Nellore: ఏం బావా.. వస్తావా!?
ABN, First Publish Date - 2022-10-16T01:51:31+05:30
నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉన్న ప్రాంతం అది. వైద్యం కోసం కొంతమంది.. సినిమాల కోసం ఇంకొంతమంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే రాత్రింబవళ్లు..
రెడ్‌లైట్ ఏరియాగా రైల్వేకట్ట ప్రాంతం
తప్పుదోవ పడుతున్న యువత
ఆసుపత్రులకు, సినిమాకు వచ్చే మహిళలకు తప్పని వేధింపులు
నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉన్న ప్రాంతం అది. వైద్యం కోసం కొంతమంది.. సినిమాల కోసం ఇంకొంతమంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే రాత్రింబవళ్లు ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. అలాంటి రద్దీ ప్రాంతంలో చీకటి పడితే చాలు కొంతమంది మహిళలు, హిజ్రాలు అక్కడకు చేరిపోతుంటారు. ప్రాంతాలను పంచుకుని మరీ వచ్చి పోయే వారిని కవ్విస్తారు. ‘‘ఏ బావా వస్తావా!? నీ కావాల్సింది నా దగ్గర ఉంది.’’ అంటూ మత్తుగా పెదాలు కొరుకుతూ సైగలు చేసి ఆహ్వానిస్తున్నారు. నక్కలోళ్ల సెంటర్ దాటాక పొగతోట నుంచి బృందావనంలోని ఎస్-2 థియేటర్ దాటి మలుపు తిరిగే వరకు రైలు కట్ట వెంబడి రెడ్‌లైట్ ఏరియాను తలపించే పరిస్థితులు ఇవి.
నెల్లూరు: నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, తిరుపతి, కడప, కర్నూలు ఇలా అనేక జిల్లాల నుంచి నెల్లూరులో ఉన్న ప్రముఖ వైద్యశాలలకు ప్రతి రోజు వేలాది మంది ప్రజలు వస్తుంటారు. రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా 24 గంటలు పొగతోట నుంచి బృందావనం వరకు వందలాది వైద్యశాలలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ప్రధాన రైల్వేస్టేషన్, ఆత్మకూరు బస్టాండు, ఆర్టీసీ ప్రధాన బస్టాండు, దక్షిణ రైల్వే స్టేషన్లలో బస్సులు, రైళ్లు ద్వారా వేలాది మంది వైద్యశాలలకు వస్తూనే ఉంటారు. అలాగే, ఎప్పటి నుంచో మంచి పేరున్న మూడు హాళ్లు ప్రస్తుతం ఎస్-2 థియేటర్లకు రాత్రి 2 గంటల సమయంలోనూ సెకండ్ షో చూసుకొని ఇళ్లకు ఎంతోమంది వెళుతుంటారు. అలాంటి ప్రాంతాలైన పొగతోట, బృందావనంలో ఇటీవల వేశ్యలు, హిజ్రాలు రైల్వేకట్ట పక్కన నిలబడి దారినపోయే వారిని చేతులు ఊపుతూ వస్తావా!? అంటూ పిలుస్తున్నారు. బైక్‌లు, ఆటోలు, కార్లలో వచ్చి గుంపులు గుంపులుగా నిల్చొని బేరసారాలు ఆడుతుంటారు. రాత్రి 8 దాటాక అర్ధరాత్రి 2 గంటల వరకు ఇవే పరిస్థితులు నెలకుంటున్నాయి.
మహిళలకు తప్పని వేధింపులు
పొగతోట, బృందావనం ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యశాలకు వచ్చి వెళ్లే కొందరు మహిళలను అక్కడకు వచ్చిన విటులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, జిల్లాతోపాటు దూరప్రాంతాలకు చెందిన ఎంతోమంది యువకులు ఉపాధి, విద్య కోసం నగరంలో ఉంటున్నారు. రైలుకట్ట పక్కనే వరుసగా వేశ్యలు, హిజ్రాలు యువకులను ఆకర్షించేలా వయ్యారాలు వలకబోస్తూ సైగలు చేస్తుండటంతో ఆకర్షితులవుతున్నారు. వారి మోజులో పడి జీవితాను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఈ ప్రాంతంపై దృష్టి సారించి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నగర ప్రజానీకం కోరుతోంది.
Updated Date - 2022-10-16T01:51:31+05:30 IST