దూసుకొస్తున్న మాండస్
ABN, First Publish Date - 2022-12-08T02:37:41+05:30
దక్షిణ కోస్తా, రాయలసీమలకు తుఫాను(మాండస్) ముప్పు పొంచి ఉంది.
నేడు తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
ఎల్లుండి పుదుచ్చేరి-శ్రీహరికోటమధ్య తీరం దాటే చాన్స్
నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు
మత్స్యకారులు సంద్రంలోకి వెళ్లొద్దని సూచన
విశాఖపట్నం, అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా, రాయలసీమలకు తుఫాను(మాండస్) ముప్పు పొంచి ఉంది. తుఫాను శనివారం ఉదయం చెన్నైకి సమీపం లో తీరం దాటనుందని వాతావరణ నిపుణులు అంచనా వేశా రు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతిభారీ వర్షా లు కురవడంతోపాటు సముద్ర తీరప్రాంతాల్లో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. బుధవారం సాయంత్రం ట్రింకోమలైకి 420 కి.మీ. తూర్పు ఈశాన్యంగా, చెన్నైకి 700 కిలోమీటర్లు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయానికి తుఫానుగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానుంది.
10న ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కి.మీ., అప్పుడప్పుడు 85 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీని ప్రభావంతో గురువారం నుంచి దక్షిణ కోస్తా, సీమల్లో వర్షాలు ప్రారంభమవుతాయి. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో గురువారం నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా, తుఫాను నేపథ్యంలో సహాయక చర్యల కోసం 5 ఎన్డీఆర్‌ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ఆయా జిల్లాలకు తరలించినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Updated Date - 2022-12-08T02:37:42+05:30 IST