విజయవాడ: వైఎస్సార్ పేరు మీద అవార్డుల ప్రదానం
ABN, First Publish Date - 2022-11-01T12:09:40+05:30
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో జరిగింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం ఉదయం విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో జరిగింది. వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ అవార్డులు అందజేశారు. 20 వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, 10 వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారం, మేమొంటో, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సిఎం తల్లి విజయలక్ష్మి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సమాజం కోసం శ్రమిస్తున్న మహనీయులను అవార్డులకు ఎంపిక చేసినట్లు చెప్పారు. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులకు సేవలందిస్తున్న వారికి వైయస్సార్ అఛీవ్ మెంట్, వైయస్సార్ లైఫ్ అచీవ్ మెంట్ కింద అవార్డులు ప్రకటించామన్నారు. తమ స్వేదంతో ఆదర్శవంతమైన సాగుబడితో, దిగుబడి అందించే రైతన్నలను ఎంపిక చేసినట్లు చెప్పారు. మన రక్షణ సారధులకు, సామాజిక సేవ చేసేవారికి వైద్యం, జర్నలిజం, పారిశ్రామిక దిగ్గజాలకు ఈరోజు అవార్డుకు ఎంపిక చేశామన్నారు. మన ప్రభుత్వం ఇటువంటి సేవలను గుర్తిస్తూ ... అండగా ఉంటుందనే సంకేతంతో తండ్రి వైఎస్సార్ పేరు మీద ఈ అవార్డులు ఇస్తున్నామన్నారు. మహిళ, నిరుపేద పక్ష పాతిగా, ఆయన ప్రజలకు అందించిన సేవలకు గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవార్డులు అందుకుంటున్న వారందరికీ తన తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేశారు.
Updated Date - 2022-11-01T12:09:44+05:30 IST