Rains: ఏపీకి ‘మాండస్’ ముప్పు.. విస్తారంగా వర్షాలు
ABN, First Publish Date - 2022-12-08T19:52:33+05:30
కోస్తా, రాయలసీమ (Rayalaseema) రైతులకు మాండస్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రెండు మూడు రోజుల నుంచి వాతావరణ శాఖ జారీచేస్తున్న హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
విశాఖపట్నం: కోస్తా, రాయలసీమ (Rayalaseema) రైతులకు మాండస్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రెండు మూడు రోజుల నుంచి వాతావరణ శాఖ జారీచేస్తున్న హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పండించే వరి పంట, పండ్లతోటలకు నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం రాత్రి ఏర్పడిన తుఫాన్ ‘మాండస్’ వడివడిగా పయనిస్తూ గురువారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. గంటకు సగటున 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశలో పయినిస్తూ, భారీగా తేమ మోసుకుంటూ ఉత్తర తమిళనాడు (North Tamil Nadu), దక్షిణ కోస్తా తీరం దిశగా వస్తోంది. ఈ క్రమంలో వేగంగా కదులుతూ గురువారం మధ్యాహ్నానికి ట్రింకోమలైకు 250 కి.మీ. తూర్పు ఈశాన్యంగా, చెన్నైకు 480 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇంకా పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా బలపడనున్నది. తరువాత అదే తీవ్రతతో ఉత్తర తమిళనాడు తీరం దిశగా పయనిస్తూ శుక్రవారం ఉదయానికి కొంత బలహీనపడి తుఫాన్‌గా మారనున్నది. అటు తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి శుక్రవారం అర్ధరాత్రికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు చేరువగా పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్యలో మహాబలిపురం వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి పదో తేదీ ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నదని పేర్కొంది.
వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇప్పటికే ప్రారంభమైన వర్షాలు శుక్రవారం ఉదయం నుంచి మరింత పెరగనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, బాపట్ల, ప్రకాశం, కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల పదో తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో నెల్లూరు, చిత్తూరు (Nellore, Chittoor), అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తా తీరంవెంబడి బలమైన గాలులు వీస్తున్నందున శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దు. కోస్తాలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం రేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.
Updated Date - 2022-12-08T19:52:35+05:30 IST