తాగునీటి కోసం రాస్తారోకో
ABN, First Publish Date - 2022-11-03T23:03:14+05:30
తాగునీటి సమస్యను తీర్చాలంటూ గురువారం నగర పంచాయతీ పరిఽధిలోని కంభాలపాడులో గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. ఒంగోలు-కర్నూలు రోడ్డుపై మహిళలు ఖాళీ బిందెలతో భైఠాయించి నిరసన తెలిపారు.
గంటకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం
బోరు ఏర్పాటుకు అధికారుల హామీ, ఆందోళన విరమణ
పొదిలిరూరల్ నవంబరు 3: తాగునీటి సమస్యను తీర్చాలంటూ గురువారం నగర పంచాయతీ పరిఽధిలోని కంభాలపాడులో గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. ఒంగోలు-కర్నూలు రోడ్డుపై మహిళలు ఖాళీ బిందెలతో భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వాడుకకు నీరు లేదని, నెలరోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. నగర పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్నామన్నారు. అధికారులు వచ్చి నీటి సరఫరాను పునరుద్ధరించే వరకు నిరసన కొనసాగిస్తామంటూ గంటకుపైగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీహరి అక్కడకు చేరుకున్నారు. నగర పంచాయతీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బోరు వేసి త్వరలో నీటి సమస్య తీరుస్తామని వారు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసన విరమించారు.
అధికారులు ప్రజల కోసం పనిచేయడం లేదు
-మార్తమ్మ గ్రామస్థురాలు
నాయకులు అధికారులు ప్రజల కోసం పనిచేయడం లేదు. ప్రభుత్వం కూడా ప్రజాధనాన్ని పెద్దలకు దోచిపెట్టడానికి పనిచేస్తుంది. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో నిధులు వెచ్చించి సమస్య తీరిస్తే బాగుంటుంది. నీటిసమస్య తీర్చేందుకు కృషిచేయాలి.
ఓట్ల సమయంలోనే ప్రజల ముందుకు
-లీగల దేవత
ఓట్ల సమయంలోనే నాయకులు ప్రజల ముందుకు వస్తారు ఆ తర్వాత కన్నెత్తి చూడరు. గ్రామాల్లో సైడు కాలువలు లేక మరికినీరు నిలబడి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దీనిపై అధికారులకు మొరపెట్టుకుంటే అప్పుడు వచ్చి నామమాత్రంగా బ్లీచింగ్ చల్లి చేతులు దులుపుకుంటారు. నాయకులు, అధికారులు కలిసి మా గ్రామంలో నీటి సమస్య తీర్చాలి.
Updated Date - 2022-11-03T23:03:19+05:30 IST