Yanamala Rama Krishnudu: రాష్ట్రం ఆర్థికంగా దివాలా: యనమల
ABN, First Publish Date - 2022-11-05T19:15:53+05:30
మూడున్నరేళ్ల వైఎస్ జగన్ (YS Jagan) పాలనలో ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) విమర్శించారు.
విశాఖపట్నం: మూడున్నరేళ్ల వైఎస్ జగన్ (YS Jagan) పాలనలో ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్యుల ఆదాయం పెరగలేదని, వైసీపీ (YCP)కి చెందిన దోపిడీదారుల ఆదాయం మాత్రం అనూహ్యంగా పెరిగిందన్నారు. వనరులను దోచుకోవాలని తన మనుషులను ముఖ్యమంత్రే రాష్ట్రంపైకి వదిలేశారని ఆరోపించారు. పరిశ్రమలు రానందున నియామకాలు తగ్గిపోవడంతో లక్షలాది మంది యువత తీవ్ర నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జగన్‌కు వేధించడం తప్ప మరొకటి తెలియదని, ఆయన ఫ్యాక్షన్ మూలాల నుంచి వచ్చిన వ్యక్తి అని యనమల ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ (Visakhapatnam)లో మూడు పారిశ్రామిక సదస్సులు నిర్వహించి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ.8.5 లక్షల కోట్లకు చేరిందని, వచ్చే ఏడాదిన్నరలో రూ. పది లక్షల కోట్లకు చేరుకుంటుందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత అప్పు తీసుకువస్తున్నా పేదరికం తగ్గడం లేదన్నారు. అప్పులు తీర్చడానికి ఇక నుంచి ఏటా రూ.లక్ష కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అప్పుడు రాష్ట్రంలో వృద్ధి, సంక్షేమం వంటి సంగతేమిటని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
Updated Date - 2022-11-05T19:15:55+05:30 IST