అధికంగా ఉన్నప్పటికి ఆశించిన ధరలు అక్కడి రైతులకు అందడం లేదని సమాచారం. మెరుగైన ధరలు రైతులకు లభించేందుకు పలు సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికి వ్యాపారుల మాయాజాలంతో పతనమయ్యాయి. గరిష్ఠ ధర కిలో రూ.265కు వెళ్ళి తిరిగి రూ.235కు పడిపోవడంతో ఆందోళన చెందిన అక్కడి రైతులు ఇటీవల ఏకంగా వారంరోజుల పాటు వేలం నిలిపేశారు. దీపావళి అనంతరం తిరిగి కొనుగోళ్లు ప్రారంభమైనా ధరలు మాత్రం పెరగకపోవడంతో మేలు రకం కాకుండా మీడియం, లోగ్రేడ్ బేళ్ళను మాత్రమే అధికశాతం మంది ప్రస్తుతం అమ్మకాలకు తెస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో ప్రస్తుత సీజన్‌లో వంద మిలియన్ కిలోలు పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. ప్రతికూల వాతావరణం, అధిక వర్షాలు ఇతరత్రా కారణాలతో దాదాపు 40శాతం పంట ఉత్పత్తి తగ్గిపోయింది. మొత్తం మీద 60 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా కాగా ఈనెల 10 నుంచి అక్కడ పొగాకు బోర్డు అధికారులు వేలం ప్రారంభించారు. ప్రారంభ గరిష్ఠ ధర కిలో రూ.250 ఇవ్వాలని రైతులు ముందుగానే డిమాండ్ చేయగా గత ఏడాది వలే రూ.175 లేదా రూ. 185తో ప్రారంభించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. కాగా బోర్డు అధికారులు చొరవచూపడంతో రూ.200తో వేలం ప్రారంభమైంది. తొలి వారం, పది రోజులు హాట్‌హాట్‌గానే వేలం సాగింది. ప్రారంభం రోజున గరిష్ఠ ధర కిలో రూ.200 నుంచి వారంలోనే రూ.235కు చేరగా కొన్నిరోజులు నిలకడగా సాగి అనంతరం ఒక్కసారిగా రూ.265కు పెరిగింది.
చిన్న డీలర్లను దెబ్బకొట్టేందుకే..
తక్కువ పరిమాణంలో పొగాకు కొనుగోలు చేసే చిన్న చిన్న డీలర్లను దెబ్బకొట్టేందుకు పెద్ద కంపెనీలు అలా ఒక్కసారిగా ధరలు పెంచేశాయి. దీంతో ఆ ధరలకు కొనేందుకు చిన్న డీలర్లు ముందుకు రాలేదు. దీంతో పెద్ద కంపెనీల వారు తిరిగి మళ్లీ రూ.235కు ధరలకు దించేశారు. దీంతో అసంతృప్తి చెందిన అక్కడి రైతులు దీపావళికి ముందు దాదాపు వారంరోజుల పాటు వేలంను నిలిపేశారు. దీంతో అప్రమత్తమైన బోర్డు అధికారులు అటు వ్యాపారులు, ఇటు రైతులతో సంప్రదింపులు చేసి దీపావళి అనంతరం తిరిగి వేలం ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. అలా ప్రస్తుతం వేలం అక్కడి పది కేంద్రాల్లో కొనసాగుతున్నప్పటికి గరిష్ఠ ధరలలో పెరుగుదల మాత్రం లేదు. కిలో రూ.235 దాటడం లేదు. లోగ్రేడ్‌లకు గరిష్ఠంగా కిలో రూ.190 వరకు ధరలు ఉంటుండటం, ఈ ఏడాది పంట ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్ చివరిలోనైనా మేలురకం పొగాకు ధరలు తప్పక వస్తాయన్న ఆలోచనతో అక్కడి రైతులు అలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
తగ్గిన బేళ్ల రాక
ఈ ప్రభావం రోజువారీ కొనుగోళ్లపై కనిపిస్తోంది. వేలం ఆగక ముందు ఒక్కొక్క వేలంకేంద్రానికి సగటున వెయ్యి బేళ్ల వరకు రాగా ప్రస్తుతం 500 బేళ్లు మించడం లేదని, ఇలా అయితే వేలం ప్రక్రియ తీవ్రనష్టం జరుగుతుందన్న ఆందోళన అధికారులు, వ్యాపారుల్లో వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది ప్రాంతంలో ఈ సీజన్ పొగాకు నాట్లు ముమ్మరంగా సాగుతున్న సమయంలో కర్ణాటక మార్కెట్లో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని పొగాకు రంగంలోని నిపుణులు అంటున్నారు. అక్కడ పంట తగ్గిందన్న ధీమాతో ఇక్కడి రైతులు అధికంగా సాగు చేస్తే భవిష్యత్‌లో ధరలు ఏ మేర అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంటుందన్నారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రస్తుతం పంట సాగు చే సే రైతులు వాస్తవ పరిస్థితులు గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించి అనుమతించిన దాని కన్నా మించకుండా సాగు చేయాలని సూచిస్తున్నారు.
Updated Date - 2022-10-30T00:15:45+05:30 IST